వన్డే వార్‌

ABN , First Publish Date - 2023-03-19T01:19:15+05:30 IST

పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం భారత్‌, ఆస్ర్టేలియా మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు నిర్వాహకులు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు.

వన్డే వార్‌

విశాఖలో నేడే భారత్‌, ఆస్ర్టేలియా మధ్య మ్యాచ్‌

వేదికగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియం

కీలక పోరుకు సర్వం సిద్ధం

సిరీస్‌లో తొలి వన్డేలో విజయంతో ఊపు మీదున్న ఆతిథ్య భారత్‌

విశాఖ చేరిన ఇరుజట్ల ఆటగాళ్లు

విశాఖపట్నం-స్పోర్ట్సు, మార్చి 18:

పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం భారత్‌, ఆస్ర్టేలియా మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు నిర్వాహకులు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డేకు నగరం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో క్రీడాభిమానుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అయితే శనివారం రాత్రి నుంచి వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ జరుగుతుందో, లేదోనన్న ఆందోళన వెంటాడుతోంది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్‌ ఆటగాళ్లు రెండో వన్డేకు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనున్నారు. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేలో ఆడని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ కూడా రెండో వన్డేకు జట్టులో చేరడం మరింత బలాన్నిస్తుంది. ఇక ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను కోల్పోవడంతో పాటు తొలి వన్డేలో ఓటమి చెందిన ఆస్ట్రేలియాకు రెండో వన్డే చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేని పక్షంలో వన్డే సిరీస్‌ను కూడా చేజార్చుకున్నట్టవుతుంది. అందుకే గెలుపు కోసం ఆ జట్టు సర్వశక్తులూ ఒడ్డనుండడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్‌ ట్రాక్‌ రికార్డు అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆడిన మ్యాచ్‌లలో అత్యధికం విజయం సాధించింది. దీంతో మరోమారు విజయం ఖాయమని క్రికెట్‌ అభిమానులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

పిచ్‌పై అంచనాలు....300 పైగా స్కోరు

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని పిచ్‌ (వికెట్‌)పై 300కు పైగా స్కోరు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన వన్డే మ్యాచ్‌లను పరిశీలిస్తే...2019 డిసెంబరు 18న వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 387/5 స్కోరు చేసి రికార్డు నెలకొల్పింది. అత్యధిక వ్యక్తిగత స్కోరు (159) రికార్డు కూడా భారత్‌ సారథి రోహిత్‌శర్మ పేరిట ఉంది. కాగా ఈ వికెట్‌పై వన్డే క్రికెట్‌లో అత్యల్ప స్కోరు (79) చేసిన చెత్త రికార్డు న్యూజిలాండ్‌ పేరిట ఉంది. 2016 అక్టోబరు 29న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 259 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ 23.1 ఓవర్లలో 79 పరుగులకు కుప్పకూలింది.

బార్‌ కోడ్‌ ఎంట్రీ

ఈ మ్యాచ్‌కు బార్‌ కోడ్‌ ప్రవేశాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం ప్రవేశ ద్వారాల వద్ద వైఫైతో కూడిన స్కానర్‌లను ఏర్పాటుచేశారు. ప్రేక్షకులు టికెట్‌పై గల బార్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లోపలకు ప్రవేశించాల్సి ఉంటుంది. తోపులాటకు తావివ్వకుండా వుండేందుకు మ్యాచ్‌ మొదలయ్యే రెండు గంటల ముందు నుంచి లోపలకు ప్రవేశించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ ప్రతి గేట్‌ వద్ద పోలీసు బందోబస్తుతోపాటు బౌన్సర్లను ఏర్పాటుచేస్తున్నారు. ప్రేక్షకులు క్యూ పద్ధతి లోపలకు ప్రవేశించే చర్యలు చేపట్టనున్నారు.

ఉచిత తాగునీరు, వైద్య సదుపాయం

వాటర్‌ బాటిల్స్‌ వంటి వాటిని స్టేడియంలోకి అనుమతించరు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల సౌకర్యార్థం స్టేడియంలో అన్ని గ్యాలరీల వద్ద ఉచితంగా తాగునీరు సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

మ్యాచ్‌పై వర్షం ప్రభావం

మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మ్యాచ్‌ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే వర్షం తెరిపిచ్చినట్టయితే 45 నిమిషాలలో మ్యాచ్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే పిచ్‌ (వికెట్‌), అవుట్‌ ఫీల్డ్‌ పాడవకుండా పూర్తిగా కవర్స్‌తో కప్పి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అవుట్‌ ఫీల్డ్‌పై వున్న తడిని డ్రై చేసేందుకు ఆధునిక సూపర్‌ సాపర్స్‌ మిషన్‌లు మూడింటిని సిద్ధం చేసినట్టు పేర్కొంటున్నారు.

మ్యాచ్‌ టైమింగ్స్‌:

తొలి సెషన్‌ మధ్యాహ్నం 1.30 నుంచి 5.00 గంటల వరకు, సెకండ్‌ సెషన్‌ సాయంత్రం 5.45 నుంచి మ్యాచ్‌ పూర్తయ్యే వరకు;

సాయంత్రం 5.00 నుంచి 5.45 గంటల వరకు 45 నిమిషాలు బ్రేక్‌

ప్రేక్షకులు ప్రవేశ సమయం: ఉదయం 11.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు

Updated Date - 2023-03-19T01:19:15+05:30 IST