ఫిషింగ్‌ హార్బర్‌ ఏదీ!?

ABN , First Publish Date - 2023-01-25T01:17:23+05:30 IST

‘అర చేతిలో వైకుంఠం చూపడం’ సీఎం నుంచి కిందిస్థాయిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వరకు వెన్నతోపెట్టిన విద్య. ‘ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు...’ అన్న సామెత కూడా వైసీపీ పాలకులకు బాగా అతికినట్టు సరిపోతుంది. అధికార పార్టీ నాయకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అసలు పొంతన ఉండదు. అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై వీరు చేస్తున్న ప్రకటనలే ఇందుకు ఒక ఉదాహరణ.

ఫిషింగ్‌ హార్బర్‌ ఏదీ!?
ఉప్పుటేరులో మత్స్యకారుల బోట్లు

పూడిమడకలో జెట్టీ నిర్మాణంపై కోటలు దాటుతున్న పాలకులు మాటలు

మూడున్నరేళ్లయినా శంకుస్థాపన చేయని వైనం!

ఇంతవరకు భూమిని అప్పగించని రెవెన్యూ శాఖ

అయినా... నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయంటూ సీఎం నుంచి మంత్రుల వరకు గొప్పలు

వైసీపీ నేతల మాటలతో విస్తుపోతున్న పూడిమడక మత్స్యకారులు

అచ్యుతాపురం, జనవరి 24: ‘అర చేతిలో వైకుంఠం చూపడం’ సీఎం నుంచి కిందిస్థాయిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వరకు వెన్నతోపెట్టిన విద్య. ‘ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు...’ అన్న సామెత కూడా వైసీపీ పాలకులకు బాగా అతికినట్టు సరిపోతుంది. అధికార పార్టీ నాయకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అసలు పొంతన ఉండదు. అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై వీరు చేస్తున్న ప్రకటనలే ఇందుకు ఒక ఉదాహరణ.

ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక నుంచి ఏటా భారీ స్థాయిలో చేపల ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ పడవలు నిలుపుకోవడానికి సరైన సదుపాయం లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య గత తెలుగుదేశం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబు 2016 జూలైలో అచ్యుతాపురం సెజ్‌కు వచ్చిన సందర్భంగా పూడిమడకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి నివేదిక అందజేసే బాధ్యతను వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ (వాప్‌కాస్‌) సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ పలుమార్లు సర్వేలు నిర్వహించి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ఈ ప్రదేశం అనుకూలమేనని నివేదిక ఇచ్చింది. ఇంకా కొన్ని సూచనలు కూడా చేసింది. చేపల వేట అనంతరం మత్స్యకారులు తమ పడవలను జాలారిపాలెం నుంచి కొండపాలెం వరకు సముద్ర తీరంలో ఉంచుతున్నారు. అక్కడ నుంచి చేపలను పూడిమడక బస్టాండ్‌ వరకు మోసుకు వస్తున్నారు. దీనివల్ల బీచ్‌ అంతా పడవలతో నిండిపోవడంతో పాటు అపరిశుభ్రంగా ఉంటున్నది. ఉప్పుటేరును లోతు చేసి, అక్కడ పడవలు నిలుపుకునేలా చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించింది. పల్లిపేట శివారులోని రుద్రభూమి నుంచి పొగిరి వరకు మూడు కిలో మీటర్ల మేర రోడ్డు వేయాలని కూడా సూచించారు. ఇక ఫిషింగ్‌ హార్బర్‌ (జెట్టీ) నిర్మాణానికి 35 హెక్టార్లు అవసరమని నిర్ణయించారు. సముద్ర తీరంలో పూడిమడక పంచాయతీ సర్వే నంబర్‌ 139లో 216 ఎకరాల ప్రభుత్వ భూమి వుందని, దీనిలో 35 హెక్టార్లను ఫిషింగ్‌ హార్బర్‌కు కేటాయిస్తామని అప్పటి తహసీల్దార్‌ ప్రకటించారు. ఈ మొత్తం పనులకు రూ.350 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. తదుపరి సర్వేలు జరుగుతుండగా ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం అటకెక్కింది. తరువాత జిల్లా, రాష్ట్రస్థాయిల్లో పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం గురించి ప్రకటనలు చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా కదలలేదు.

వాస్తవ పరిస్థితి ఇలా వుండగా... గత ఏడాది జూలైలో నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన సీఎం జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలో ఎనిమిదిచోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయంటూ ఆయా ప్రాంతాల పేర్లు చెప్పుకొచ్చారు. వాటిల్లో రెండో పేరు పూడిమడక హార్బర్‌. ఇక మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సందర్భంగా రాష్ట్రంలో ఐదు చోట్ల ఫిషింగ్‌ హార్బర్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయని, వీటిలో పూడిమడక కూడా వుందని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ఇంతవరకు శంకుస్థాపనే జరగలేదు.

టెండర్లు పూర్తయినా... మొదలుకాని పనులు!

రాష్ట్రంలో ఐదుచోట్ల (కొత్తపట్నం, ఓడలరేవు, బియ్యపుతిప్ప, బుడగట్లపాలెం, పూడిమడక) ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించడానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పనులన్నీ ఒకే కంపెనీకి అప్పగించినట్టు సమాచారం. కానీ పూడిమడకలో ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు.

స్థలం కేటాయించాలి

మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు

పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ (జెట్టీ) నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రోడ్డు నిర్మాణం, ఇతర అవసరాలకు 37 హెక్టార్ల భూమి అవసరం. భూమి బదలాయింపునకు ఇంకా అనుమతులు రాలేదు. సీసీఎల్‌ఏ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జెట్టీ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి.

Updated Date - 2023-01-25T01:17:23+05:30 IST