సచివాలయానికి తాళం

ABN , First Publish Date - 2023-02-07T01:02:36+05:30 IST

‘నిన్ను సస్పెండ్‌ చేశారుగా...ఎందుకొచ్చావు?, మా సార్‌నే తిడతావా! ఎంత ధైర్యం?...నిన్ను మెడపట్టి బయటకు తోసేయమని మా ఎమ్మెల్యే చెప్పారు. మర్యాదగా కార్యాలయంలో నుంచి వెళ్లిపో. లేకపోతే సచివాలయానికి తాళం వేసేస్తా’...అని అంటూ సోమవారం మునగపాక మండలం పల్లపు ఆనందపురంలో ఒక మహిళా పంచాయతీ కార్యదర్శిని అధికార వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు కర్రి సంజీవమ్మ హెచ్చరించారు.

సచివాలయానికి తాళం
మునగపాక మండలం పల్లపు ఆనందపురం సచివాలయం గేటుకు తాళం వేస్తున్న వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు కర్రి సంజీవమ్మ

పంచాయతీ మహిళా కార్యదర్శిపై కక్ష సాధింపు

మా ఎమ్మెల్యే ఫ్లెక్సీనే తొలగిస్తావా అంటూ ఎంపీటీసీ సభ్యురాలి ఆగ్రహం

సస్పెండ్‌ చేసినా ఎందుకు వచ్చావంటూ నిలదీత

కార్యాలయం నుంచి బయటకు వెళ్లాలని హుకుం

ఆమె కదలకపోవడంతో ఉద్యోగులను లోపల ఉంచి

గేటుకు తాళాలు వేసిన ఎంపీటీసీ సభ్యురాలు సంజీవమ్మ

మూడు గంటల పాటు నిర్బంధం

పోలీసులు వస్తున్నట్టు సమాచారం రావడంతో తాళాలు తీసిన వైనం

మునగపాక, ఫిబ్రవరి 6: ‘‘నిన్ను సస్పెండ్‌ చేశారుగా...ఎందుకొచ్చావు?, మా సార్‌నే తిడతావా! ఎంత ధైర్యం?...నిన్ను మెడపట్టి బయటకు తోసేయమని మా ఎమ్మెల్యే చెప్పారు. మర్యాదగా కార్యాలయంలో నుంచి వెళ్లిపో. లేకపోతే సచివాలయానికి తాళం వేసేస్తా’...అని అంటూ సోమవారం మునగపాక మండలం పల్లపు ఆనందపురంలో ఒక మహిళా పంచాయతీ కార్యదర్శిని అధికార వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు కర్రి సంజీవమ్మ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా సచివాలయం ప్రధాన ద్వారానికి తాళం వేశారు. ఇది సరైన పద్ధతి కాదని కార్యదర్శితోపాటు పలువురు గ్రామస్థులు చెప్పినా ఎంపీటీసీ సభ్యురాలు వినలేదు. సుమారు మూడు గంటల తరువాత పోలీసులు వస్తున్నారని స్థానికులు చెప్పడంతో అప్పడు గేటు తాళం తీశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

సంక్రాంతి పండుగ సమయంలో పల్లపు ఆనందపురంలో వైసీపీ నాయకులు, ఎలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు (కన్నబాబురాజు), ఆయన కుమారుడు సుకుమారవర్మ ఫొటోలతో కార్యకర్తలు గ్రామ సచివాలయానికి సమీపంలో ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. అనుమతి లేకుండా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని వారం రోజుల్లో తీసేయాలని గ్రామ కార్యదర్శి సమీహ మహ్మద్‌...వైసీపీ నాయకులకు సూచించగా, తొలగించేది లేదని వారు స్పష్టంచేశారు. ఇచ్చిన గడువు పూర్తి కావడంతో ఫ్లెక్సీని తొలగించాలని ఆమె ఈ నెల రెండో తేదీన సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అధికార పార్టీ నేతల ఫ్లెక్సీ కావడంతో సిబ్బంది కూడా వెనుకంజ వేశారు. దీంతో కార్యదర్శి సమీహ స్వయంగా ఫ్లెక్సీని తొలగించారు. దీంతో వైసీపీ నాయకుల అహం దెబ్బతిన్నది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన మూడో తేదీ ఉదయం గ్రామ కార్యదర్శికి ఫోన్‌ చేశారు. ‘నాతో పెట్టుకుంటావా.? నా ఫ్లెక్సీపై చెయ్యి వేయడానికి ఎంత ధైర్యం నీకు? ఎవడిచ్చాడు నీకీ ఉద్యోగం. నీ సంగతి ఇప్పుడే తేలుస్తా’’ అంటూ హెచ్చరించారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే ఆమెకు ఉన్నతాధికారులు మెమో ఇచ్చారు. మహిళా ఉద్యోగినని కూడా చూడకుండా ‘నోర్ముయ్‌...నీ సంగతి తేలుస్తా’నంటూ ఎమ్మెల్యే అనరాని మాటలు అన్నారని, సిన్సియర్‌గా విధులు నిర్వహిస్తే అండగా నిలవాల్సిన అధికారులు తనకు మెమోను బహుమతిగా ఇచ్చారని ఆమె తీవ్ర ఆవేదన చెందారు.

గ్రామ సచివాలయానికి తాళాలు వేసిన వైసీపీ ఎంటీపీసీ

ఉన్నతాధికారులు మెమో ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శి సమీహ మహ్మద్‌ శనివారం విధులకు హాజరుకారని స్థానిక వైసీపీ నాయకులు భావించారు. కానీ ఆమె సచివాలయానికి వచ్చి విధులు నిర్వర్తిస్తుండడంతో...ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. కార్యదర్శి సమీహ సోమవారం కూడా యథావిధిగా విధులకు హాజరు కావడంతో వైసీపీ నాయకులు తట్టుకోలేకపోయారు. ఎంపీటీసీ సభ్యురాలు సంజీవమ్మ, మరికొంతమంది నాయకులు కలిసి మధ్యాహ్నం సచివాలయానికి వచ్చారు. నాయకులు కొద్దిదూరంలో ఉండిపోగా, సంజీవమ్మ కార్యాలయంలోకి వెళ్లి, బయటకు వెళ్లిపోవాలని కార్యదర్శిని ఆదేశించారు. తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని కార్యదర్శి స్పష్టంచేయగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మూడు గంటల సమయంలో సంజీవమ్మ బయటకు వచ్చి మెయిన్‌ గేటు (గ్రిల్స్‌)కు తాళం వేశారు. ఆ సమయానికి లోపల పంచాయతీ కార్యదర్శి సమీహతో పాటు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, సర్వేయర్‌, అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌, వివిధ పనుల మీద వచ్చిన నలుగురు గ్రామస్థులు ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఉద్యోగులతోపాటు లోపల వున్న గ్రామస్థులు చెప్పినా...సంజీవమ్మ పట్టించుకోలేదు. సుమారు మూడు గంటల తరువాత పోలీసులు వస్తున్నట్టు తెలియడంతో ఆమె తాళాలు తీశారు. అనంతరం కార్యదర్శి సమీహ మాట్లాడుతూ...సచివాలయం ఉద్యోగులను మూడు గంటలపాటు నిర్బంధించిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని, ఎమ్మెల్యే అనుచరుల నుంచి తనకు ప్రాణహాని కూడా తెలిపారు.

Updated Date - 2023-02-07T01:02:38+05:30 IST