ఎస్‌ఐ సూరిబాబుకు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ABN , First Publish Date - 2023-01-26T01:30:23+05:30 IST

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని హార్బర్‌ స్టేషన్‌లో క్రైమ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న ధార సూరిబాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు.

ఎస్‌ఐ సూరిబాబుకు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని హార్బర్‌ స్టేషన్‌లో క్రైమ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న ధార సూరిబాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసులకు పలు పతకాలను కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగా ఎస్‌ఐ సూరిబాబుకి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ లభించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గత ఏడాది నవంబరులో సూరిబాబుకు ప్రభుత్వం ఉత్తమసేవా పతకం ప్రకటించిన విషయం తెలిసిందే.

1984లో కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో ప్రవేశించిన సూరిబాబు 2004లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 2012లో ఏఎస్‌ఐగా, 2017లో ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. నగరంలో చోరీలకు పాల్పడుతున్న తెలగపాముల ముఠా, చెడ్డీబనియన్‌ గ్యాంగ్‌, స్టువర్టుపురం గ్యాంగ్‌, తిరుచ్చి గ్యాంగ్‌, దృష్టి మరల్చి చోరీలకు పాల్పడే గ్యాంగ్‌లను పట్టుకోవడంలో సూరిబాబు విశేషమైన ప్రతిభ కనబరిచారు. నగరంలో ఎక్కడైనా భారీ చోరీ జరిగితే నిందితులు ఎవరై ఉండవచ్చుననేది గుర్తించేందుకు ఉన్నతాధికారులు సూరిబాబును తీసుకువెళుతుంటారు. సూరిబాబు విధినిర్వహణలో చూపిన ప్రతిభకు 150 క్యాష్‌ రివార్డులు, 29 ప్రశంసా పత్రాలు, 11 కమెండేషన్లు, రాష్ట్ర డీజీపీ ఇచ్చే ఏబీసీడీ అవార్డు దక్కాయి.

Updated Date - 2023-01-26T01:30:24+05:30 IST