అక్రమ నిర్మాణాలకు చెక్‌

ABN , First Publish Date - 2023-01-25T01:13:28+05:30 IST

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న భవన నిర్మాణాలకు చెక్‌ పెట్టాలని జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి యజమానులకు నోటీసులు ఇవ్వడంతోపాటు ఆయా భవనాలకు విద్యుత్‌, కొళాయి కనెక్షన్లు ఇవ్వొద్దంటూ సంబంధిత అధికారులకు లేఖలు రాయాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. దీంతో అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చే ప్రక్రియను టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వేగవంతం చేశారు.

అక్రమ నిర్మాణాలకు చెక్‌

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన

భవనాల గుర్తింపునకు జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశం

మొత్తం 3,300 వరకూ ఉన్నట్టు అంచనా

యజమానులకు నోటీసులు

అనంతరం తొలగింపునకు నిర్ణయం

సాధ్యం కాని వాటికి విద్యుత్‌,

కొళాయి కనెక్షన్లు ఇవ్వొద్దంటూ టౌన్‌ప్లానింగ్‌ లేఖలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న భవన నిర్మాణాలకు చెక్‌ పెట్టాలని జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి యజమానులకు నోటీసులు ఇవ్వడంతోపాటు ఆయా భవనాలకు విద్యుత్‌, కొళాయి కనెక్షన్లు ఇవ్వొద్దంటూ సంబంధిత అధికారులకు లేఖలు రాయాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. దీంతో అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చే ప్రక్రియను టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వేగవంతం చేశారు.

జీవీఎంసీ అధికారులు, సిబ్బందితోపాటు కొంతమంది కార్పొరేటర్‌ల అండదండలతో నగరంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం, అదనపు అంతస్థులు నిర్మించడం సాధారణ విషయంగా మారిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం వున్నప్పటికీ కాసుల కక్కుర్తి, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు కారణంగా జీవీఎంసీ అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లలో అక్రమ నిర్మాణాల జోరు బాగా పెరిగింది. దీనిపై తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన/జరుగుతున్న నిర్మాణాలను గుర్తించి జోన్‌ల వారీగా నివేదిక అందజేయాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు ఆదేశించారు. వారంతా వార్డు ప్లానింగ్‌ సెక్రటరీల ద్వారా సర్వే చేయించగా సుమారు 3,300 అక్రమ భవనాలు వున్నట్టు తేలింది. వీటిలో జోన్‌-2 (మధురవాడ), జోన్‌-3 (ఆశీల్‌మెట్ట), జోన్‌-6 (గాజువాక), జోన్‌-8 (పెందుర్తి)లో అధికంగా ఉండగా, భీమిలి, అనకాపల్లి జోన్లలో తక్కువగా వున్నట్టు సమాచారం. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు సంబంధించి తక్షణం వారి ఉల్లంఘనలను యజమానులకు తెలియజేయడంతోపాటు శాఖాపరంగా తీసుకోబోయే చర్యలను వివరిస్తూ నోటీసులు అందజేయాలని కమిషనర్‌ ఆదేశించారు. దీంతో వార్డు సచివాలయాల వారీగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవన నిర్మాణదారులకు నోటీసులు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ముగిసన అనంతరం తగిన సమయమిచ్చి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని చీఫ్‌ సిటీప్లానర్‌ను జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశించారు. ఒకవేళ ఏదైనా కారణం చేత అక్రమ నిర్మాణాల తొలగింపు సాధ్యపడకపోతే ఆయా భవనాలకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకుండా ఏపీఈపీడీసీఎల్‌ అధికారులకు లేఖ రాయాలని సూచించారు. అలాగే కొళాయి కనెక్షన్‌ ఇవ్వకుండా నీటి సరఫరా విభాగం అధికారులకు, ఆస్తి పన్ను వంద శాతం అధికంగా విధించాలని రెవెన్యూ విభాగం అధికారులను అప్రమత్తం చేస్తూ లేఖలు రాయాలని, వాటి నకలు తనకు కూడా అందజేయాలని కమిషనర్‌ ఆదేశించడం విశేషం.

షార్ట్‌ ఫాల్‌ పేరుతో యథేచ్ఛగా నిర్మాణాలు

నగరంలో భవన నిర్మాణాలకు అనుమతి కోరుతూ జీవీఎంసీకి యజమానులు దరఖాస్తు చేస్తారు. ఆ తరువాత ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణ పనులు చేస్తున్నా, సెట్‌బ్యాక్‌లు మినహాయించకుండా నిర్మాణం చేపట్టినా...ఆయా ఉల్లంఘనలను సరిదిద్దుకోవాలని పేర్కొంటూ సిబ్బంది షార్ట్‌ఫాల్‌లో పెడతారు. నిర్ణీతకాల వ్యవధిలో ఆయా రిమార్కులను సరిచేసి తిరిగి ప్లాన్‌ దరఖాస్తును సంబంధిత ఎల్‌టీపీ నుంచి వార్డు సచివాలయం ద్వారా టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు పంపించాలి. కానీ నిర్మాణదారులు ఎవరూ షార్ట్‌ ఫాల్‌లో పేర్కొన్న రిమార్కులను పట్టించుకోకుండానే నిర్మాణం పూర్తిచేసేస్తున్నారు. ఎవరైనా ఫ్లాట్‌లు కొనుగోలు చేసేందుకు వెళ్లినప్పుడు ప్లాన్‌ ఉందా?...అని అడిగితే షార్ట్‌ఫాల్‌లో ఉండిపోయిన విషయం చెప్పకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నపుడు వచ్చిన ప్రొసీడింగ్స్‌ కాపీని చూపిస్తున్నారు. తర్వాత భవన నిర్మాణానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) రాదు కాబట్టి, ఫ్లాట్‌ కొనుగోలు చేసుకున్నవారు ఇంటి పన్నును రెండింతలు కట్టాల్సి వస్తోంది. నిర్మాణదారుడు భవన నిర్మాణం పూర్తిచేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఫ్లాట్‌లు కొనుక్కొన్నవారే తమ పాట్లు తాము పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 2016 నుంచి ఇప్పటివరకూ షార్ట్‌ఫాల్‌లో వున్న ప్లాన్లు నాలుగు వేల వరకూ వున్నట్టు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నారు. షార్ట్‌ఫాల్‌లో వున్న ప్లాన్‌లను కూడా బయటకు తీసి వాటి పరిస్థితి ఇప్పుడెలా వుందో చూసి చర్యలు తీసుకోవాలని చీఫ్‌ సిటీప్లానర్‌ సురేష్‌కుమార్‌ను జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు ఆదేశించారు.

Updated Date - 2023-01-25T01:13:30+05:30 IST