Share News

Visakha Fishing Harbour fire Accident : బోట్లు బుగ్గి

ABN , First Publish Date - 2023-11-21T03:19:51+05:30 IST

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 40 మెకనైజ్డ్‌ బోట్లు పూర్తిగా కాలిపోగా, మరో పది వరకూ పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Visakha Fishing Harbour fire Accident : బోట్లు బుగ్గి

40 మెకనైజ్డ్‌ బోట్లు పూర్తిగా దగ్ధం

విశాఖ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం

రూ.30 కోట్ల నష్టం!

పాక్షికంగా దెబ్బతిన్న మరో పది బోట్లు

ఫిషింగ్‌ హార్బర్‌లోని ఓ బోటులో యువకుల పార్టీ!

ఫైనల్‌లో భారత్‌ ఓటమిపై వారిమధ్య ఘర్షణ!

ఆ క్రమంలో వారున్న బోటులో అగ్ని ప్రమాదం

ఆ బోటును సముద్రంలోకి నెట్టిన యువకులు

గాలికి జెట్టీ వైపు వెళ్లి మిగతా బోట్లకూ మంటలు

బోట్లలో డీజిల్‌ ఉండటంతో భారీగా నష్టం

మత్స్యకారులకు నష్టంలో 80% పరిహారం: జగన్‌

బాధించింది.. విచారణ జరిపించాలి: లోకేశ్‌

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 40 మెకనైజ్డ్‌ బోట్లు పూర్తిగా కాలిపోగా, మరో పది వరకూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేనప్పటికీ, సుమారు రూ.30 కోట్ల వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్టు మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఒకబోటుపై కొంతమంది యువకులు పార్టీ చేసుకుంటున్నప్పుడు ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించిందని, దాని నుంచి మంటలు మిగిలిన బోట్లకు వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారకుడిగా అనుమానించి ఒక యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకుని విచారించి, అతని ప్రమేయం లేదని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో విడిచిపెట్టేశారు. వివరాలిలా ఉన్నాయి.. విశాఖ సిటీ వన్‌టౌన్‌లోని ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి 600కిపైగా మెకనైజ్డ్‌ బోట్లు సముద్రంలో వేటకు వెళుతుంటాయి. వీటిని హార్బర్‌లో ఉన్న 11 జెట్టీల్లో లంగరువేసి ఉంచుతారు.

కొన్నిబోట్లు వేట ముగించుకుని రేవుకు చేరుకుంటే...మరికొన్ని వేటకు వెళ్లేందుకు పూర్తి సరంజామాతో సిద్ధంగా ఉంటాయి. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో జీరో నంబర్‌ జెట్టీలోని ఒక బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు పక్కనున్న బోట్లకు అంటుకుంటాయనే భయంతో అందులో ఉన్న యువకులతోపాటు అక్కడున్న మరికొందరు కలిసి ఒడ్డుతో కట్టి ఉంచిన (లంగరు) తాడును కత్తిరించి సముద్రంలోకి నెట్టేశారు. ఆ సమయంలో సముద్రంలో గాలులు దక్షిణం వైపు బలంగా వీస్తుండడంతో ఆ బోటు జీరో నంబర్‌ జెట్టీలో నైరుతి వైపు లంగరేసి ఉన్న బోట్లపైకి వెళ్లడంతో వాటికి కూడా మంటలు అంటుకున్నాయి. లోపల సిబ్బంది వంట చేసుకునేందుకు ఉంచిన గ్యాస్‌ సిలిండర్లకు వ్యాపించాయి. సిలిండర్లు పేలి పక్కనున్న ఇతర బోట్లపై పడడంతో వాటికీ శరవేగంగా మంటలు వ్యాపించాయి. బోట్లలో ప్లాస్టిక్‌ వలలు, డీజిల్‌ ఉండడంతో కాలిబూడిదైపోయాయి. పోర్టు, జిల్లా అగ్నిమాపక శకటాలు,పోలీస్‌, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. మంటలు కూడా అంతేవేగంతో ఇతర బోట్లకు వ్యాపించడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

రూ.30 కోట్ల వరకూ ఆస్తి నష్టం

అగ్ని ప్రమాదంలో రూ.30 కోట్ల వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్టు మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో బోటు విలువ రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటుందంటున్నారు. దాదాపు 40 బోట్లు పూర్తిగా కాలిపోయి సముద్రంలో మునిగిపోగా, మరో పది పాక్షికంగా దెబ్బతిన్నాయంటున్నారు. అంతేకాకుండా దగ్ధమైన బోట్లలో కొన్ని సముద్రంలో వేట ముగించుకుని ఆదివారం రాత్రే రేవుకు చేరాయని, ఒక్కో బోటులో కనీసం రూ.పది లక్షల విలువ చేసే మత్స్యసంపద ఉన్నట్టు చెబుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు వేటకు సముద్రంలోకి బయలుదేరాల్సిన బోట్లు కూడా కాలి బూడిదైపోయాయి. అలాంటి బోట్లలో సిబ్బందికి 15 నుంచి నెలరోజులపాటు సరిపోయేలా ఆహార పదార్థాలు, బోటు ఇంజన్‌లో వేసేందుకు దాదాపు 4వేల లీటర్ల డీజిల్‌ వంటివి సిద్ధం చేసి పెట్టుకున్నారు. అవన్నీ కాలిపోయాయి. హార్బర్‌లోని ఒక బోటులో కొంతమంది యువకులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో పార్టీ చేసుకున్నారని, అదే ప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నామని విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మీడియాకు తెలిపారు.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 40 మెకనైజ్డ్‌ బోట్లు పూర్తిగా కాలిపోగా, మరో పది వరకూ పాక్షికంగా దెబ్బతిన్నాయి.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో దగ్ధమైన బోట్లవిలువలో 80శాతం మత్స్యకారులకు పరిహారంగా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఆయన దిగ్ర్భాం తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి, కారణాలు వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. దగ్ధమైన బోట్లకు బీమా లేదనో, సాంకేతిక కారణాలను చూపో పరిహాసం విషయంలో వెనుకాడవద్దని సూచించారు. బోట్ల దగ్ధం వల్ల రూ.12కోట్లమేర నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నామని అధికారులు ఆయనకు వివరించారు.

నిప్పుపెట్టిన సర్కార్‌ నిర్లక్ష్యం జాలర్లను పెద్దమనసుతో ఆదుకోవాలి: లోకేశ్‌

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40 బోట్లు, రూ.కోట్లాది మత్స్య సంపద అగ్నికి ఆహుతికావడం బాధ కలిగించిందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్‌ అన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ దుర్ఘటనపై విచారం వ్యక్తంచేశారు. భద్రతాచర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని విమర్శించారు. ఈప్రమాదంలో నష్టపోయినవారంతా పేద మత్స్యకారులైనందున ప్రభుత్వం పెద్దమనస్సుతో స్పందించి, వారికి కొత్తబోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాలని ’ఎక్స్‌’ వేదికగా సూచించారు. కాగా, ప్రభుత్వనిర్లక్ష్యం వల్లే కార్మికులు, మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి తలెత్తిందని టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు వంద శాతం నష్టపరిహారం చెల్లించాలని మాజీ మత్రి కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. ఆయన హార్బర్‌ను సందర్శించి బాధితులను పరామర్శించారు.

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఓటమిపై రేగిన ఘర్షణ!

హార్బర్‌లో జీరో జెట్టీకి, షెడ్డుకు మధ్యలో లంగరేసి ఉన్న బోటులో కొంతమంది పార్టీ చేసుకోవడమే అగ్ని ప్రమాదానికి కారణమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా కొంతమంది యువకులు కలిసి బోటులోనే పార్టీ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. భారత్‌ ఓడిపోవడంతో ఆ పార్టీలో యువకులు ఇరువర్గాలుగా విడిపోయి గొడవ పడ్డారని, ఆ క్రమంలోనే బోటులో అగ్ని ప్రమాదం సంభవించిందని మత్స్యకారులతోపాటు పోలీసువర్గాలూ అనుమానిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత సోమవారం ఉదయాన్నే సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఫిషింగ్‌ హార్బర్‌ను సందర్శించారు. ప్రమాదాన్ని పరిశీలించిన తర్వాత కారణాలపై మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు.

సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు ఆ దృశ్యాలు, వలకు పడిన చేపలను బోటులోనే వండుకుని తినే దృశ్యాలను వీడియోతీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా పాపులర్‌ అయిన మత్స్యకార యువకుడి పాత్రపై అనుమానాలు వ్యక్తం కావడంతో అతడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు హార్బర్‌ పరిసరాల్లోనే లేనని, ద్వారకానగర్‌లోని ఒక హోటల్‌లో స్నేహితులతోపాటు క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తున్నానని.. ప్రమాదానికి సంబంధించి ఫోన్‌ రావడంతో, తన స్నేహితుడితో కలిసి బైక్‌పై హార్బర్‌కు వెళ్లినట్టు వెల్లడించాడు. పోలీసులు క్రాస్‌ చెక్‌ చేసి అతను చెప్పిందంతా వాస్తవమేనని నిర్ధారించుకుని విడిచిపెట్టినట్టు తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌లో పనిచేసిన ఫోన్‌ నంబర్లు, అనుమానితుల సెల్‌ఫోన్‌ కాల్‌డేటా రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - 2023-11-21T03:51:55+05:30 IST