హైదరాబాద్‌కు.. వివేకా హత్యకేసు ఫైళ్లు

ABN , First Publish Date - 2023-01-25T02:47:50+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.

హైదరాబాద్‌కు.. వివేకా హత్యకేసు ఫైళ్లు

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఇక్కడి సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టుకు ఆ ఫైళ్లను తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసు విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం లేదని పేర్కొంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సునీతా రెడ్డి వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీలోని కడప జిల్లా సెషన్స్‌ కోర్టులో ఉన్న కేసు ఫైళ్లను మూడు ట్రంకు పెట్టెల్లో హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు తరలించారు. ఇందులో నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి, ఎంపీ అవినాశ్‌రెడ్డికి సన్నిహితుడైన దేవిరెడ్డి శంకర్‌రెడ్డి.. ఇలా మొత్తం ఐదుగురు నిందితులపై సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్‌షీట్లు ఉన్నాయి.

Updated Date - 2023-01-25T02:47:50+05:30 IST