పనులు సాగవు.. నీళ్లు రావు

ABN , First Publish Date - 2023-02-07T00:03:46+05:30 IST

ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పనిచేయక రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీడీపీ హయాంలో 2005లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పుష్కలంగా సాగునీరందడంతో ఏటా రెండు పంటలు పండించుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్వహణను గాలికొదిలేశారు.

పనులు సాగవు.. నీళ్లు రావు
నీరు లేని మాకనాపల్లి ఎత్తిపోతల పఽథకం

- పాడైన మాకనాపల్లి ఎత్తిపోతల పథకం

- 18 ఏళ్ల తర్వాత సాగునీరు బంద్‌

- పట్టించుకోని పాలకులు, అధికారులు

- రైతుల చందాలతో మరమ్మతులు

(మెళియాపుట్టి)

- మెళియాపుట్టి మండలం మాకనాపల్లి గ్రామానికి చెందిన పడలా నారాయణరావుకు ఐదు ఎకరాల భూమి ఉంది. టీడీపీ హయాంలో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయగా.. ఏటా రెండు పంటలు పుష్కలంగా పండించేవారు. ఈ ఏడాది మాకనాపల్లి ఎత్తిపోతల పథకం లీకులమయమై పాడైంది. దీంతో సాగునీరందక రెండో పంట వేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

.................................

- మెళియాపుట్టి మండలం మాకనాపల్లికి చెందిన పి.కృష్ణారావుకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఏటా వరి, చెరకు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందక పంటలు వేయలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్‌ వలస బాట తప్పడం లేదని వాపోతున్నారు.

.................................

.. ఇలా ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పనిచేయక రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీడీపీ హయాంలో 2005లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పుష్కలంగా సాగునీరందడంతో ఏటా రెండు పంటలు పండించుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలు పాడైపోయి.. సాగునీరు సక్రమంగా అందడం లేదు. ఎన్నడూ లేని విధంగా 18 ఏళ్ల తర్వాత సాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 49 ఎత్తిపోతల పథకాలు ఉండగా.. వీటి ద్వారా 38వేల ఎకరాలు సాగు చేస్తున్నారు. 38 ఎత్తిపోతల పథకాలకు 16 గంటలపాటు, మిగిలిన వాటికి 9 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. వీటి నిర్వహణకు విద్యుత్‌ బకాయిలు భారంగా మారాయి. గత మూడేళ్ల నుంచి ఏపీఎస్‌ఐడీసీ నుంచి నిధులు మంజూరుకావడం లేదు. దీంతో జిల్లాలో సుమారు రూ.16కోట్లు విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. ఎత్తిపోతల పథకాలు బాగుచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకునే నాథులు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప.. సమస్య పరిష్కరించడం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కొంతమంది రైతులు ఎకరాకు రూ.వెయ్యి చొప్పున స్వచ్ఛందంగా చందాలు వేసుకుని ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి సమస్య ఎదుర్కోలేదని వాపోతున్నారు. ఈ విషయమై ఏపీఎస్‌ఐడీసీ ఈఈ కేవీవీ సుబ్రహ్మణ్యం వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ఎత్తిపోతల పథకాల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. 2020 నుంచి సుమారు రూ.15కోట్ల వరకు విద్యుత్‌ బిల్లులు బకాయిలు ఉన్నాయని వివరించారు. రానున్న వేసవిలో కొంతమేర విద్యుత్‌ వినియోగం తగ్గించాలని రైతులకు సూచించారు.

చందాలువేసి పనులు చేయించాం

రెండేళ్లుగా ఎత్తిపోతల పథకం లీకులు అవుతున్నాయి. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా నిధులు మంజూరు కాలేదు. దీంతో రైతులంతా చందాలు వేసుకుని.. మరమ్మతులు చేయించాం.

- టి.వజ్రమ్మ, సర్పంచ్‌, సిరియాఖండి, మెళియాపుట్టి

Updated Date - 2023-02-07T00:03:48+05:30 IST