పశుగ్రాసం కొరత

ABN , First Publish Date - 2023-02-07T00:03:37+05:30 IST

మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పశుగ్రాసం కొరత ఏర్పడుతుందన్న ముందుచూపుతో.. గత టీడీపీ ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాల పెంపకానికి చేయూతనిచ్చింది. వ్యవసాయ, పశుసంవర్థకశాఖలు కలిసి మేలైన బహువార్షికం, ఏక వార్షికం గడ్డి విత్తనాలను సబ్సిడీపై అందించి క్షేత్రాల పెంపకానికి తోడ్పాటునిచ్చాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటికి స్వస్తి పలికింది.

పశుగ్రాసం కొరత
ఎండుగడ్డిని ట్రాక్టర్‌లో లోడ్‌ చేస్తున్న పాడి రైతులు

- విత్తనాల సబ్సిడీకి స్వస్తి

- క్షేత్రాలు లేక.. ఎండుగడ్డి దొరక్క..

- పాడి రైతులపై పెరుగుతున్న భారం

(ఇచ్ఛాపురం రూరల్‌)

మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పశుగ్రాసం కొరత ఏర్పడుతుందన్న ముందుచూపుతో.. గత టీడీపీ ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాల పెంపకానికి చేయూతనిచ్చింది. వ్యవసాయ, పశుసంవర్థకశాఖలు కలిసి మేలైన బహువార్షికం, ఏక వార్షికం గడ్డి విత్తనాలను సబ్సిడీపై అందించి క్షేత్రాల పెంపకానికి తోడ్పాటునిచ్చాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటికి స్వస్తి పలికింది. ఫలితంగా పాడి రైతులకు పశుపోషణ భారంగా మారింది. యాంత్రీకరణ అన్నదాతలకు లాభదాయకంగా ఉన్నా, పాడి పరిశ్రమపై ప్రభావం పడుతోంది. గతంలో వరి పంటను కూలీలు కోసేవారు. వరి గడ్డి లభించేది. ప్రస్తుతం అధిక శాతం యంత్రాలు వాడుతుండడంతో గడ్డి దొరకడం లేదు. వైసీపీ ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాల పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. దీంతో పశుగ్రాసం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిమాండ్‌ పెరిగి అధిక ధరలకు సుదూర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని పాడిరైతులు ఆవేదన చెందుతున్నారు.

ట్రాక్టర్‌ వరి గడ్డి రూ.10 వేలు

జిల్లాలో చాలా మండలాల్లో పాడిపశువులు పెంచుతూ.. అత్యధిక మంది జీవనం సాగిస్తున్నారు. పశుసంవర్థక శాఖ గణాంకాల ప్రకారం 2.20 లక్షల పాడి పశువులు, 25 వేల వరకు గేదెలు ఉన్నాయి. సుమారు 1.85 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారు. కూలీల కొరతతో అధిక శాతం రైతులు యంత్రాలతో వరి కోతలు పూర్తి చేశారు. కొంతమంది తమ పాడి పశువుల పోషణకు కూలీలతో కోతలు కోయించారు. యంత్రాల వినియోగంతో పశువుల సంఖ్యకు సరిపడా గడ్డి దొరకడం లేదు. ఒక్కో పశువుకు రోజుకు నాలుగు నుంచి ఆరు కిలోల గడ్డి అవసరమవుతుందని పోషకులు చెబుతున్నారు. ట్రాక్టరు లోడు వరి గడ్డి సుమారు రూ.10 వేలు పలుకుతోంది. ఫలితంగా పశుపోషణ పాడి రైతులకు భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి పశుగ్రాస క్షేత్రాల పెంపకాలకు ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం

పశుగ్రాసం కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. దాణా ధరలు అధికమయ్యాయి. పాడి పశువుల పోషణ భారంగా మారింది. పాడి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం గతంలో మాదిరి రాయితీపై విత్తనాలు అందించి క్షేత్రాల సాగుకు చేయూత ఇవ్వాలి.

- పి.దానయ్య, పాడిరైతు, పెద్దలక్ష్మీపురం.

.........................................

ఉన్నతాధికారులకు నివేదిస్తాం

గతంలో పశుగ్రాస క్షేత్రాలు సాగును అమలు చేశాం. ప్రస్తుతం రైతుభరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు రాయితీపై గడ్డి విత్తనాలు అందజేస్తున్నాం. వారి సొంత స్థలంలో విత్తనాలు వేసి పెంచుకోవచ్చు. రాయితీపై సమీకృత దాణా సరఫరా చేస్తున్నాం.

- వి.జయరాజు, డిప్యూటీ డైరెక్టర్‌, పశుసంవర్థక శాఖ, శ్రీకాకుళం.

Updated Date - 2023-02-07T00:03:38+05:30 IST