పంచాయతీకి పెట్టుబడి.. వ్యాపారులకు ఆదాయం!

ABN , First Publish Date - 2023-01-26T00:32:56+05:30 IST

నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో దుకాణాల లీజు పేరిట అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పంచాయతీకి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలను కొంతమంది వ్యాపారులు దశాబ్దాలుగా తక్కువ ధరకు లీజుకు పొందుతున్నారు. వాటిని సబ్‌లీజుకు ఇచ్చి.. ప్రతి నెలా వేలాది రూపాయల అదనపు ఆదాయం పొందుతున్నారు.

పంచాయతీకి పెట్టుబడి.. వ్యాపారులకు ఆదాయం!
నరసన్నపేటలోని గాంధీ షాపింగ్‌ కాంప్లెక్స్‌

- లీజుదారులకు కాసులు కురిపిస్తున్న దుకాణాలు

- దశాబ్దాలుగా సబ్‌లీజులు

- పట్టించుకోని అధికారులు

(నరసన్నపేట)

నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో దుకాణాల లీజు పేరిట అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పంచాయతీకి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలను కొంతమంది వ్యాపారులు దశాబ్దాలుగా తక్కువ ధరకు లీజుకు పొందుతున్నారు. వాటిని సబ్‌లీజుకు ఇచ్చి.. ప్రతి నెలా వేలాది రూపాయల అదనపు ఆదాయం పొందుతున్నారు. పరోక్షంగా పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నరసన్నపేట మేజర్‌ పంచాయతీ పరిఽధిలో 36 దుకాణాలకుగాను 30 దుకాణాలు సబ్‌లీజుతోనే నడుస్తున్నాయి. ఒక్కో లీజుదారుడు దుకాణాన్ని సబ్‌లీజుకు ఇచ్చి ప్రతి నెలా సుమారు రూ.10వేల అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. దుకాణాల ద్వారా అద్దెల రూపంలో పంచాయతీలకు ప్రతినెలా సుమారు రూ.3లక్షల ఆదాయం వస్తోంది. లీజుదారులు మాత్రం దీనికి అదనంగా మరో రూ.4లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. దశాబ్దాలుగా ఈ తంతు సాగుతున్నా.. పంచాయతీ పాలకవర్గాలు, అధికారులు పట్టించుకోవడం లేదు. లీజుదారుల్లో ఎక్కువమంది రాజకీయ నేతల బినామీలు, ప్రధాన పార్టీల అనుచరులు కావడమే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

- గాంధీ బజారు కింది భాగంలో 14, ఒకటవ అంతస్తులో 15 దుకాణాలు ఉన్నాయి. కింది భాగంగా కొంతమంది లీజుదారులు మాత్రమే ప్రతినెలా రూ.15వేలకుపైగా పంచాయతీకి అద్దె చెల్లిస్తున్నారు. మిగతా వారంతా రూ.10వేలు లోపు లీజుకు పొందారు. ఈ దుకాణాలను సబ్‌లీజుకు ఇచ్చి.. ప్రతి నెలా రూ.18వేలు నుంచి రూ.24వేల వరకు వసూలు చేస్తున్నారు. పంచాయతీకి మాత్రం అరకొరగా అద్దె చెల్లిస్తున్నారు. నాగేశ్వర గ్రంథాలయం ముందు భాగంలో ఆరు దుకాణాలు ఉన్నాయి. వీటికి కూడా నామమాత్రంగానే అద్దె చెల్లిస్తున్నారు. రోస్టర్‌ ప్రాతిపదికన దుకాణాలు వేలం నిర్వహించాలి. కానీ, దశాబ్దాలుగా ఒకే సామాజికవర్గానికి చెందినవారికి 80శాతం దుకాణాలు కట్టబెడుతున్నారు. వారి దగ్గర కొంతమంది అధికారులు మామూళ్లు తీసుకుని.. పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

- వృథాగా కూరగాయల మార్కెట్‌

నరసన్నపేటలోని విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్‌లో 38 దుకాణాలు ఏళ్ల తరబడి నుంచి ఖాళీగా ఉన్నాయి. వీటిలో 20శాతం దుకాణాల్లో మాత్రమే కూరగాయాలు విక్రయిస్తున్నాయి. మిగతా వ్యాపారులు దుకాణాలు వదిలి.. కళాశాల రోడ్డులో వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. దీంతో దుకాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని ఆధునికీకరించి.. పంచాయతీ ఆదాయం పెంచేందుకు పాలకులు, అధికారులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారులు కూరగాయాల మార్కెట్‌లో దుకాణాలు ఆక్రమించి.. వ్యాపారాలు సాగిస్తున్నారు. మరికొందరు గిడ్డంగులుగా వాడుకుంటున్నారు. ఈ మార్కెట్‌లో దుకాణాలను బాగు చేసి.. కళాశాల రోడ్డులో తోపుడు బళ్లు షాపులను ఇక్కడకు తరలిస్తే ట్రాఫిక్‌ సమస్య కూడా తీరే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం

గాంఽఽధీబజారులో సబ్‌లీజులు వ్యవహారంపై ఉన్నత అధికారులకు నివేదించాం. రోస్టర్‌ ప్రకారం ఈఏడాది వేలం పాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కూరగాయాల మార్కెట్‌ ఆధునికీకరణ ప్రణాళికలను రూపొందించాం. పంచాయతీ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.

- సింహాద్రినాయుడు, ఈవో, మేజర్‌ పంచాయతీ, నరసన్నపేట

Updated Date - 2023-01-26T00:32:56+05:30 IST