కదంతొక్కిన అంగన్‌వాడీలు

ABN , First Publish Date - 2023-02-06T23:35:17+05:30 IST

తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు.

కదంతొక్కిన అంగన్‌వాడీలు
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

- సమస్యల పరిష్కారం కోసం ధర్నా

- కనీస వేతనం అమలుచేయాలని డిమాండ్‌

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6: తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేతలు డి.సుధ, సీహెచ్‌ అమ్మన్నాయుడు. పి.తేజశ్వరరావు మాట్లాడుతూ.. అంగన్‌వాడీలకు కనీస వేతనం చెల్లించడంతో పాటు ఫేస్‌ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలన్నారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్ర్యాట్యూటీ, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలి. గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వం డీఏలు చెల్లించడం లేదు. పనిభారం పెంచి సకాలంలో వేతనాలు అందింకపోవడం దారుణం. కేంద్రాలకు నాశిరకం కందిపప్పును అందిస్తున్నారు. గ్యాస్‌, వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలి. పోస్టులకు వయో పరిమితి తొలగించాలి. పదోన్నతుల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలి. 300 జనాభా దాటిన మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలి. నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి. ర్యాలీలు, సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 1ను తక్షణమే రద్దుచేయాలి. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తాం’’. అని సీఐటీయూ నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కె.కళ్యాణి, శాంతామణి, ఎన్‌.హైమావతి, హేమ, ఎం.మంజుల, ఎం.విజయలక్ష్మీ, కె.సుజాత, ఎన్‌.హైమావతి, ఎ.హేమలత. పి.భూలక్ష్మి, జె.కాంచన, బి.ఆదిలక్ష్మి, ఆర్‌.చంద్రమౌళి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:35:19+05:30 IST