AP HIGH COURT: నేరుగా పోలీసులను ఆదేశించరాదు!

ABN , First Publish Date - 2023-01-25T02:50:27+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1 పౌరుల ప్రాథమిక హక్కులను హరించేదిగా ఉందని సీనియర్‌ న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.

AP HIGH COURT: నేరుగా పోలీసులను ఆదేశించరాదు!

రాజకీయ సభల నియంత్రణ, పర్యవేక్షణ

పూర్తిగా డీజీపీ, ఎస్పీల బాధ్యత

వారికి ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం సరికాదు

జీవో1 ప్రాథమిక హక్కులను హరించేదిగా ఉంది

రద్దు చేయాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు

హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

అమరావతి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1 పౌరుల ప్రాథమిక హక్కులను హరించేదిగా ఉందని సీనియర్‌ న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. భావప్రకటనాస్వేచ్ఛను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. పోలీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 3ను అనుసరించి రహదారులపై బహిరంగసభలు, రోడ్డుషోల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వరాదన్నారు. యాక్ట్‌లోని సెక్షన్‌ 30 ప్రకారం నియంత్రణ, పర్యవేక్షణ అధికారం పూర్తిగా డీజీపీ, ఎస్పీలదేనని పేర్కొన్నారు. జీవోను రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలోని రహదారులపై బహిరంగసభలు, రోడ్డుషోల నిర్వహణను నిషేఽధిస్తూ ఈ ఏడాది జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఇటు రాజకీయపార్టీలు, అటు ప్రభుత్వం రెండురోజులపాటు హోరాహోరీ వాదనలు వినిపించాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో ధర్మాసనం మంగళవారం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. జీవో 1ని సవాల్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే జీవోను సవాల్‌చేస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లురవీంద్ర, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఏఐఎ్‌సఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలుచేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం విచారణ కొనసాగింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, జంధ్యాల రవిశంకర్‌, న్యాయవాదులు టి.శ్రీధర్‌, ఎన్‌.అశ్వనీకుమార్‌, జవ్వాజి శరత్‌చంద్ర వాదనలు వినిపించారు. ‘‘రాజకీయపార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్డుషోలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానిదే. పోలీసులకు కేవలం వాటిని నియంత్రించే అధికారం మాత్రమే ఉంటుంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామనే పేరుతో ప్రతిపక్షపార్టీలు నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనుమతులు తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఉంటే తొక్కిసలాట ఘటనలు జరిగేవి కాదు. తన దయాదాక్షిణ్యాల మీద రాజకీయపార్టీలు నడవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవడం సరికాదు.

షరతుల పేరుతో గొంతెత్తకుండా చేయడం ప్రజాస్వామ్యం కాదు. ప్రజారాజ్యం పార్టీ 2008లో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందిన సందర్భంగా డీజీపీ సర్క్యులర్‌ ఇచ్చారు. అది ఆమోదయోగ్యంగా ఉండడంతో ఎవరూ సవాల్‌ చేయలేదు. సభలు, సమావేశాల నియంత్రణ అధికారం పూర్తిగా డీజీపీ, ఎస్పీలదే. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. పోలీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 30లో ‘సమావేశాలకు అనుమతివ్వండి. ప్రత్యేక పరిస్థితులు ఉంటే నిరాకరించండి’ అని ఉంది. అందుకు భిన్నంగా జీవో 1లో ‘అనుమతులు నిరాకరించండి. ప్రత్యేక పరిస్థితులు ఉంటే అనుమతివ్వండి’ అని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఉన్న ఆ జీవోను రద్దు చేయండి’’ అని వారంతా వాదించారు.

పూర్తిగా నిషేధం విధించలేదు: ఏజీ

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ‘‘పోలీ్‌సయాక్ట్‌లోని సెక్షన్‌ 3ని అనుసరించి పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉంది. చట్టనిబంధనలకు లోబడే జీవో 1 జారీ చేశాం. ఏ రాజకీయపార్టీనీ అడ్డుకోవాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రహదారులపై సభలు, సమావేశాలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించలేదు. సమావేశాలు, పాదయాత్రలు, ర్యాలీల నిర్వహణకు సంబంధించి వచ్చిన ధరఖాస్తులను ఇప్పటివరకు తిరస్కరించలేదు. వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తున్నాం. టీడీపీ నేత లోకేశ్‌ చేపట్టిన పాదయాత్రకు సైతం అనుమతి ఇచ్చాం’’ అంటూ అందుకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను ఏజీ... కోర్టు ముందు ఉంచారు. ఓ రాజకీయపార్టీ...ప్రైవేటు మైదానంలో సమావేశం నిర్వహించుకుంటామంటే అనుమతులు మంజూరు చేశామన్నారు.

వెకేషన్‌ బెంచ్‌కు ఆ అధికారం ఉంది

సీపీఐ రామకృష్ణ తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌... సోమవారం సీజే లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. ‘‘జీవో 1 ద్వారా ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలు ఇచ్చింది. జీవోఆర్టీ కింద ఇచ్చిన ఉత్తర్వులు విధానపరమైన నిర్ణయం కిందకి రావు. .ఆ జీవోను సవాల్‌ చేస్తూ వేసిన పిల్‌ను విచారించే అధికారం రోస్టర్‌ ప్రకారం వెకేషన్‌ బెంచ్‌కు ఉంది. నోటిఫికేషన్‌ మేరకు వ్యాజ్యాలను విచారించే విచక్షనాధికారం సీనియర్‌ వెకేషన్‌ జడ్జికి ఇచ్చారు’’ అని వివరించారు.

అధికార పార్టీకి ఒకలా, విపక్షనేతలకు మరోలా...

టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లురవీంద్ర తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల విషయంలో ఒకలా, ప్రతిపక్షనేతల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారన్నారు. లోకేశ్‌ పాదయాత్రకు ఆమోదయోగ్యంకాని షరతులతో అనుమతి ఇచ్చారని తెలిపారు.. వెకేషన్‌ బెంచ్‌లో చోటుచేసుకున్న పరిస్థితులను పట్టించుకోకుండా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై చీఫ్‌జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా స్పందిస్తూ.... వెకేషన్‌ సమయంలో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌లో రెండు పేరాలు మిస్‌ అయ్యాయన్నారు. బెంచ్‌ పై నుంచి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేనన్నారు. హైకోర్టుకు ఉన్న సర్వోన్నత అధికారాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, పరిస్థితిని చక్కదిద్దకపోతే భవిష్యత్తులో హైకోర్టుకు వచ్చే సీజేలు ఏదో ఒకరోజు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. కాగా, ఇదే వ్యవహారంలో జర్నలిస్ట్‌ కె.బాలగంగాధర్‌ తిలక్‌ వేసిన వ్యాజ్యంలో న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు.

Updated Date - 2023-01-25T03:48:06+05:30 IST