పక్షపాతంగా ఆంక్షలు

ABN , First Publish Date - 2023-01-26T02:55:04+05:30 IST

‘లోకేశ్‌ పాదయాత్రకు పలమనేరు డీఎస్పీ పేరుతో ఇచ్చిన అనుమతి పత్రంలో పెట్టిన ఆంక్షలు మరీ పక్షపాతంగా ఉన్నాయి.

పక్షపాతంగా ఆంక్షలు

మైక్‌ లేకుండానే జగన్‌, షర్మిల యాత్ర చేశారా?

3 రోజుల అనుమతి వివక్షే.. డీజీపీకి టీడీపీ లేఖ

సుదీర్ఘ పాదయాత్రకు లోకేశ్‌ శ్రీకారం వైఎస్‌, బాబు, జగన్‌లకు మించి నడక

మంత్రిగా ఉండగా వైసీపీ వ్యూహాత్మక దాడి

విపక్ష నేతగా రాటుదేలిన లోకేశ్‌

ఒక్క ఆరోపణా నిరూపించలేని జగన్‌ సర్కారు

అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ‘‘లోకేశ్‌ పాదయాత్రకు పలమనేరు డీఎస్పీ పేరుతో ఇచ్చిన అనుమతి పత్రంలో పెట్టిన ఆంక్షలు మరీ పక్షపాతంగా ఉన్నాయి. కేవలం నలుగురికి మాత్రమే వినిపించే సింగిల్‌ మైక్‌ సిస్టమ్‌ మాత్రమే లోకేశ్‌ పాదయాత్రలో వాడాలని పోలీసులు షరతు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. జగన్‌రెడ్డి, షర్మిల తమ పాదయాత్రల్లో మైక్‌ లేకుండానే తిరిగారా?’’ అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బుధవారం డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథరెడ్డికి, చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డికి లేఖలు రాశారు. ‘‘పోలీస్‌ శాఖ పెట్టిన షరతులు ప్రజాస్వామ్యవాదులకు షాక్‌ తగిలేలా ఉన్నాయి. మీ వైఖరి నిరాశ కలిగించింది. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల కిందట ప్రతిపక్ష నాయకునిగా పాదయాత్ర చేశారు. అప్పుడు మీ శాఖ ఇటువంటి షరతులు పెట్టిందా? ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారు? మైక్‌, సౌండ్‌ సిస్టంపై కూడా ఆంక్షలు పెట్టడం మరీ ఘోరంగా ఉంది. పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పలు వర్గాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి లేదా లోకేశ్‌ చెప్పింది వినడానికి వస్తారు. సరైన మైక్‌ కూడా లేకపోతే వారితో ఎలా మాట్లాడగలుగుతారు? ఇంతకు ముందు రాష్ట్రంలో అనేక పాదయాత్రలు జరిగాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, షర్మిల, జగన్‌రెడ్డి చేశారు. వాటిలో మైక్‌పై ఇటువంటి ఆంక్షలు ఎప్పుడైనా ఉన్నాయా? మీరు కూడా ఆలోచన చేయండి’’ అని తన లేఖలో పేర్కొన్నారు. జగన్‌రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఒకేసారి మొత్తం పాదయాత్రకు అప్పటి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు కేవలం మూడు రోజులకు మాత్రమే ఇవ్వడం వివక్షాపూరితమని ఆరోపించారు.

పాదయాత్ర నిర్వహణ, భదత్రా ఏర్పాట్లు వంటివి నిర్వాహకులపై మోపడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని విమర్శించారు. ‘‘యాత్రకు, దానికి హాజరయ్యేవారికి భద్రతా ఏర్పాట్లు చేయడం పోలీస్‌ శాఖ విధి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి విధి నిర్వహణను పోలీస్‌ శాఖ ఎప్పటి నుంచో నిర్వర్తిస్తోంది. సాధ్యం కాని షరతులు నిర్వాహకులకు విధించి పోలీస్‌ శాఖ చేతులు దులుపుకోవాలని చూడటం సరికాదు. మీరు పునరాలోచన చేసి ఈ షరతులు తొలగించండి. ప్రతి రోజూ పాదయాత్రకు అనుమతులు తీసుకోవడం కాకుండా గతంలో పాదయాత్రలకు ఎలా అనుమతులు ఇచ్చారో అదే మాదిరిగా ఇవ్వండి. మైక్‌ సిస్టంపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయండి’’ అని వర్ల తన లేఖలో కోరారు.

Updated Date - 2023-01-26T02:55:04+05:30 IST