ఓటు ఎంతో విలువైంది

ABN , First Publish Date - 2023-01-25T00:50:53+05:30 IST

ఎంతో విలువైన ఓటుహక్కును అర్హులైన వారందరికీ కల్పించేందుకు ఏటా ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్‌ పిలుపునిచ్చింది.

ఓటు ఎంతో విలువైంది

విస్తృత ప్రచారానికి యంత్రాంగం ఏర్పాట్లు

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 24 : ఎంతో విలువైన ఓటుహక్కును అర్హులైన వారందరికీ కల్పించేందుకు ఏటా ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్‌ పిలుపునిచ్చింది. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటుహక్కు నమోదు, వినియోగించుకోవడం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈసీ ప్రత్యేకంగా శ్రీకారం చుట్టింది. 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పాటయ్యాక ఈ 73 ఏళ్ల కాలంలో ఓటు నమోదులో అనేక మార్పులు తెచ్చింది. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలతోపాటు 18ఏళ్లు నిండిన యువతీ, యువకులు తమ మొబైల్‌ ద్వారానే ఓటుహక్కును నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టింది. 2011 జనవరి 25న ఏటా ఓటర్ల దినోత్సవం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల నుంచి జిల్లాస్థాయి వరకూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా 23లక్షల మంది జనాభా ఉండగా అందులో 17లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. 18ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకునేందుకు బుధవారం పోలింగ్‌ కేంద్రాల్లో దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున కొత్తగా నమోదు చేసుకున్న యువతీ యువకులకు కొత్త ఎపిక్‌ కార్డులను కూడా అందజేయ నున్నారు. ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓట్లు వేసిన సీనియర్‌ సిటిజన్స్‌ను సత్కరించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలతోపాటు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేయనున్నారు.

Updated Date - 2023-01-25T00:51:01+05:30 IST