కొండపి వైసీపీలో రచ్చ

ABN , First Publish Date - 2023-01-25T00:47:30+05:30 IST

కొండపి నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబుకు వ్యతిరేకంగా పెద్దసంఖ్యలో నేతలు కొండపిలో మంగళవారం సమావేశమయ్యారు.

కొండపి వైసీపీలో రచ్చ

నియోజకవర్గ ఇన్‌చార్జి అశోక్‌బాబుపై అసమ్మతి నేతల నిప్పులు

టీడీపీ కోవర్టు అని ఆరోపణ

ఆయనకు రాజకీయ మరణశాసనం రాస్తామని ప్రతిన

గోబ్యాక్‌ వరికూటి అంటూ నినాదాలు

పలువురు రాజీనామాలకు సిద్ధం

అధిష్ఠానంతో మాట్లాడి ఆయన్ను మార్చుకుందామని కొందరు సూచన

కొండపి, జనవరి 24 : కొండపి నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబుకు వ్యతిరేకంగా పెద్దసంఖ్యలో నేతలు కొండపిలో మంగళవారం సమావేశమయ్యారు. వరికూటిపై నిప్పులు చెరిగారు. ఆయన వ్యవహార శైలిపై మండిపడ్డారు. టీడీపీ కోవర్టు గోబ్యాక్‌ అని నినదించడంతోపాటు ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అశోక్‌బాబుకు రాజకీయ మరణశాసనం రాస్తామని ప్రతినపూనారు. ఆయనకు పార్టీ టికెట్టు ఇస్తే ఇండిపెండెంట్‌ను పోటీకి దించి ఓడిస్తామని హెచ్చరించారు. వరికూటి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, కార్యకర్తలను కూడా ఆయన వేధిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే అధిష్ఠానంతో మాట్లాడి ఆయన్ను మార్చుకుందామని పలువురు సూచించడంతో ఆమేరకు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.

కొండపిలో అసమ్మతి నేతల సమావేశం

కొండపి వైసీపీలో ఆది నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాదాసి వెంకయ్యను మార్చిన అధిష్ఠానం ఆ బాధ్యతలను వరికూటి అశోక్‌బాబుకు అప్పగించింది. ఆతర్వాత కొంతకాలం అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఇటీవల రచ్చకెక్కింది. అశోక్‌బాబు పోకడను సొంతపార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కామేపల్లి రోడ్డులోని వైసీపీ (బొక్కిసం ఉపేంద్ర) కార్యాలయంలో నియో జకవర్గంలోని ఆరు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది వైసీపీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు అశోక్‌బాబుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు.

నిజమైన కార్యకర్తలకు అన్యాయం

సమావేశంలో కొండపి పీఏసీఎస్‌ అధ్యక్షుడు బొక్కిసం ఉపేంద్రచౌదరి మాట్లాడుతూ వరికూటి అశోక్‌బాబు నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆయనతో కలిసి ముందుకు సాగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అశోక్‌బాబుకు అధి ష్ఠానం సీటిస్తే ఇండిపెండెంట్‌గా గట్టి అభ్యర్థి ని నిలబెట్టి గెలిపించి సీఎం జగన్‌కు కానుక గా ఇస్తామన్నారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు మట్లాడుతూ ఇన్‌చార్జిగా అశోక్‌కు అర్హత లేదన్నారు. ఆయన వార్డు సభ్యుడిగా కూడా గెలవలేరన్నారు. రాజీనామాలు, ఇండిపెండెంట్‌ను రంగంలోకి దించడం వంటి ఆలోచనలు వద్దని సూచించారు. అధిష్ఠానం వద్దకు భారీగా పాదయాత్ర చేపట్టి అయినా సరే అశోక్‌బాబుకు సీటు రాకుండా చేసి కొత్త అభ్యర్థిని తెచ్చుకుందామని అన్నారు. ఇసుక, బియ్యం మాఫియా వద్ద మామూళ్లు మరి గిన అశోక్‌బాబు వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తూ టీడీపీ కోవర్టులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.

ఆయన ఒక దళారీ

కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బొడ్డపాటి అరుణ మాట్లాడుతూ అశోక్‌బాబు వైసీపీ ఇన్‌చార్జి కాదని ఒక దళారీ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘వైసీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టిస్తావా? పార్టీ నిజమైన కార్యకర్తలను చంపుతానని బెదిరిస్తావా? దమ్ముంటే కార్యకర్తల జోలికి రా... పాతేస్తాం...’ అని నిప్పులు చెరిగారు. మర్రిపూడి మండల వైసీపీ నాయకుడు మాచేపల్లి నాగయ్య మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసి కూడా నవ్వులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపి మండలం ఇలవర గ్రామ సర్పంచ్‌ దేపూరి ప్రసన్న లక్ష్మి, మర్రిపూడి మండలం ధర్మవరం సర్పంచ్‌ గంగిరెడ్డి రమణారెడ్డి, చిమట సర్పంచ్‌ లక్ష్మమ్మ భర్త రామిరెడ్డి, పొన్నలూరు మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌ ముండ్లమూరి వెంకటేశ్వర్లు, జరుగుమల్లి మండల వైస్‌ ఎంపీపీ పులి భిక్షాలు, టంగుటూరు మండల నాయకుడు డేవిడ్‌, కోయవారిపాలెం గ్రామ నాయకుడు బొల్లినేని రామకృష్ణ తదితరులు తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. సమావేశం చివరిలో ‘టీడీపీ కోవర్టు అశోక్‌బాబు వద్దు.. సీఎం జగన్‌ ముద్దు, గోబ్యాక్‌ అశోక్‌బాబు, అశోక్‌బాబును తరిమికొడదాం.. కొండపి సీటును గెలిపించుకుందాం’ అని నినదించారు. సమావేశంలో జరుగుమల్లి మండల వైసీపీ నాయకులు కొర్రకూటి వెంకటేశ్వర్లు, గాలి శ్రీనివాసరావు, పాడిబండ్ల నాగేశ్వరరావు, మర్రిపూడి మండలనాయకుడు బోదా రమణారెడ్డి, కొండపి మండల నాయకులు బొక్కిసం సుబ్బారావు, దివి శ్రీనివాస రావు, గౌరెడ్డి రమణారెడ్డి, దుగ్గిరా ల వెంకటేశ్వర్లు, రాయుడు, వేమవరపు వసంతరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:47:32+05:30 IST