మొగిలిగండాల'' మినీ రిజర్వాయర్‌

ABN , First Publish Date - 2023-01-24T22:56:36+05:30 IST

దశాబ్దాలకాలంగా ఎదురుచూస్తున్న మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ నిర్మాణానికి అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఎప్పుడూ ఏవో సమస్యలు ముసురుకుంటూనే ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు మొదలుపెట్టబోయే సరికి ఎన్నికల నియమావళి అడ్డు వచ్చాయి. దీంతోపనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత వైసీపీ వచ్చాక ఆ టెండర్‌ను రద్దు చేసింది. మళ్లీ టెండరు పిలిచింది. 16 నెలల క్రితం రిజర్వాయర్‌ నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపే పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే మద్దిశెట్టి హామీ ఇచ్చారు. నేటికీ పనులు ముందుకు సాగలేదు.

మొగిలిగండాల'' మినీ రిజర్వాయర్‌
నీరు లేని మొగిలిగుండాల చెరువు

చెరువు కట్టను తొలగించి అర్ధంతరంగా పనులు నిలుపుదల

బిల్లులు చెల్లించకపోవడంతో యంత్రాలను వెనక్కి తీసుకెళ్లిన కాంట్రాక్టర్‌

16 నెలలు దాటుతున్నా అడుగు ముందుకు పడని నిర్మాణం

ముంపు భూములకు నేటికీ చెల్లించని నష్టపరిహారం

చెరువు లోతట్టులో నీరు నిల్వ ఉండకపోవడంతో అడుగంటిన సమీపబోర్లు

పంటలు ఎండిపోతున్నాయని రైతుల్లో ఆందోళన

అమలుకు నోచుకోని ఏడాదిలోపు పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే హామీ

తాళ్లూరు, జనవరి 24 : దశాబ్దాలకాలంగా ఎదురుచూస్తున్న మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ నిర్మాణానికి అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఎప్పుడూ ఏవో సమస్యలు ముసురుకుంటూనే ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు మొదలుపెట్టబోయే సరికి ఎన్నికల నియమావళి అడ్డు వచ్చాయి. దీంతోపనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత వైసీపీ వచ్చాక ఆ టెండర్‌ను రద్దు చేసింది. మళ్లీ టెండరు పిలిచింది. 16 నెలల క్రితం రిజర్వాయర్‌ నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపే పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే మద్దిశెట్టి హామీ ఇచ్చారు. నేటికీ పనులు ముందుకు సాగలేదు.

తాళ్లూరు పరిసర ప్రాంతాల్లోని 20 గ్రామాల రైతుల కోసం శివరాంపురం సమీపంలో ఉన్న మొగిలిగుండాల చెరువును బూచేపల్లి సుబ్బారెడ్డి మినీరిజర్వాయర్‌గా మార్చే నిర్మాణం ఏటికేడు వెనక్కిపోతోంది. దాని నిర్మాణానికి, భూసేకరణకు 10కోట్ల 40లక్షల రూపాయలు మంజూరు చేసి దివంగత సీఎం వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా 2021 సెప్టెంబరు 2న భూమిపూజ చేశారు. ప్రాజెక్టు పనులు ఏడాదిలో పూర్తి చేసి వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వేణుగోపాల్‌ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టరుకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశాడు.

50 ఏళ్ల కల.. తొలి శంకుస్థాపన టీడీపీ హయాంలో...

ఈ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటి కోసం దాదాపు 50ఏళ్లుగా మొగిలిగుండాల రిజర్వాయర్‌ నిర్మాణం కోసం పోరాడుతూనే ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలన చివరి దశలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు ప్రత్యేక కృషితో మినీరిజర్వాయర్‌ నిర్మాణం కోసం దాదాపు రూ.11కోట్ల నిధులు కూడా మంజూరు చేయించి భూమి పూజ చేశారు. టెండర్లు పూర్తై పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల నియమావళి అడ్డు రావటంతో పనులు మొదలు పెట్టలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రిజర్వాయర్‌ టెండర్‌ను రద్దు చేసింది. కొద్దికాలం అనంతరం రూ.10.40 కోట్లతో మళ్లీ రీటెండర్‌ను పిలిచారు. 1 శాతం అదనపు ధరతో కడపకు చెందిన భగీరథ కనస్ట్రక్షన్స్‌ కంపెనీ దక్కించుకుంది. తొలుత భూసేకరణకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులు చేపట్టాలని భూనిర్వాసిత రైతులు డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం చెల్లించే బాధ్యత తనదని పూర్వపు ఇరిగేషన్‌ డీఈ హామీ ఇవ్వటంతో రైతులు పనులు జరిపేందుకు అంగీకరించారు. అన్ని అరిష్టాలను దాటుకుని 2021 సెప్టెంబరు 2న ఎమ్మెల్యే మద్దిశెట్టి భూమి పూజ చేశారు.

యంత్ర సామగ్రిని కూడా తరలించిన కాంట్రాక్టర్‌

టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు రెండు నెలలపాటు పనులు చేశారు. రిజర్వాయర్‌ నిర్మాణం కోసం చెరువు కట్టను పూర్తిగా తొలగించారు. దాదాపు 30 అడుగుల ఎత్తు 20అడుగుల వెడల్పుతో రెండుపర్లాంగుల పొడవున చెరువు కట్ట మట్టిని తొలగించి చదును చేశారు. చేసిన పనులకు ఎంతకీ బిల్లులు జమకాకపోవటంతో కొంతకాలం నిరీక్షించిన కాంట్రాక్టర్‌ ఆర్థిక భారం కావడంతో ఆ తర్వాత పనులు నిలిపివేశాడు. ఆ తర్వాత కొద్దికాలానికి యంత్రసామగ్రిని కూడా వేరే ప్రాంతానికి తరలించారు.

నష్టపరిహారం ఊసే లేదు

పనులు చేపట్టగానే భూనిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామన్న ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే పనులు ఆగిపోవడం, యంత్రసామగ్రిని కాంటాక్టర్‌ తీసుకెళ్లడంతో రైతులు ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు. రిజర్వాయర్‌ నిర్మాణం కోసం కేటాయించిన భూముల్లో సాగు చేపట్టారు. 16 నెలలుగా పనులు ముందుకు సాగకపోవటంతో రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి.

కట్టలు చదును చేయడంతో మరో సమస్య

చెరువు కట్టను తొలగించి చదును చేయటం వల్ల రైతులకు మరో సమస్య వచ్చిపడింది. ఈ ఏడాది వర్షాలు పడినా చెరువులో చుక్క నీరు నిల్వ ఉండలేదు. దీంతో సమీప బోరు బావుల్లో నీరు అడుగుంటింది. వాటి ఆధారంగా సాగు చేపట్టిన రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

భూనిర్వాసితులకు నష్టపరిహాం త్వరగా చెల్లించాలి

గాడిపర్తి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, శివరాంపురం

రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రెండేళ్లు కావస్తున్నా నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోలేదు. భూసేరకణ, ఎస్‌ఐడీ కింద 2కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయి స్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు 40 మందికి చెందిన 50ఎకరాలకుపైగా ముంపులో పోతుంది. పనులు ప్రారంభం కాగానే భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన అధికారులు నేటికీ పైసా కూడా ఇవ్వలేదు. త్వరితగతిన పరిహారం చెల్లించాలి.

ఉన్న చెరువుకట్టను తొలగించి పనులు అర్ధంతరంగా నిలిపారు

ఆలోకం సూర్యనారాయణ, శివరాంపురం

మినీ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ఉన్న చెరువుకట్టను తొలగించి పనులు నిలిపివేశారు. పెద్దది, పొడవైన కట్టను తొలగించడంతో చెరువులో చుక్క నీరు కూడా నిలవడం లేదు. చెరువులో నీరుంటేనే బోరుబావుల్లో ఊట ఉండి చుట్టుపక్కల పొలాలకు సమృద్ధిగా నీరు అందుతుంది. ఇటీవల విపరీతంగా వర్షాలు కురిసినా చెరువుకు కట్టలేకపోవటం వల్ల నీరంతా దిగువకు వెళ్లిపోయింది.

Updated Date - 2023-01-24T22:56:36+05:30 IST