పన్నుల బాదుడు తప్పితే అభివృద్ధి ఏదీ..!

ABN , First Publish Date - 2023-02-06T23:11:54+05:30 IST

కనిగిరి, నగర పంచాయతీ పరిధిలోని శివారు కాలనీల వాసులు పలు సమస్యలతో అల్లాడిపోతున్నారు. అభివృద్ధి లేకపోగా.. పన్నుల బాదుడిని భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాశిరెడ్డి కాలనీ, పాతూరు ప్రజలు పలు సమస్యలతో తిప్పలు పడుతున్నారు. మౌలిక వసతులు కరువై అల్లాడుతున్నారు. నగర పంచాయతీ అయ్యాక పన్నులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయే తప్ప వసతులు కల్పించలేదు. దాదాపు 300 వరకు గృహాలున్న కాశిరెడ్డికాలనీని సైతం పాలకులు పట్టించుకోవడం లేదని ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పన్నుల బాదుడు తప్పితే అభివృద్ధి ఏదీ..!
కాశిరెడ్డి కాలనీలో నీటి డ్రమ్ములు, మంగలిమాన్యంలో రోడ్లపైకి పారుతున్న మురుగు

అల్లాడిపోతున్న కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని శివారు కాలనీల్లోని ప్రజలు

తాగు, వాడుకనీటికి అగచాట్లు

వెలగని విద్యుత్‌ దీపాలు

కాల్వలు లేక ఇళ్ల ముంగిట రోడ్డు పైనే మురుగు నీరు

కనిగిరి, ఫిబ్రవరి 6 : స్థానిక నగర పంచాయతీ పరిధిలోని శివారు కాలనీల వాసులు పలు సమస్యలతో అల్లాడిపోతున్నారు. అభివృద్ధి లేకపోగా.. పన్నుల బాదుడిని భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాశిరెడ్డి కాలనీ, పాతూరు ప్రజలు పలు సమస్యలతో తిప్పలు పడుతున్నారు. మౌలిక వసతులు కరువై అల్లాడుతున్నారు. నగర పంచాయతీ అయ్యాక పన్నులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయే తప్ప వసతులు కల్పించలేదు. దాదాపు 300 వరకు గృహాలున్న కాశిరెడ్డికాలనీని సైతం పాలకులు పట్టించుకోవడం లేదని ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్గత రోడ్లు అధ్వానం

కాశిరెడ్డికాలనీ, పాతూరు మంగలిమాన్యంలోని అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రధాన రోడ్లు కొన్ని సీసీరోడ్లుగా మారినా, ఇంకొన్ని మట్టిరోడ్లు కాలుపెట్టడానికి కూడా వీలులేని విధంగా తయారయ్యాయి. డ్రైనేజి కాలువలు లేకపోవటంతో ఇళ్ళల్లోని మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్ఘందం వెదజల్లుతోంది. అంతర్గత రహదారులు గుంతల్లో వర్షపు నీరు నిలిచి మురుగు గుంటలుగా మారాయి. డ్రైనేజి కాలువల్లో మురుగును మున్సిపాలిటీ సిబ్బంది సక్రమంగా శుభ్రం చేయకపోవటంతో లార్వా పెరిగి దోమలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. దీంతో గ్రామంలో విషజ్వరాలు సోకి ఆసుపత్రి పాలవుతున్నారు.

నీటి కోసం ఇక్కట్లు

ప్రధానంగా తాగు, వాడుక నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లు వారానికో మారు వస్తున్నాయని, దీంతో వాడుక నీటికి నానా అగచాట్లు పడుతున్నామని మహిళలు చెప్తున్నారు. సాగర్‌ నీరు వచ్చే వీలు లేకపోవటంతో ప్లాంట్‌ల నుంచి వచ్చే బబుల్‌ నీటిని రూ.10 ఇచ్చి తెచ్చుకొని తాగుతున్నారు. కూలీనాలీ చేసుకునే వారు సాయంత్రానికి ఇంటికివచ్చే సరికి నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనిగిరి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ మౌలిక వసతులు కరువయ్యాయని వాపోతున్నారు. పాలకవర్గం కాని, అధికారులు కాని పట్టించుకున్న పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. కాలనీలో ఉన్న బోరు పంపులు సరిగా పనిచేయటం లేదు.

హామీలకే పరిమితమైన పాలకులు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక శివారు కాలనీలకు ఒరిగిందేమి లేదని కాలనీ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇంటింటికి సాగర్‌ నీటి కుళాయి అంటూ ఇంకా ఊరిస్తూనే ఉన్నారు. కార్యాచరణ మాత్రం శూన్యం. ఎన్నికలకు ముందు కాలనీలో అంతర్గత రోడ్లు సీసీ రోడ్లు వేయిస్తామని చెప్పారు. కానీ ఆ దిశంగా కృషి చేసిన దాఖలాలు కనపడటం లేదు.

పాతూరులో పారిశుధ్యం అధ్వానం

పాతూరులోని మంగలిమాన్యంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. అసంపూర్తిగా ఒదిలేసిన సిమెంటు రోడ్డు కారణంగా, సైడు కాల్వలు లేక ప్రజలు నానాఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగలిమాన్యంలో దాదాపు 100 గృహాలకు పైగా, 350కి పైగా జనాభా ఉన్న పాములవారి(బీసీ) కాలనీ లోపలికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. రోడ్లపై మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. కాలనీలో వీధి లైట్లు వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి. నీటి కుళాయిలు కాలనీలో రెండు మాత్రమే ఉండగా, ఆ కుళాయిలు కూడా మురుగు కాల్వలలో ఉండటంతో మురుగుతో కూడిన నీటిని పట్టుకునే పరిస్థితి ఉంది.

ట్యాంక్‌కు నీరు వదిలి నెలలు తరబడి కావస్తుంది

పద్మ, కాశిరెడ్డికాలనీ

కాలనీలోని ట్యాంక్‌కు నీరు వదిలి నెలల తరబడి కావస్తుంది. పోనీ ట్యాంకర్లు ద్వారానైనా సక్రమంగా నీటిని సరఫరా చేయటం లేదు. వారానికోసారి ట్యాంక ర్లు వస్తున్నాయి. అందరూ ట్యాంకరు నీటిని తెచ్చుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారు. వారానికోసారి రావటంతో కాలనీ వాసులకు సరిపోవటం లేదు.

సైడు కాల్వలు లేక మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయి

వెంకటేశ్వర్లు, కాశిరెడ్డి కాలనీ

కాలనీలో ఎక్కడా సైడు కాల్వలు లేవు. ఇళ్లలో వాడుకున్న నీరు ఇంటి ముందు గుంత తీసుకుని మళ్లిస్తున్నాం. ఆ గుంతల్లో నీరు నిలిచిపోయి దోమలు వస్తున్నాయి. వదిలేస్తే నీరంతా రోడ్లపైకి చేరి మరింత ఇబ్బందిగా మారింది. కాలనీలో పగలు, రాత్రి తేడా లేకుండా వీది లైట్లు వెలుగుతున్నాయి. కొన్ని చోట్ల అసలు వీది లైట్లే లేవు. కొండ దిగువన నివాసాలు కావటంతో పాములు వస్తున్నాయి. భయం గుప్పిట్లో గడుపుతున్నాం. కార్యక్రమాలప్పుడు అధికార పార్టీ నేతలు వస్తారు. అది చేసేస్తాం.. ఇది చేసేస్తాం అంటారు. అంతకు మించి మాకు ఒరిగిందేమి లేదు.

Updated Date - 2023-02-06T23:11:56+05:30 IST