జీజీహెచ్‌కు జబ్బు

ABN , First Publish Date - 2023-02-07T00:13:30+05:30 IST

ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్‌ వైద్యం అందించిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు సాధారణ జబ్బులకూ చికిత్స అంతంతమాత్రంగానే అందుతోంది. అరకొర వైద్య సదుపాయాలు, వైద్యుల కొరత కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్న రోగులకు భయం తప్ప భరోసా లభించడం లేదు.

జీజీహెచ్‌కు జబ్బు
ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)

శస్త్ర చికిత్సలు శూన్యం

గుండె, కిడ్నీ, క్యాన్సర్‌, లివర్‌,

నెఫ్రాలజీ, న్యూరో సేవలు నిల్‌

టీడీపీ హయాంలో ప్రైవేటు స్పెషలిస్ట్‌

డాక్టర్లతో అత్యవసర ఆపరేషన్లు

ప్రస్తుతం గుంటూరు,

విజయవాడకు సిఫారసు

సాధారణ వైద్యమూ అంతంత మాత్రమే

కొన్ని రోగాలకు మందు బిళ్లలూ కరువు

పేదల పెద్దాసుపత్రి అయిన ఒంగోలులోని జీజీహెచ్‌కు జబ్బు చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చే రోగులకు రోదనే మిగులుతోంది. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ పాలకులు చేసిన ఆర్భాటం ఆరంభశూరత్వమే అయ్యింది. ఇక్కడ అత్యవసర వైద్యం కూడా అందని దుస్థితి నెలకొంది. సాధారణ జబ్బులకు కూడా సరైన మందులు కరువయ్యాయి. ఇక రక్త పరీక్షలు సైతం పూర్తిస్థాయిలో చేయడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్పెషాలిటీ వైద్యశాలల్లోని స్పెషలిస్ట్‌ డాక్టర్లను వారానికి ఒకసారి పిలిపించి గుండె, కిడ్నీ, లివర్‌, న్యూరో, కీలు మార్పిడి వంటి ఆపరేషన్‌లు చేయగా, ప్రస్తుత వైసీపీ పాలనలో అత్యవసర శస్త్ర చికిత్సలకు గుంటూరు, విజయవాడకు సిఫార్సు చేస్తున్న పరిస్థితి దాపురించింది.

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 6 : ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్‌ వైద్యం అందించిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు సాధారణ జబ్బులకూ చికిత్స అంతంతమాత్రంగానే అందుతోంది. అరకొర వైద్య సదుపాయాలు, వైద్యుల కొరత కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్న రోగులకు భయం తప్ప భరోసా లభించడం లేదు.

మెరుగైన వైద్యం కోసం గుంటూరుకే

ఆసుపత్రిలో ప్రస్తుతం 150 మందికి పైగా వైద్యులు పని చేస్తున్నారు. మరో సుమారు 50 పోస్టుల వరకూ ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల్లో ఎక్కువ సూపర్‌ స్పెషలిటీ వైద్యులకు సంబంధించినవే. ముఖ్యంగా శస్త్ర చికిత్సలకు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. సర్జరీ విభాగానికి 70 శాతం మంది శస్త్ర చికిత్సల కోసమే వస్తుండగా వైద్యులు లేకపోవడంతో వారంతా ఉసూరుమంటున్నారు. గుండె సంబంధిత జబ్జులకు వైద్యుడు ఉన్నప్పటికీ పరీక్షలకు అవసరమైన క్యాథ్‌ ల్యాబ్‌ లేదు. దీంతో ఈసీజీలకే పరిమితమవుతున్నారు. ఎకో, యాంజియోగ్రామ్‌, స్టంట్‌లు, బైపాస్‌ సర్జరీకి ప్రైవేటు ఆసుపత్రిలే దిక్కయ్యాయి. కిడ్నీ, క్యాన్సర్‌, లివర్‌, న్యూరాలజిస్ట్‌, నెఫ్రాలజీ, న్యూరో సర్జన్‌, కీలు మార్పిడి, కార్పొరేట్‌ వైద్యం ఖరీదు కావడంతో పేదవాళ్లు శస్త్ర చికిత్సలకు గుంటూరు పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వ సర్వజన ఆసుత్రిలో సాధారణ వైద్యం. కాన్పుల శస్త్ర చికిత్సలకే పరిమితం అవుతున్నారు.

ఆధునిక శస్త్ర చికిత్సలు కరువు

గత టీడీపీ ప్రభుత్వ హయంలో రిమ్స్‌గా ఉన్నపుడు రోగులకు ఆధునిక వైద్య సేవలు అందించారు. గుండె, కీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేసేవారు. కిడ్నీ, లివర్‌ క్యాన్సర్‌ వంటి రోగాలకు వారం వారం కార్పొరేట్‌ వైద్యులను పిలిపించి, వారి సహకారంతో ఉచితంగా శస్త్ర చికిత్సలు అందించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ వైద్యం కూడా పూర్తిస్థాయిలో అందని దుస్థితి నెలకొంది. రిమ్స్‌ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)గా పేరు మార్చి ఆధునిక వైద్య అందిస్తామని వైసీపీ పాలకులు ప్రగల్భాలు పలికారు. కానీ సాధారణ శస్త్ర చికిత్సలు చేసేవారు కనిపించడం లేదు. కేవలం గర్భిణులకు సంబంధించి ఆపరేషన్‌లు మాత్రమే ఇక్కడ చేస్తున్నారు. మిగిలిన వ్యాధులకు శస్త్ర చికిత్సలు చేసే వారు కరువయ్యారు. దీంతో ఇతర ప్రాంతాలకు సిఫారసు చేస్తున్నారు.

సాధారణ మందులకూ కొరత

రిమ్స్‌లో సాధారణ మందు బిళ్లలకూ కొరత ఏర్పడింది. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను బట్టి, ఆయా రోగాలకు నెలవారీ 250 రకాల మందుల అవసరం ఉంది. అయితే కేవలం కొన్ని యాంటీబయాటిక్స్‌, బీకాంప్లెక్స్‌, గ్యాస్ట్రిక్‌ మందు, నొప్పులకు సంబంధించిన టాబ్లెట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇతర జబ్బుల వారు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా హిమోఫీలియా బాధితులకు ఖరీదైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్న ఈ రోగులకు వాడే ఇంజక్షన్లు ఫ్యాక్టర్‌-8,9 ఖరీదు సుమారు రూ. 2వేలకు పైనే ఉంటుంది. వీరికి మందుల ఖర్చు ఏడాదికి రూ.10లక్షల వరకూ అవుతుంది. అంత వెచ్చించలేక బాధితులు అల్లాడుతున్నారు. పేరుకు ప్రభుత్వ ఆసుపత్రి అయినా అక్కడ మందులు లేక చీటి చేతపట్టుకుని బయట మందులు షాపులకు వెళ్లాల్సి వస్తున్నదని రోగులు వాపోతున్నారు.

తగ్గిన ఔట్‌ పెషెంట్‌ల రాక

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రిమ్స్‌గా ఉన్నప్పుడు రోజుకు సుమారు 2000 వరకూ ఓపీలు వచ్చేవి. 400 మంది వరకూ ఇన్‌పేషెంట్‌లు ఉండేవారు. ఇప్పుడు ఓపీల సంఖ్య 600కు పడిపోయింది. వైద్యుల కొరత ఉండటం, కనీస సౌకర్యాలు లేకపోవడం, ఇతరత్రా పలు కారణాలు, వివిధ విభాగాల్లో లోపాలు రోగులకు శాపంగా మారాయి. కీలకమైన చికిత్సా విభాగాల్లో వసతులు లేక వేదనే మిగులుతోంది. దీంతో పేదలకు కార్పొరేట్‌ వైద్యం సంగతి దేవుడెరుగు ప్రాణాలు దక్కితే చాలన్నట్లుగా ఇక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వైద్యులు, వైద్య పరికరాలు లేనందునే..

డాక్టర్‌ భగవాన్‌ నాయక్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు ఖరీదైన వైద్య పరికరాలు అవసరం ఉంది. అలాగే కొన్ని ఆపరేషన్‌లకు నిపుణులైన డాక్టర్లు కావాలి. అవేవీ లేని కారణంగా ఇతర జిల్లాలకు సిఫారసు చేస్తున్నారు. ప్రొఫెసర్స్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం జరిగితే కొంతమేర శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి సాధారణ శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. వైద్యుల కొరత, వైద్య పరికరాల అవసరాన్ని ప్రభుత్వం దృషికి తీసుకెళ్ళాం.

Updated Date - 2023-02-07T00:13:33+05:30 IST