వదిలేదేలే!

ABN , First Publish Date - 2023-01-26T03:06:03+05:30 IST

నగరంలోని రాజరాజేశ్వరస్వామి దేవాలయ షాపుల అద్దె బకాయిలు వాస్తవమేనని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఈ.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

వదిలేదేలే!

అద్దె బకాయిలు వాస్తవమే

గత ఈవోనే బాధ్యుడు

ఆయన నుంచే వసూలు చేస్తాం

దేవదాయశాఖ డీసీ చంద్రశేఖర్‌ రెడ్డి

ఒంగోలు(కల్చరల్‌), జనవరి 25 : నగరంలోని రాజరాజేశ్వరస్వామి దేవాలయ షాపుల అద్దె బకాయిలు వాస్తవమేనని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఈ.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.12.32 లక్షల వరకు రావాల్సి ఉందని చెప్పారు. లీజుదారుడు చెబుతున్నట్లు అద్దె బకాయిలను మాఫీ చేస్తూ తమ శాఖ ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. స్థానిక తూర్పుపాలెం శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న షాపుల లీజు బకాయిలు, గ్రూపు రాజకీయాలపై ‘గలీజు’ పేరుతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కఽథనం దేవాదాయ శాఖలో పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ నేపఽథ్యంలో డీసీ చంద్రశేఖర్‌రెడ్డి ఈ విషయమై బుధవారం స్థానిక దేవదాయశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఏసీ జి.మాధవి, ఈవో పి.అంజనీదేవిల సమక్షంలో ఆలయ చైర్మన్‌ చాకిరి ధనుంజయ్‌, పలువురు ట్రస్ట్‌ బోర్డు సభ్యులను ప్రశ్నించారు. దేవాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై దేవదాయశాఖ కమిషనరుకు ఫిర్యాదు చేసిన కొందరు వ్యక్తులను సైతం విచారించారు. అనంతరం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ లీజుదారుడితో తమకు సంబంధం లేదని, బకాయిలు వసూలు చేయకపోవటం అప్పటి ఈవో నిర్లక్ష్యమేనన్నారు. సదరు మొత్తాన్ని ఆయన దగ్గర నుంచి వసూలు చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నాకే దేవస్థానం డబ్బులు చెల్లించాలి

తాను దేవస్థానానికి ఎటువంటి బకాయి లేనని, తనకే దేవస్థానం నుంచి రూ.1.53 లక్షలు రావాల్సి ఉందని లీజుదారుడు పసుపులేటి హరిబాబు స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి కథనంపై ఆయన స్పందిస్తూ తన అభ్యర్థన మేరకు కొవిడ్‌ లాక్‌డౌన్‌ కాలానికి తాను చెల్లించాల్సిన అద్దె బకాయిని రద్దుచేస్తూ కమిషనర్‌ 2022 జనవరి 3న ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఆ విధంగా తాను కేవలం రూ.2.32లక్షలు మాత్రమే అద్దెరూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. అయితే ఆక్షన్‌ డిపాజిట్లు, అద్దె సెక్యూరిటీ డిపాజిట్‌ రూపంలో దేవస్థానానికి పలు దఫాలుగా మొత్తం రూ.3.85లక్షలు చెల్లించానని చెప్పారు. అద్దె బకాయి పోను తనకే దేవస్థానం రూ.1.53లక్షలు తిరిగి ఇవ్వాల్సి ఉందన్నారు.

నాకే పాపం తెలియదు : మాజీ ఈవో దామా

బకాయి విషయంలో తాను ఏ పాపం ఎరుగనని, కేవలం తనను అభాసుపాలు చేయటానికి ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌, కొంతమంది డైరెక్టర్లు బయటి వ్యక్తులతో కలిసి కుట్ర చేస్తున్నారని మాజీ ఈవో దామా నాగేశ్వరరావు అన్నారు. ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గొడవలతో వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయ ప్రతిష్ట మసకబారుతున్నదనే ఆందోళన భక్తులు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-01-26T03:06:03+05:30 IST