Lokesh Padayatra: లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు

ABN , First Publish Date - 2023-01-25T02:31:26+05:30 IST

నాడు.. సరిగ్గా ఐదేళ్ల కిందట... టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు.

Lokesh Padayatra: లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు

లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు

తేడా వస్తే అనుమతులు రద్దు

15 షరతులు విధించిన పలమనేరు డీఎస్పీ

పంచాయతీ రోడ్లపైనా సభలు పెట్టొద్దు

తొలి మూడు రోజులకు మాత్రమే అనుమతి

నాడు రాష్ట్రస్థాయిలో జగన్‌ యాత్రకు అనుమతి

మూడంటే మూడు నిబంధనలతో జగన్‌ యాత్ర

నేడు అడుగడుగునా ఆంక్షలు, షరతులు

సబ్‌డివిజన్‌లవారీగా దరఖాస్తు తప్పదు

ఆంక్షలపై టీడీపీ నేతల్లో విస్మయం

అందరి యాత్రల్లాగే సాగుతుంది: టీడీపీ నేతలు

(అమరావతి/చిత్తూరు - ఆంధ్రజ్యోతి): నాడు.. సరిగ్గా ఐదేళ్ల కిందట... టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు. అప్పుడు ఆయన పాదయాత్రకు పోలీసులు మూడంటే మూడు నిబంధనలతో అనుమతి ఇచ్చారు. పాదయాత్రలో ఊరూరా తిరిగిన జగన్‌ హామీల వర్షం కురిపించి, చంద్రబాబు పాలనపై ఆరోపణలు గుప్పించి అధికారంలోకి వచ్చారు.

నేడు..

ఈనెల 27వ తేదీ నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పాదయాత్ర తలపెట్టారు. ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు... 400 రోజులు 4000 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్రకు అనుమతి ఇస్తున్నదీ, లేనిదీ చెప్పకుండా పోలీసులు సోమవారం దాకా నాన్చారు. మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌ రెడ్డి ఈ యాత్రకు అనుమతి ఇచ్చారు. అదీ... అనేక షరతులతో! ‘గీత దాటితే అనుమతులు రద్దు చేస్తాం’ అని సూటిగా చెప్పారు. ఈ అనుమతులు కూడా పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధికి మాత్రమే వర్తిస్తాయి. ఆ తర్వాత మరో డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి. అప్పట్లో జగన్‌కు డీజీపీ స్థాయిలో రాష్ట్రమంతా పాదయాత్ర చేసుకోవడానికి ఒకేసారి అనుమతి లభించగా... ఇప్పుడు లోకేశ్‌ పాదయాత్రకు డీఎస్పీ స్థాయి అధికారులతో ఎక్కడిక్కడ అనుమతులు తీసుకోవాలనడం గమనార్హం. లోకేశ్‌ పాదయాత్రకు పలమనేరు డీఎస్పీ ఏకంగా 15 షరతులు విధించారు. అవి చూసి టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది రెండు కాళ్లూ కట్టేసి, ఇక నడవండి అన్నట్లుగా ఉందని మండిపడుతున్నారు.

అడ్డంకులు సృష్టించేందుకే..

లోకేశ్‌ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి పోలీసుల ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోరాదని టీడీపీ నిర్ణయించుకుంది. ఆంక్షలపై పార్టీ సీనియర్లు చర్చించుకున్నారు. గతంలో ఏ పాదయాత్రకూ ఇలాంటి షరతులు విధించలేదని, ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘గతంలో పాదయాత్రలు ఎలా జరిగాయో ఇదీ అలాగే జరుగుతుంది. పోలీసుల పేరుతో షరతులు పెట్టి ఆటంకాలు కలిగించాలని చూసినా వాటిని మేం పట్టించుకోదల్చుకోలేదు. మేమెలా అనుకున్నామో అలాగే వెళ్తాం. ఇది మా పార్టీ నిర్ణయం’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘జగన్‌ ఎలా పాదయాత్ర చేశారో లోకేశ్‌ కూడా అలాగే చేస్తారు. అడ్డుపడాలని చూస్తే ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం అడ్డుపడితే ప్రజలు మరింత మంది వస్తారు. వైసీపీ తన గొయ్యి తాను తవ్వుకొంటే మేమేం చేస్తాం’ అని మరో నాయకుడు అన్నారు. ఇంకోవైపు.. ఈ సుదీర్ఘ పాదయాత్రకు అటు లోకేశ్‌, ఇటు టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి స్ధాయిలో సన్నద్ధమవుతున్నారు.

తాను ఒక ఏడాదిపాటు ఇంటికి వచ్చేది లేదని భార్య బ్రాహ్మణికి, కొడుకు దేవాన్ష్‌కు లోకేశ్‌ చెప్పారు. ఆయన బృందాల్లో ఒకటి ఈ యాత్రకు సంబంధించి వాహనాలు, రాత్రి బస, భోజన వసతి, సెక్యూరిటీ తదితర అంశాలు చూసుకొంటోంది. మరో బృందం ఈ యాత్రలో లేవనెత్తాల్సిన అంశాలు, ప్రజల నుంచి వినవచ్చే సమస్యలు, వివిధ వర్గాలతో జరిపే సమావేశాల్లో చెప్పాల్సిన విషయాలపై కసరత్తు చేస్తోంది. మరో బృందం యాత్ర పొడవునా పార్టీ నేతలతో సమన్వయ బాధ్యతలు నిర్వహించే పని నిర్వర్తిస్తోంది. ఈ యాత్రలో లోకేశ్‌ సుమారు నూట పాతిక అసెంబ్లీ నియోజకవర్గాలు సందర్శించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున మూడు రోజులు యాత్ర కొనసాగుతుంది.

నేడు లోకేశ్‌ పాదయాత్రకు...

లోకేశ్‌ పాదయాత్రకు అనుమతి ఇస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ ఎన్‌. సుధాకర్‌ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఏకంగా పదిహేను నిబంధనలు పెట్టారు. ఈ అనుమతి కూడా తన పరిధిలో ఉన్న ప్రాంతం వరకూ మాత్రమే ఇచ్చారు.

1) ఈ అనుమతి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం ఆరు వరకే వర్తిస్తుంది. (పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధిలో మాత్రమే)

2) శాంతి భద్రతలకు, శాంతికి భంగం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నమైతే ఈ అనుమతిని ముందస్తు సమాచారం కూడా లేకుండా రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు.

3) జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల మీద సభలు పెట్టరాదు. అత్యవసర సర్వీసులు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలిగించరాదు. ఇరుకుగా ఉన్నందువల్ల మునిసిపల్‌ రోడ్లు, పంచాయితీరాజ్‌ రోడ్లపై కూడా సభలు పెట్టరాదు. సభ పెట్టాల్సి వస్తే విడిగా ఒక స్థలం చూసుకోవాలి. తగినంత ముందుగా దాని గురించి సంబంధిత డీఎస్పీకి తెలియజేసి ముందస్తు అనుమతి పొందాలి.

4)పాదయాత్ర లేదా రోడ్‌ షోను బహిరంగ సభగా మార్చరాదు.

5) పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాల వారితో నిర్వహించే సమావేశాలు బహిరంగ సభల మాదిరిగా నిర్వహించరాదు. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి సమావేశాల్లో మైక్‌ ఉపయోగించాలంటే ముందుగా పోలీస్‌ అనుమతి తీసుకోవాలి. బహిరంగ సభ మాదిరిగా నిర్వహించాలనుకుంటే సంబంధిత డీఎస్పీ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. బహుళ ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ మార్గాలున్న ప్రదేశాలను వీటికి ఎంపిక చేసుకోవాలి.

6) పాదయాత్ర లేదా రోడ్‌ షో మొత్తం రహదారిని మూసివేయకుండా చూడాలి. రోడ్డుపై ప్రజలు, ట్రాఫిక్‌ ప్రయాణించడానికి ఆటంకాలు లేకుండా చూడాలి.

7) అనుమతించిన సంఖ్యకన్నా ఎక్కువ వాహనాలు పాదయాత్రలో వినియోగించకుండా జాగ్రత్త వహించాలి. 8)రద్దీని నివారించడానికి, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడటానికి, ప్రజల రక్షణ నిమిత్తం తగినంత సంఖ్యలో మహిళా, పురుష వలంటీర్లను పెట్టుకోవాలి. వలంటీర్లు అందరూ యూనిఫాం వేసుకోవాలి. రద్దీని అదుపు చేయడానికి తాళ్ళు కూడా చాలినంత సంఖ్యలో పెట్టుకోవాలి.

9) ముందుగా తెలిపిన దారి, సమయాలను పాటించాలి.

10) పాదయాత్రలో డీజే సిస్టమ్‌, లౌడ్‌ స్పీకర్లు వాడటానికి వీల్లేదు. తక్కువ శబ్దం వచ్చే సింగిల్‌ సౌండ్‌ బాక్స్‌ సిస్టం మాత్రమే వాడాలి. ఎక్కడైనా ఆగిన చోట మాత్రమే మైక్‌ వాడాలి.

11) పాదయాత్రలో పాల్గొనేవారు మారణాయుధాలు, రాళ్ల వంటివి ఉంచుకోకూడదు. మద్యం వాడకం నిషేధం. బాణాసంచా పేల్చరాదు.

12) నిబంధనల ప్రకారమే డ్రోన్లు, ఫ్లైయింగ్‌ కెమెరాలు వాడాలి.

13) పాదయాత్రలో పాల్గొనే వారి రక్షణకు నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఒక అంబులెన్సు సిద్ధంగా ఉండాలి. రాత్రి బస చోట బారికేడ్లు, సరిపోను లైట్లు పెట్టాలి. ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

14) పాదయాత్రకు హాజరయ్యే వారి వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్త తీసుకోవాలి.

15) పైనిబంధనలన్నింటికీ కట్టుబడి ఉంటామని, వాటిని ఉల్లంఘిస్తే తమదే బాధ్యత అని నిర్వాహకులు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలి. వీటిని పాటించకపోతే పాదయాత్ర అనుమతిని రద్దు చేయడానికి, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు హక్కు ఉంటుంది. 1861 పోలీస్‌ చట్టంలోని సెక్షన్‌ 30లోని ఒకటి, రెండు, మూడు, నాలుగు అంశాల కింద ఈ అనుమతి ఇస్తున్నట్లు అందులో తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ పేరుతో ఈ అనుమతి జారీ అయింది.

నేడు కడప దర్గాకు లోకేశ్‌

తిరుపతి/అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ నేటి రాత్రికి తిరుమల రానున్నారు. 27న కుప్పం నుంచి సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన మూడు ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరపనున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించి విమానంలో కడప చేరుకుంటారు. అక్కడ ప్రఖ్యాత అమీన్‌పీర్‌ దర్గాను, ప్రసిద్ధ రోమన్‌ కేథలిక్‌ చర్చిని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు కడప నుంచి బయల్దేరి రాత్రి 10గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రికి అక్కడే జీఎంఆర్‌ గెస్ట్‌హౌ్‌సలో బస చేస్తారు. గురువారం ఉదయం కుటుంబంతో కలసి శ్రీవారిని దర్శించుకుని 10.30కు కుప్పం వెళ్లి అక్కడ బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం వరదరాజుల స్వామి ఆలయంలో పూజలతో యాత్ర ప్రారంభమవుతుంది. కుప్పంలో సభ నిర్వహిస్తారు.

రక్షణ కల్పించాల్సింది పోయి ఆంక్షలా: అచ్చెన్న?

జగన్‌రెడ్డి పర్యటనలకు ముళ్ల కంచెలు పెట్టి మరీ రక్షణ కల్పిస్తున్న పోలీసులు.. లోకేశ్‌ పాదయాత్రకు ఆంక్షలు విధిస్తారా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. యువగళం పాదయాత్రపై ప్రభుత్వ ఆంక్షలు జగన్‌రెడ్డి అభద్రతాభావానికి అద్దం పడుతున్నాయని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. లోకేశ్‌ పాదయాత్ర ప్రకటన చేసినప్పటి నుంచే వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ‘ప్రతిపక్ష నేతలకు పాదయాత్ర చేసే హక్కు లేదా? నాడు చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే జగన్‌రెడ్డి పాదయాత్ర చేసేవారా? ఎన్ని కుట్రలు పన్నినా లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకోలేరు’అని అన్నారు.

అవి సాధారణ నిబంధనలే!

మా నుంచి అన్నివిధాలా సహకారం

‘ఆంధ్రజ్యోతి’తో చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి

‘‘లోకేశ్‌ పాదయాత్రకు మేం సూచించిన నిబంధనలన్నీ చాలా సాధారణమైనవే. ఆంక్షలతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అనవసరంగా కొందరు వదంతులు సృష్టిస్తున్నారు. ఆయన పాదయాత్రకు మా శాఖ నుంచి అన్నివిధాలా భద్రత, సహకారం ఉంటుంది’’ అని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘చిత్తూరు జిల్లాలో లోకేశ్‌ పాదయాత్ర మొత్తం నేషనల్‌ హైవే మీదుగా సాగుతుంది. హైవే మీద ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా అందరూ ఇబ్బంది పడతారు. పాదయాత్రకు ఇబ్బంది కలిగించాలనే ఆలోచన మాకు లేదు. వీలైనంత వరకు అన్ని విధాలుగా సహకరిస్తాం. అవసరమైన భద్రత కల్పిస్తాం. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు అందించి, అనుమతులు తీసుకోవాలి. ప్రస్తుతానికి కుప్పం కార్యక్రమాలకు అనుమతులిచ్చాం. పాదయాత్ర సాగే రెండో నియోజకవర్గం పలమనేరు షెడ్యూల్‌ ఇంకా ఇవ్వలేదు.

జిల్లా మొత్తం ఇవే నిబంధనలతో మంజూరు చేస్తాం’’ అని ఎస్పీ వివరించారు. ఏవైనా కార్యక్రమాలు చేపడితే... నిర్వాహకులు కొంత బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోలీసు శాఖ తరఫున తాము కూడా బాధ్యత వహించి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ‘‘పాదయాత్రకు అవసమైన పూర్తిస్థాయి భద్రత ఇస్తాం. టీడీపీ నాయకులు ఎన్ని వాహనాలకు అనుమతి కోరారో, అన్నింటికీ అనుమతి ఇచ్చేశాం. ఉద్దేశపూర్వకంగా వాహనాల సంఖ్యను తగ్గించలేదు’’ అని స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-25T08:09:20+05:30 IST