AP News: భూముల స్వాహానే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2023-02-06T13:09:31+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యేలు భూములు స్వాహానే పనిగా పెట్టుకున్నారు. అసైన్డ్ భూమి, చుక్కల భూమి, ఇనామ్ భూమి, అర్బన్ సీలింగ్, పోరంబోకు, వివాదాల్లో ఉన్న పట్టాభూమి.. ఇలా ఎక్కడ అవకాశం దొరికినాసరే జెండా పాతేస్తున్నారు.

AP News: భూముల స్వాహానే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) భూములు (Lands) స్వాహానే పనిగా పెట్టుకున్నారు. అసైన్డ్ భూమి, చుక్కల భూమి, ఇనామ్ భూమి, అర్బన్ సీలింగ్, పోరంబోకు, వివాదాల్లో ఉన్న పట్టా భూమి.. ఇలా ఎక్కడ అవకాశం దొరికినాసరే జెండా పాతేస్తున్నారు. ఇంటి స్థలాలు.. ఇతర అవసరాల కోసం ప్రభుత్వం సేకరించే భూ

ముల్లోనూ వైసీపీ నేతలు కోట్ల రూపాయలు గిల్లేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో నాయకులు చక్రం తిప్పడం, రాజధాని స్థాయిలో వారికి ఆశీస్సులు లభించడం షరా మామూలుగా మారింది. ఏ ప్రభుత్వ హయాంలోనూ ఎన్నడూ లేనంత స్థాయిలో భూ దందా సాగుతోంది.

‘పేదలు, అణగారిన వర్గాలకు మేలు’ అనే ముసుగులో భూములు భోంచేయడానికి రంగం సిద్ధమైంది. సొంతంగా మింగడానికి ఏయే భూములు ఖాతాలో వేసుకోవాలో ఒక జాబితా సిద్ధం చేసుకున్నారు. ఇందుకనుగుణంగా ఏళ్లనాటి చట్టాల్లో మార్పులు, రూల్స్‌లో సడలింపులు చేయనున్నారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది... అసైన్డ్‌ భూములే! పేదలు, బలహీనవర్గాల వారికి ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ చట్టం(పీఓటీ)-1977 మేరకు సాగు భూములు ఇస్తున్నారు. వీటినే అసైన్డ్‌ భూములుగా పిలుస్తారు.

ఏపీలో 28 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయి. అసైన్డ్‌ భూములను ఇతరులు కొనకూడదు. ఇది... చట్టం! అయితే... 5.15 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు 2013లోనే తేల్చారు. అంటే... పేదల నుంచి బలవంతులు లాక్కోవడం, తెల్లకాగితాలపై ఒప్పందాలు చేసుకొని కారు చౌకగా తీసుకోవడం, అప్పులు-వడ్డీల కింద చేజిక్కించుకోవడంతోపాటు... పేదలు తమ ఆర్థిక అవసరాల కోసం అనధికారికంగా అమ్ముకోవడం తదితర కారణాలతో అవి ఇతరుల చేతికి చిక్కాయి. నిజానికి... రాష్ట్రంలో 6.50 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూమి పరాధీనమైనట్లు అధికారుల అంచనా. వీటిలో సొంత అవసరాలకు అమ్ముకున్న భూములు 40 శాతం మాత్రమే! మిగిలిన 60 శాతం నేతలు, పెద్దలు బలహీనుల నుంచి అక్రమంగా లాక్కున్నవే. అయితే... అసైన్డ్‌ చట్టం పకడ్బందీగా ఉన్నందున ఆ భూములను అధికారికంగా సొంతం చేసుకోవడం కుదరడంలేదు. ‘చట్టబద్ధం’గా వాటిని దక్కించుకునేలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

అసైన్డ్‌పై పేదలకు హక్కులు ఇస్తే తక్షణం వాటిపై పెద్దలు వాడిపోవడం ఖాయం. ఇప్పటికే వడ్డీ వ్యాపారులు, నేతలు గ్రామాల వారీగా అసైన్డ్‌ భూములను సేకరించిపెట్టుకున్నారు. అమాయక రైతులకు కొంతమొత్తంలో డబ్బుముట్టచెప్పి ఒప్పందాలు చేసుకున్నారు. తక్షణ ఆర్థిక అవసరాల కోసం రైతులు విలువైన భూములను తక్కువ ధరకే వదిలేసుకుంటున్నారు. ఒకసారి భూమి చేజారిపోయాక వారంతా కూలీలుగా మారాల్సిందే. అదే జరిగితే భూ పంపిణీ ఉద్దేశ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ‘‘ప్రతి పేదకు ఎంతో కొంత సాగు భూమి ఉండాలి. అది వారి జీవితానికి ఉపయోగపడాలి’ అనే అసైన్డ్‌ లక్ష్యం పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే... అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులు ఇవ్వడం లేదు. అవి పరాధీనం కాకుండా, రిజిస్ట్రేషన్‌లు నిరోధించారు. చట్టం ఇంత పకడ్బందీగా ఉన్నా 6.50 లక్షల ఎకరాలు పరాధీనం అయ్యాయి. ఇక, భూములు అమ్ముకునేందుకు గేట్లు తెరిస్తే పేదల చేతుల్లో భూములు ఉంటాయా?

అసైన్డ్‌ భూములపై లబ్ధిదారులకే పూర్తి హక్కులు కల్పించాలని, ఇప్పటికే కొనుగోలు చేసిన వారి నుంచి కొంత ఫీజు వసూలు చేసి క్రమబద్ధీకరించాలని టీడీపీ హయాంలో ఒక ప్రతిపాదన వచ్చింది. కానీ.. అధికారులు విభేదించారు. ఇలాచేస్తే... బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని పెద్దలు సులువుగా లాగేసుకుంటారని, దురాక్రమణలు పెరుగుతాయని తెలిపారు. చట్టం ఉద్దేశం నెరవేరదని పేర్కొన్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అసైన్డ్‌ భూముల చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. కానీ.. జగన్‌ సర్కారు దీనికి పూర్తి విరుద్ధంగా అడుగులు వేస్తోంది.

అసైన్డ్‌ భూములపై పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు వీలుగా అధ్యయనం చేయడానికి గత ఏడాది సెప్టెంబరు 30న కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్‌ రైతులకు హక్కులు ఎలా కల్పించాలి? దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి.. ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కానీ... ప్రజలందరికీ తెలియాల్సిన ఈ సమాచారాన్ని గుట్టుగా ఉంచింది. ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టేదాకా ఈ జీవోను బయటపెట్టనేలేదు. జీవోలో ఏం చెప్పినప్పటికీ... అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములను క్రమబద్ధీకరించడం, లేదా నేరుగా కొనుగోలు చేసిన వారికే పట్టాలు ఇవ్వడంపైనే ఈ కమిటీ దృష్టి సారించినట్లు తెలిసింది. ఇది దురాక్రమణదారులకు మేలు చేయడమే! పేదలను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి, వారి అవసరాలను ఆసరాగా తీసుకుని సొంతం చేసుకున్న అసైన్డ్‌ భూములు ‘చట్టబద్ధం’గా సొంతమైపోతాయి. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు కేటాయించిన భూములను విక్రయించడానికి వీల్లేదనే నిబంధనను కూడా మార్చేయాలని భా విస్తున్నారు. అసైన్‌ చేసిన 15-20 ఏళ్ల కాలపరిమితి దాటాక లబ్ధిదారులకు పూర్తిస్థాయి హక్కు లివ్వాలని ఈ కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్రకు చెందిన ఓ అధికార ప్రజాప్రతినిధి రాజకీయంతోపాటు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. 2004 నుంచి 2010 వరకు విశాఖలో మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములను రకరకాల పేర్లతో కొనుగోలు చేసి భూచక్రం తిప్పారు. విశాఖ భూములపై విచారణ జరిపిన సిట్‌ ఇచ్చిన నివేదికలో ఓ 50 పేజీలు ఆయన గురించే ఉంది. ఆయన నియంత్రణలోనే శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరంలోని భోగాపురం ఏరియాలో 600 ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయని సమాచారం. కర్నూలుకు చెందిన ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఏకంగా 198 ఎకరాల అసైన్డ్‌ భూమిని చేజిక్కించుకున్నారు.

‘పేదలకు సాగు భూమి ఇవ్వడమే కాదు! అది కలకాలం వారి చేతుల్లోనే ఉండాలన్నది అసైన్డ్‌ చట్టం ఉద్దేశ్యం. దాన్ని మారిస్తే భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోతాయి’’ అని టీడీపీ హయాంలో 2016 ఆగస్టులో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్లు, అధికారులు, నిపుణులు చెప్పారు. దీంతో చట్టాన్ని మార్చాలన్న ప్రతిపాదనను టీడీపీ సర్కారు వెనక్కి తీసుకుంది. అప్పుడే భూస్వాములు, పెత్తందారుల ఆశలకు గండిపడింది. ఇప్పుడు జగన్‌ సర్కారు అదే కలెక్టర్లను ముందుపెట్టి అసైన్డ్‌ చట్టం మార్చాలన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. ‘కలెక్టర్లు కోరుతున్నారు’ అంటూ భూములకు రెక్కలు తొడిగేందుకు సిద్ధమైంది.

Updated Date - 2023-02-06T13:09:46+05:30 IST