హమ్మయ్యా... సంజూ దొరికాడు!

ABN , First Publish Date - 2023-02-06T23:25:07+05:30 IST

ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన కుమారుడు ఏడదిన్నర తర్వాత చెంతకు చేరితే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అలాంటిదే కలువాయిలో జరిగింది.

హమ్మయ్యా...  సంజూ దొరికాడు!
తల్లిదండ్రులతో దండు సంజూ

కలువాయి, ఫిబ్రవరి 6 : ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన కుమారుడు ఏడదిన్నర తర్వాత చెంతకు చేరితే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అలాంటిదే కలువాయిలో జరిగింది. మండలంలోని ఉయ్యాలపల్లికి చెందిన దండు బుజ్జయ్య, వరలక్ష్మి దంపతుల కుమాడు సంజూ ఏడాదిన్నర క్రితం ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. కొడుకు ఆచూకీ కోసం ఎంత గాలించినా కానరాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా ఉయ్యాలపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతం అంతా జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు బాలుడు అదృశ్యం కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు కూడా బిడ్డపై ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా రాజంపేటలో ఉంటున్న మండలంలోని తోపుగుంటకు చెందిన ఓ గిరిజన మహిళకు ఇద్దరు పిల్లలు. ఇటీవల సంక్రాంతి పండుగకు తన అమ్మగారి ఊరు తోపుగుంటకు పిల్లలతో వచ్చింది. అయితే ఆమె వద్ద సంజూతో కలిసి ముగ్గురు పిల్లలు ఉండడంతో ఆ బాలుడు ఎవరని గ్రామస్థులు ప్రశ్నించారు. తమ సమీప బంధువు ఒకరు ఆ బాలుడిని అపహరించుకుని వచ్చి రాజంపేటలో విక్రయించేందుకు ప్రయత్నించాడని, తాను ప్రశ్నించడంతో రూ.200 తీసుకుని వెళ్లిపోయడని, అప్పటినుంచి తానే సాకుతున్నట్లు సదరు మహిళ చెప్పింది. ఈ క్రమంలో తోపుగుంటలో ఉన్న ఉయ్యాలపల్లికి చెందిన వారు ఆ బాలుడు సంజూగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో ఆ మహిళ తోపుగుంట నుంచి ఇటుకబట్టీలో పని చేసుకునేందుకు పిల్లలను తీసుకుని ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్లింది. విషయం తెలుసుకున్న సంజూ తల్లిదండ్రులు సోమవారం పామూరుకు వెళ్లి ఆ మహిళ వద్ద ఉన్న తమ కుమారుడిని తీసుకుని గ్రామానికి చేరుకున్నారు. దీంతో బాలుడి అదృశ్యం కథ సుఖాంతం అయ్యింది.

Updated Date - 2023-02-06T23:25:09+05:30 IST