Chicken: ‘చీ’కెన్! ఆ రెండూ వదలడం లేదు

ABN , First Publish Date - 2023-01-21T23:21:02+05:30 IST

మాంసపు ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. ఆదివారం అయితే ముక్క లేనిదే ముద్ద దిగని వారుండరు.

Chicken: ‘చీ’కెన్! ఆ రెండూ వదలడం లేదు
ఇటీవల హరనాథపురంలో పట్టుబడిన కులిపోయిన చికెన

చెన్నై, బెంగళూరు టు నెల్లూరుకు రవాణా

అక్కడ మిగిలిన చికెన్, గుండె, కందనకాయల దిగుమతి

కిలో రూ.30 కొని దుకాణదారులకు 80కి విక్రయం

నాలుగైదు రోజులు ఫ్రీజర్లలో నిల్వ

బ్యాక్టీరియాతో ఆరోగ్యానికే ముప్పు

కార్పొరేషన అధికారులు దాడులు చేస్తున్నా ఆగని రాకెట్‌

జరిమానాలతో చేతులు దులుపుకుంటున్న యంత్రాంగం

మాంసపు ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. ఆదివారం అయితే ముక్క లేనిదే ముద్ద దిగని వారుండరు. ఇంకొందరైతే వారంలో మూడు, నాలుగు రోజులు తప్పనిసరిగా మాంసాహారం ఉండాల్సిందే. ఈ బలహీనతనే అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అదెలాగంటారా!? సాధారణంగా మనం చికెన దుకాణాలకు వెళ్లి అర్ధ కిజీనో, కిలోనే చికెన్ కొనుగోలు చేస్తుంటాం. కానీ, దుకాణాల్లో ఇచ్చే మాంసం ఎప్పటిది!? స్వచ్ఛమైనదా!? అన్న విషయాలు పరిగణలోకి తీసుకోం. సరిగ్గా ఇక్కడే వ్యాపారులు అత్యాశకు పాల్పడుతున్నారు. చెన్నై, బెంగుళూరు నగరాల నుంచి కోడి గుండెకాయ, కందనకాయలతోపాటు అక్కడ మిగిలి పోయిన మాంసాన్ని నెల్లూరుకు దిగుమతి చేసుకుంటున్నారు. నాలుగైదు రోజులపాటు వాటిని ఫ్రీజర్లలో ఉంచి డిమాండ్‌ అధికంగా ఉన్న ఆదివారం రోజు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా రోజుల తరబడి నిల్వ చేసిన మాంసం తినడం వల్ల ఆరోగ్యానికి పెనుముప్పు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్రమ వ్యాపారులపై కార్పొరేషన అధికారులు నిత్యం దాడులు చేసి, మాంసాన్ని నిర్వీర్యం చేస్తున్నారేతప్ప కఠిన చర్యలు ఉండటం లేదు. దీంతో ఇంతోకొంత జరిమానా కట్టి తిరిగి తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు.

నెల్లూరు (సిటీ), జనవరి 21 : తమిళనాడులోని చెన్నై, కర్నాటకలోని బెంగుళూరు మహానగరాల్లో కోడి మాంసంలోని గుండె, కందనకాయ, పిల్లగుడ్లను అక్కడ ప్రజలెవరూ తినరు. దీనిని అదనుగా చేసుకున్న కొందరు వ్యాపారులు అక్కడ వీటిని కేజీ రూ. 30లకు కొనుగోలు చేసి నెల్లూరులోని చికెన్ దుకాణదారులకు రూ.80లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అంతేగాక అక్కడ మిగిలిపోయిన కోడి మాంసం కూడా సరఫరా అవుతోంది. ఇలా ప్రతి ఆదివారం చెన్నై, బెంగుళూరులలో వీటిని సేకరించి సోమవారం రాత్రికి నెల్లూరుకు తరలిస్తున్నారు. ఇక్కడ 5, 10, 15, 20 కిలోల చొప్పున ప్యాకెట్లుగా సిద్ధం చేసి శనివారం అర్ధరాత్రి వరకు ఫ్రీజర్లలో ఉంచుతారు. ఆ తర్వాత గోరువెచ్చిన నీళ్లలో ఈ మాంసపు ముద్దలను వేసి ముక్కలను వేరు చేసి, కూలింగ్‌ అనుమానం రానీయకుండా వేకువజామున నగరంలోని చికెన్ దుకాణాలకు తరలిస్తారు. ఇలా వారం రోజుల పాటు ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన చికెన్ బయట మార్కెట్లోని దుకాణాల్లో కోడి మాంసంలో కలిపేసి ప్రజలకు ఆ రోజు ధర ప్రకారం విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నారు.

1147752.jpg

ఇళ్ల మధ్యనే నిల్వలు

పొరుగు ప్రాంతాల నుంచి భారీగా తీసుకువచ్చిన కోడి అవయవాలను ఎవరికీ అనుమానం రానివ్వకుండా ఇళ్ల మధ్యలోనే నిల్వ ఉంచుతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో పట్టుకున్న చికెన అవయవాలన్నీ నివాసాల మధ్య ఉండే గోదాములే కావడం విశేషం. నగరానికి బయట, నివాసాలకు దూరంగా ఉండే గోదాముల్లో నిల్వ ఉంచితే అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతో అక్రమార్కులు ఇలా ఇళ్ల మధ్యనే ఎంచుకుంటున్నారు. ఇటీవల వెంకటేశ్వరపురం, హరనాథపురం 2వ వీధిలలో జరిగిన దాడుల్లోనే స్థానిక ప్రజలకు కుళ్లిన చికెన్ చూసి అవాక్కయ్యారు. కుళ్లిన చికెన్ నిల్వలను పట్టుకున్నప్పుడల్లా కార్పొరేషన్ అధికారులు జరిమానాలతో సరిపెడుతున్నారు. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కఠిన చర్యలు ఏవీ లేకపోవడంతో జరిమానా కట్టాక మళ్లీ అక్రమ రాయుళ్లు తమ పంథా కొనసాగిస్తున్నారు.

గుండె, కందనకాయలే ఎందుకు....?

మన రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వారితో పోల్చుకుంటే నెల్లూరీయులు ఆహారాన్ని ప్రీతిగా తింటారు. అందులోనూ మాంసపు ఆహారం మరింత ఎక్కువగా తినడం నెల్లూరు ప్రత్యేకత. చికెన్ దుకాణం వద్దకు వెళ్లిన ప్రతి వ్యక్తి అడిగే తొలి మాట గుండెకాయ, కందనకాయలు ఉంటే కాస్త ఎక్కువగా వేయండని. ఇదే కొందరు వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లో మరెక్కడా ఎక్కువగా తినని కోడి గుండె, కందనకాయలను ప్రత్యేకించి నెల్లూరులోనే తినడం చికెన్ రాకెట్‌కు దోహదపడుతోంది. ఈ రెండు అవయవాలపై ఉన్న ఇష్టం అది ఎలా ఉన్నా తినేయాలన్నంతగా దారి తీస్తుంది. కేవలం ఈ రెండు అవయవాలను అమ్ముకుని కొందరు రూ. కోట్ల వ్యాపారం చేస్తుండటం ఆశ్చర్యకరం.

పొంచి ఉన్న అనారోగ్య ముప్పు...

ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్‌లో ప్రమాదకర క్యాంపైలోబ్యాక్టర్‌, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చికెన్ తినడం వల్ల విషజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి, ఫుడ్‌పాయిజనకు గురైయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. పైగా ఇలాంటి మాంసంలో ఎలాంటి విటమిన్లు ఉండవు. శుభ్రత లేని ఫ్రీజర్లలో ఉంచడం వల్ల మరిన్ని వ్యాధులు కూడా చికెన్ ద్వారా సోకే ప్రమాదం ఉంది.

ప్రజల్లో అవగాహన పెరగాలి

- డీ హరిత, కమిషనర్‌, ఎన్ఎంసీ

బయట ఆహారం ద్వారా సంభవించే రోగాల పట్ల ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. పాడై, కుళ్లిన చికెన స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నాము. ప్రజలు కూడా ఇలాంటి సమాచారం ఎక్కడైన తటస్థపడితే మాకు తెలియచేస్తే వెంటనే స్వాధీనం చేసుకుంటాము.

గ్యాస్ట్రో ఎంటివెటీ్‌స్‌తో ప్రాణానికి ప్రమాదం

పాడైన చికెన తినడం వల్ల గ్యాసో్ట్ర ఎంటివెటీస్‌ సోకే ప్రమాదం ఉంది. దీనివల్ల డీ హైడ్రేషనకు గురై కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. తద్వారా ప్రాణానికి హాని వాటిల్లుతుంది. చలితో కూడిన జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి ఎక్కువగా వస్తాయి.

- డాక్టర్‌ కవిత కిరణ్‌, ప్రముఖ గైనకాలజిస్టు

బ్యాక్టీరియాతోనే ముప్పు

ఎక్కువ రోజులు చికెన నిల్వ ఉంచడం, అందులోనూ ఫ్రీజర్లలో ఉంచడం వల్ల క్యాంపైలోబ్యాక్టర్‌, సాల్మోనెల్లా బ్యాక్టీరియా సోకుతుంది. దీనిని తినడం వల్ల విరేచనాలు, డయేరియా, జ్వరం వస్తాయి, తీవ్రమైన తలనొప్పి, ఫుడ్‌పాయిజన కూడా జరుగుతుంది. పైగా ఇందులో ఎలాంటి విటమిన్లు ఉండవు.

డాక్టర్‌ జానా చైతన్యకిషోర్‌, ఏడీడీఎల్‌, ఏడీ

Updated Date - 2023-01-24T15:04:34+05:30 IST