ఆదాల ర్యాలీ అట్టర్‌ ఫ్లాప్‌!

ABN , First Publish Date - 2023-02-07T03:50:26+05:30 IST

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీని వీడినంత మాత్రాన నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక నేతల వరకు గంభీర ప్రకటనలు చేశారు.

ఆదాల ర్యాలీ అట్టర్‌ ఫ్లాప్‌!

నెల్లూరు రూరల్‌లో వైసీపీకి చుక్కెదురు

కొత్త ఇన్‌చార్జికి స్వాగతం పలుకుతూ ర్యాలీ

నగరమంతా భారీగా ఫ్లెక్సీలు.. కానీ జనం లేక నేతల్లో తీవ్ర నిరాశ

నెల్లూరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీని వీడినంత మాత్రాన నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక నేతల వరకు గంభీర ప్రకటనలు చేశారు. కొత్త ఇన్‌చార్జిగా నియమితులైన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి సోమవారం అట్టహాసంగా స్వాగత ర్యాలీ చేపట్టి తమ బలం చాటుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆశించినంత మంది జనం రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. పూర్వం నుంచి రూరల్‌ నియోజకవర్గంతో ఆదాలకు పరిచయాలు ఉండడం, ఆయన్ను ఇన్‌చార్జి చేస్తే వైసీపీ కేడర్‌ చెక్కుచెదరదని.. శ్రీధర్‌రెడ్డి వెంట వెళ్లే నాయకులనూ కట్టడి చేయవచ్చని పార్టీ పెద్దలు భావించారు. ఆదాలను ఒప్పించి ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టారు. ఈ బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి ఆయన సోమవారం సాయంత్రం నెల్లూరు వచ్చారు. ఆయనకు ఘనస్వాగతం పలికి తమ సత్తా చాటుకోవాలని వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నగరమంతా.. ప్రత్యేకించి రూరల్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆదాలకు భారీగా స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ట్రంకు రోడ్డు డివైడర్‌ పొడవునా (సుమారు 6 కి.మీ) అడుగడుగునా ఫ్లెక్సీలు కట్టారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి విక్రమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి సహా సీనియర్‌ నాయకులు ఆదాలకు స్వాగతం పలికి ఆయనతోపాటు వాహనంలో ర్యాలీగా ముందుకు సాగారు. ప్రజాస్పందన మాత్రం అంతంతగానే కనిపించింది. అయ్యప్పగుడి సెంటర్‌ నుంచి ఆదాల నివాసం వరకు ర్యాలీ సాగగా.. ప్రతి సెంటరు వద్ద ఆ డివిజన్‌ పరిధిలోని కార్పొరేటర్లు లేదా ముఖ్య నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. కానీ ర్యాలీలో ఆయనతో కలిసి సాగలేదు. జిల్లావ్యాప్తంగా ఉన్న నాయకులు తరలివచ్చినా, ర్యాలీ నడిచిన దారికి అటు వైపు నెల్లూరు సిటీ నియోజకవర్గం విస్తరించి ఉన్నా, జనం పెద్దగా హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. సిటీ నియోజకవర్గం నుంచి ఒకరిద్దరు కార్పొరేటర్లు మాత్రమే వచ్చారు. జనం హాజరు లేకపోవడం వెనుక సొంత పార్టీ నాయకుల కుట్రేమైనా ఉందా అన్న గుసగుసలు వైసీపీ నేతల్లో వినిపిస్తున్నాయి.

ట్రాఫిక్‌ కష్టాలతో అల్లాడిన జనం

జన స్పందనే లేని ర్యాలీ కోసం పోలీసులు ట్రంకురోడ్డుపై ట్రాఫిక్‌ మళ్లించారు. వచ్చేపోయే వాహనాలను ఒకేవైపు మళ్లించడంతో వాహనదారులు నరకం చవిచూశారు. సాయంత్రం 5.30 నుంచి 9 గంటల వరకు సుమారు 3.30 గంటలపాటు ఒకవైపు రోడ్డును పూర్తిగా బ్లాక్‌ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమవైపు అడుగు కదలడానికి కూడా వీల్లేనన్ని వాహనాలు.. అటువైపు చిన్న సమూహంతో తీరుబడిగా సాగుతున్న ర్యాలీని చూసి మండిపడ్డారు. జీవో 1 వైసీపీకి వర్తించదా అనే మాట ప్రతి ఒక్కరి నోటా వినిపించడం విశేషం.

Updated Date - 2023-02-07T03:50:27+05:30 IST