Minister Harishrao: సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత..

ABN , First Publish Date - 2023-02-06T10:47:32+05:30 IST

హైదరాబాద్: 2023-24 సంవత్సరానికి గాను సోమవారం ఉదయం శాసనసభ (Assembly)లో మంత్రి హరీష్‌రావు (Minister Harishrao) బడ్జెట్‌ (Budgetను ప్రవేశపెట్టనున్నారు.

Minister Harishrao: సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత..

హైదరాబాద్: 2023-24 సంవత్సరానికి గాను సోమవారం ఉదయం శాసనసభ (Assembly)లో మంత్రి హరీష్‌రావు (Minister Harishrao) బడ్జెట్‌ (Budgetను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాకున్నా.. సంక్షేమపథకాలు ఆగకూడదన్న సీఎం కేసీఆర్ (CM KCR) ఆలోచనతో బడ్జెట్ రూపొందించామని తెలిపారు. తెలంగాణ మోడల్‌ (Telangana Model)ను దేశం అవలంభిస్తోందన్నారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు.

పేద ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి రెండూ జోడెద్దుల్లా బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తోందన్నారు.

ఈసారి కూడా తమ బడ్జెట్‌లో సంక్షేమానికి, అభివృద్ధికి రెండింటికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ మోడలపై ఈరోజు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

కాగా ప్రజల్లో అసంతృప్తులను తొలగించేలా.. అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా 2023-24 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. వివిధ శాఖల నుంచి భారీగా ప్రతిపాదనలు రావడం కూడా ప్రభుత్వం ఇంత భారీ బడ్జెట్‌ను రూపొందించడానికి ఒక కారణంగా చెబుతున్నారు. సర్కారు రూపొందించిన ఈ బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం ఆమోదించింది. ప్రగతి భవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీలో దీనిపై చర్చ జరిగింది. శాఖలు, పథకాలవారీగా కేటాయింపులను మంత్రులకు వివరించారు. వారు ఇచ్చిన కొన్ని సూచనలు, సలహాల మేరకు బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. వారి సూచనల ఆధారంగా ఆర్థిక శాఖ కేటాయింపుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకురాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదేసమయంలో శాసన మండలిలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌పై 8న చర్చ జరుగుతుంది. మంత్రి హరీశ్‌రావు అదే రోజు వివరణ ఇస్తారు. కాగా.. కేంద్ర గ్రాంట్లు, పన్నుల్లో వాటా, రానున్న ఎన్నికలు, కొత్త పథకాలు, పాత పథకాలకు కేటాయింపులు, వాస్తవ రాబడులు, వ్యయాలు వంటి కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలియవచ్చింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఎవరికీ కాదనకుండా, లేదనకుండా, ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిష్ఠాత్మక పథకాలకు సరిపడా నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే, అన్ని శాఖలవారీగా ఇతోధిక కేటాయింపులు జరిపినట్లు సమాచారం.

Updated Date - 2023-02-06T10:47:36+05:30 IST