కాపులకు రిజర్వేషన్‌ కల్పించమనండి!

ABN , First Publish Date - 2023-02-07T04:05:51+05:30 IST

ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద కాపులకు గత ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ను అమలుచేసేలా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కాపులకు రిజర్వేషన్‌ కల్పించమనండి!

హైకోర్టులో హరిరామజోగయ్య వ్యాజ్యం

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద కాపులకు గత ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ను అమలుచేసేలా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కింద కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5శాతం కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలుచేసేలా ఆదేశించాలని కోరారు. అయితే, వ్యాజ్యంలో సీఎం జగన్‌ని ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యానికి నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో తగిన ఉత్తర్వుల కోసం సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు ముందు ఉంచారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ.. కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని వైసీపీ తన మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ జీవో తెచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేర్చామన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని న్యాయస్థానాలు ఆదేశించలేవని చెప్పారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా తొలగిస్తామన్నారు. దీంతో న్యాయమూర్తి పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకురానుంది.

Updated Date - 2023-02-07T04:05:52+05:30 IST