నేడు కొలనుభారతిలో వసంత పంచమి

ABN , First Publish Date - 2023-01-26T00:31:02+05:30 IST

కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధి చెందిన కొలనుభారతి క్షేత్రం వసంత పంచమి వేడుకలకు సిద్ధమైంది. రమణీయమైన ప్రకృతి సోయగాల నడుమ ఈ ఆలయం కొలువుదీరింది.

నేడు కొలనుభారతిలో వసంత పంచమి

శ్రీశైలం నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు

కొత్తపల్లి/ఆత్మకూరు, జనవరి 25: కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధి చెందిన కొలనుభారతి క్షేత్రం వసంత పంచమి వేడుకలకు సిద్ధమైంది. రమణీయమైన ప్రకృతి సోయగాల నడుమ ఈ ఆలయం కొలువుదీరింది. మాఘశుద్ద పంచమి, అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం కొలనుభారతి క్షేత్రంలో వేడుకలు నిర్వహించ నున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు సుమారు 25 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.

నేడు శ్రీశైల దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు

గురువారం తెల్లవారు ఝామున 5 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం అనంతరం శ్రీశైల క్షేత్రం తరఫున దేవస్థానం అధికారులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో మోహన్‌ తెలిపారు. భక్తుల కోసం కాశిరెడ్డి నాయన ఆశ్రమ కమిటీ, ఆర్యవైశ్య సత్ర నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అక్షరాభ్యాసం చేయించుకునే వారికి టికెట్‌ రూ.300, అభిషేకానికి రూ.250, అర్చన రూ.30, అక్షరాభ్యాసం కిట్లకు రూ.575 చెల్లించాల్సి ఉంటుందని ఈవో చెప్పారు. వసంత పంచమికి, అక్షరాభ్యాసాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు.

ఎలా చేరుకోవాలంటే...

జిల్లా కేంద్రమైన నంద్యాల నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి ప్రైవేట్‌ వాహనాలు లేదా ఆర్టీసీ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. శివపురం నుంచి శివపురం చెంచుగూడెం మీదుగా 5 కిలోమీటర్లు అటవీమార్గం గుండా ప్రయాణిస్తే.. కొలనుభారతి క్షేత్రానికి చేరుకోవచ్చు. వసంతపంచమి సందర్భంగా గురువారం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది.

Updated Date - 2023-01-26T00:31:02+05:30 IST