పేదలకు ఏదీ ఊరట

ABN , First Publish Date - 2023-02-02T00:23:31+05:30 IST

బడ్జెట్‌ విడుదలయ్యాక పేదలు ఆశగా ఆరా తీస్తారు. తమకు మేలు చేసే కేటాయింపులున్నాయేమో అని ఎదురు చూస్తారు.

   పేదలకు ఏదీ ఊరట

ఫ నిర్మలమ్మ పద్దులో వేతన జీవులకు కాస్త ఊరట

ఫ ఎరువులకు సబ్సిడీని తగ్గించిన బడ్జెట్‌

ఫ జిల్లా రైతాంగం పైన ప్రభావం

నంద్యాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌ విడుదలయ్యాక పేదలు ఆశగా ఆరా తీస్తారు. తమకు మేలు చేసే కేటాయింపులున్నాయేమో అని ఎదురు చూస్తారు. ఎప్పటిలాగే బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదల ఊసు కనిపించడం లేదు. ప్రత్యేకంగా జిల్లాలోని ఏ రంగానికి మేలు చేసే అంశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఉన్నంతలో వేతన జీవులకు, సీనియర్‌ సిటిజన్లకు కాస్త ఊరట దక్కింది. గతేడాదితో పోల్చుకుంటే ఎరువులపైన సబ్సిడీ తగ్గింది. దీని వల్ల జిల్లా రైతాంగంపైన భారం పడే అవకాశం ఉంది. రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల మూలధనం కేటాయించినా అందులో ఉమ్మడి జిల్లాకు ఎంత కేటాయించేదీ అనుమానమే అని పరిశీలకులు అంటున్నారు. వెరసి కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లా వాసులకు మేలు చేసే అంశాలు ప్రత్యేకంగా ఏవీ లేవనే అసంతృప్తి వినిపిస్తోంది.

ఫ శ్లాబుల్లో మార్పు..

ఉద్యోగుల్లో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారిని పన్ను పరిమితి నుంచి మినహాయించారు. దీంతో పాటు పన్ను శ్లాబుల్లో మార్పులు చేశారు. రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉన్నవారు 5శాతం పన్ను చెల్లించాలి. రూ.6 నుంచి రూ.9 లక్షలు ఆదాయం ఉన్నవారు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారు 15 శాతం చెల్లించాలి. అలాగే రూ.12-15 లక్షల ఆదాయం ఉన్నవారు 20 శాతం, రూ.15 లక్షలకు పైగా ఉన్నవారు 30 శాతం చెల్లించాలి. ఉద్యోగులతో పాటు సీనియర్‌ సిటిజన్లకు కూడా కేంద్రం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. వీరి ఖాతా పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. ఈ రెండు నిర్ణయాల వల్ల జిల్లాలోని ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్సకు కాస్త మేలు జరుగుతుంది.

ఫ జిల్లా రైతాంగానికి భారమే..!

బడ్జెట్‌లో నేరుగా రైతులకు మేలు చేసే అంశం ఏదీ లేకపోగా భారంగా మారే నిర్ణయాలే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిస్థితుల వల్ల గతేడాది ఎరువుల ధరలు పెరిగిపోయాయి. దీని ప్రభావం పడకుండా గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. మొదట రూ.1.05 లక్షల కోట్లు ఇవ్వగా పెరిగిన ధరలకు అనుగుణంగా తర్వాత రూ.2.25 లక్షల కోట్లకు పెంచింది. కానీ ఈ సంవత్సరం మాత్రం అలాంటి చర్యలు ఏమీ తీసుకున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుత బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.75 లక్షల కోట్లను కేటాయించింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 22 శాతం తక్కువ సబ్జిడీని ఎరువుల మీద ఇవ్వనుంది. దీని ప్రభావం జిల్లా రైతాంగం మీద తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌, కృత్రిమ కొరతతో అల్లాడుతున్న జిల్లా రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. చిరుధాన్యాలపై ప్రత్యేక ప్రోత్సాహకాలను కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచారు.

ఫ చెంచులకు మేలు..

రాబోయే మూడు సంవత్సరాలలో 740 ఏకలవ్య మోడల్‌ పాఠశాలలకు 38 వేల ఉపాధ్యాయులు, సిబ్బందిని కేటాయించనున్నట్లు నిర్మలా సీతారామన తెలిపారు. దీనివల్ల జిల్లాలోని చెంచుగూడేల్లోని ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశం ఉంది. దీని వల్ల గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాకు ఎంత కేటాయించేదీ స్పష్టత లేకపోయినా మిగతా వర్గాలతో పోల్చితే గిరిజనులకు ఇది కాస్త ఊరట కలిగిస్తుంది. ఇక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరిట నైపుణ్యాల శిక్షణ, కొత్తగా 157 నర్సింగ్‌ కళాశాలలను ప్రారంభిస్తామని చెప్పినా అవి ఆచరణకు వచ్చే సరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనే అనుమానం కూడా ఉంది.

ఇది ప్రజా, రైతు వ్యతిరేక బడ్జెట్‌ - సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజా, రైతు వ్యతిరేక బడ్జెట్‌. దేశ ప్రజలందరిని మోసం చేసే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏపీ విభజన హామీలను, ప్రత్యేక హోదా అంశాన్ని చర్చలో లేకుండా చేశారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు.

అమ్మకాల ప్రతిపాదన దుర్మార్గం : వి. ఏసురత్నం, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

రూ.61వేల కోట్ల మేర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలని బడ్జెట్‌లో ప్రతిపాదించడం దుర్మార్గం. కేంద్ర బడ్జెట్‌ కార్మికులకు, శ్రమజీవులకు, రైతులకు, ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని పోగొట్టడానికి, పెరుగుతున్న ధరలను తగ్గించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఈ బడ్జెట్‌ ఏ మాత్రం పనికి రాదు.

మోసపూరిత బడ్జెట్‌ : ఎస్‌.మస్తానవలి, ఆవాజ్‌ కమిటీ జిల్లా కార్యదర్శి

ఈ బడ్జెట్‌ దేశ ప్రజలందరిని మోసం చేసేలా ఉంది. దీని వల్ల రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కార్పొరేట్‌ సంస్థలకు మరింత ఊడిగం చేసే విధంగా ఉంది. ప్రజా సంక్షేమం ఈ బడ్జెట్‌ లక్ష్యం కాదు.

Updated Date - 2023-02-02T00:23:33+05:30 IST