ఇక సీమ ఎడారే..!

ABN , First Publish Date - 2023-02-06T23:59:02+05:30 IST

తుంగభద్ర జలాలపై కర్ణాటక కన్నేసింది. గుట్టుచప్పుడు కాకుండా 29.90 టీఎంసీలు వినియోగించుకునేలా టీబీపీ డ్యాం ఎగువన అప్పర్‌ భద్ర ఎత్తిపోతల పథకం చేపట్టింది.

   ఇక సీమ ఎడారే..!

తుంగభద్ర జలాలపై కర్ణాటక పెత్తనం

47.30 టీఎంసీలతో అప్పర్‌ భద్ర నిర్మాణం

రూ.5,300 కోట్లు కేటాయించిన కేంద్రం

ఇప్పటికే ఫేజ్‌-1 పనులు పూర్తి

కళ్లకు గంతలు కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, కేసీ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం

ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు జల గండం

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాలపై కర్ణాటక కన్నేసింది. గుట్టుచప్పుడు కాకుండా 29.90 టీఎంసీలు వినియోగించుకునేలా టీబీపీ డ్యాం ఎగువన అప్పర్‌ భద్ర ఎత్తిపోతల పథకం చేపట్టింది. ఫేజ్‌-1 పనులు కూడా పూర్తి చేసింది. తాజాగా ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తూ రూ.5,400 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), హెచ్చెల్సీ, కేసీ కాలువల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే సింగటలూరు సహా వివిధ ఎత్తిపోతల పథకాలు ద్వారా తుంగభద్ర డ్యాం ఫోర్‌షోర్‌లో ఇష్టారాజ్యంగా నీటిని వాడేసుకుంటోంది. ఏటా డ్యాంలో చేరే వరద జలాలు తగ్గిపోవడంతో ఏపీ నీటి వాటాకు భారీగా గండి పడుతోంది. తాజాగా సీమ కరువు రైతు మెడపై కర్ణాటక అప్పర్‌ భద్ర జలఖడ్గాన్ని పెట్టింది. అడ్డుకోకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది దీనిపై లోక్‌సభలో సీమ ఎంపీలు గళం వినిపించకపోగా జిల్లాకు చెందిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మగనూరు జయరాం, ఎమ్మెల్యేలు ఆ ఊసే ఎత్తకపోవడం విచారకరం.

కృష్ణా బేసినలో తుంగభద్ర ఉప నది. ఆంధ్ర, కర్ణాటక జల ప్రయోజనాల కోసం కర్ణాటక రాష్ట్రం హోస్పెట్‌ దగ్గర తుంగభద్ర నదిపై 1953లో 131.29 టీఎంసీల సామర్థ్యంతో టీబీపీ డ్యాం నిర్మించారు. జూన్‌ 1 నుంచి మే 31వ తేదీ వరకు ఒక నీటి సంవత్సరంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ 212 టీఎంసీలు నీటిని వినియోగించుకునేలా ఈ డ్యాంను రూపకల్పన చేశారు. కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యుడీటీ)-1 అవార్డు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ 73.01 టీఎంసీ, కర్ణాటక 138.99 టీఎంసీల నిఖర జలాలు కేటాయించింది. జలాశయంలో వరదను ప్రాజెక్టు వాటర్‌ రివ్యూ కమిటీ అంచనా వేసి కేడబ్ల్యూడీటీ అవార్డు దామాషా ప్రకారం నీటి పంపకాలు చేస్తుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. డ్యాంలో పూడిక చేరి సామర్థ్యం తగ్గడం, ఎగువన నిబంధనలు తంగలో తొక్కి కన్నడనాట ఇష్టారాజ్యంగా నీటిని వాడుకోవడం వల్ల ఇప్పటికే ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, కేసీ కాల్వలకు నీటి వాటా గణనీయంగా తగ్గుపోయింది. తద్వారా ఆయకట్టు బీడుగా మారుతోంది.

ఫ నోరెత్తని పాలక పెద్దలు:

తుంగభద్ర డ్యాం ఎగువన 1633 అడుగుల లెవెల్‌ ఫోర్‌షోర్‌ ఏరియాలో కర్ణాటక అధికారికంగా 42 మైనర్‌ ఇరిగేషన (ఎంఐ) ఎత్తిపోతల పథకాలు, మరో 20 అనధికారిక ఏర్పాటు చేసిన లిఫ్టుల ద్వారా దాదాపు 18-20 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకుంటోందని 2014-15 మధ్యలో టీబీపీ బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది. ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. 1631 అడుగుల లెవెల్‌లో టీబీపీ జలాశయానికి 80 కి.మీ దూరంలో మరో 18 టీఎంసీల సామర్థ్యంతో కొప్పల్‌ జిల్లా అమ్మిగనూరు సమీపంలో సింగటలూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-2) 18 టీఎంసీల నీటిని కేటాయించినా.. కోర్టులో ఉండడంతో ఇది అమల్లోకి రాలేదు. అయినా కర్ణాటక యథేచ్ఛగా సింగటలూరు లిఫ్ట్‌ పూర్తి చేసింది. తాజాగా మధ్య కర్ణాటకలోని చిత్రదుర్గ, చిక్కమంగళూరు, దావణగేరి, తుమకూరు జిల్లాల్లో 2.25 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా రూ.21,473 కోట్లతో ఫేజ్‌-1 కింద కృష్ణా బేసినలో తుంగభద్ర సబ్‌ బేసినలోని తుంగ నుంచి భద్రకు 17.40 టీఎంసీలు, ఫేజ్‌-2 కింద భద్ర నది నుంచి 29.90 టీఎంసీలు ఎత్తిపోసేలా ఎగువ భద్ర ఎత్తిపోతల పథకం కర్ణాటక చేపట్టింది. ఫేజ్‌-1 కింద చేపట్టిన ప్యాకేజీ-1,2,3 పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఫేజ్‌-2 చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అప్పర్‌ భద్ర లిఫ్టునకు 2020 డిసెంబరు 16న కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు నంబరు. డబ్ల్యూఆర్‌డీ 166 వీబీవైఈ 2020 (పీ-1) కింద పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని ఉండాల్సింది. ఏపీ పాలకులు గాంధారి పాత్ర పోషించడం వల్ల కర్ణాటక ప్రభుత్వం చకచకా పనులు పూర్తి చేసింది. తాజాగా కన్నడనాట త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్పర్‌ భద్రకు జాతీయ హోదా కల్పిస్తూ 2023-24 బడ్జెట్‌లో రూ.5,400 కోట్లు కేటాయించింది. ఆ సమయంలో లోక్‌సభలోనే ఉన్నా రాయలసీమ ఎంపీలు ఒక్కరు కూడా గళం విప్పకపోవడం చూస్తే సీమ రైతులపై వైసీపీ పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో తెలుస్తోంది.

ఫ టీబీపీ డ్యాం నుంచి నీటి వాటాలు ఇలా:

ఫ తుంగభద్ర జలాశయం నుంచి ఒక నీటి సంవత్సరంలో 212 టీఎంసీలు వినియోగించుకునేలా డిజైన చేశారు. కేడబ్ల్యూడీటీ-1 అవార్డు ప్రకారం కర్ణాటక 138.99 టీఎంసీలు, ఉమ్మడి ఏపీ 73.01 టీఎంసీలు కేటాయించారు. అయితే.. 25 ఏళ్లుకు పైగా డ్యాంలో చేరే వరదను పరిశీలిస్తే సగటున 155-165 టీఎంసీలకు మించి చేరడంతో లేదు. అంటే.. కేడబ్ల్యూడీటీ దామాషా ఏటా 16-18 టీఎంసీలు ఏపీ కోటా కింద రాయలసీమ జిల్లాలు నష్టపోవాల్సి వస్తోంది.

ఫ కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ద్వారా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు సహా 195 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలి. కేడబ్ల్యూడీటీ-1 అవార్డు ప్రకారం టీబీపీ డ్యాం నుంచి 24 టీఎంసీల నీటి వాటా ఉంది. డ్యాంలో చేరే వరద లెక్కలు ఆధారంగా 16-18 టీఎంసీలకు మించి కేటాయించడం లేదు. అంటే.. ఏటా 6-8 టీఎంసీలు నష్టపోతున్నాం. అంతేకాదు.. ఎగువన ఎల్లెల్సీ జలచౌర్యం వల్ల మరో 2-3 టీఎంసీలు వదులుకోవాల్సి వస్తోంది.

ఫ అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో హెచ్చెల్సీ కింద 2.94 లక్షల ఆయకట్టు ఉంది. టీబీపీ డ్యాం నుంచి 32.5 టీఎంసీల నీటి వాటా ఉంటే.. ఏటా 23-25 టీఎంసీలకు మించి కేటాయించడం లేదు. 8-10 టీఎంసీలు నష్టపోతున్నాం. ఏటేటా 95-1.25 లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందని దైన్య పరిస్థితి.

ఫ కేసీ కాలువకు కేడబ్ల్యూడీటీ-1 అవార్డు ప్రకారం 39.5 టీఎంసీలు నీటి వాటా ఉంది. పది టీఎంసీలు తుంగభద్ర డ్యాం నుంచి తీసుకోవాల్సి ఉంది. డ్యాంలో చేరు వరద లెక్కలు ప్రకారం 6-8 టీఎంసీలకు మించి కేటాయించడం లేదు. తెలంగాణలోని ఆర్డీఎస్‌ ఎడమ కాలువకు 6.51 టీఎంసీలు నీటివాటా ఉంటే.. 4-5 టీఎంసీలకు మించి నీటి వాటా రావడం లేదు.

ఫ సీమ రైతులకు కన్నీళ్లు తప్పవా!:

తుంగభద్ర డ్యాం 212 టీఎంసీలు వినియోగించుకునేలా డిజైన చేశారు. ఇప్పటికే డ్యాం ఎగువన అధికార, అనధికారిక లిఫ్టులు, సింగటలూరు లిఫ్టు ద్వారా 36 టీఎంసీలు కర్ణాటక వాడుకుంటుంది. మరో 47.3 టీఎంసీలు రెండు దశల్లో వాడుకునేలా అప్పర్‌ భద్ర లిఫ్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అంటే 83.30 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. ఇదికాదని మరో పూడిక బూచి చూపి మరో 30 టీఎంసీలు సామర్థ్యంతో రాయచూరు జిల్లాలో నవలి జలాశయం నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇది కడితే 113.3 టీఎంసీలు వినియోగంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే టీబీపీ డ్యాంలో చేరే వరద ఏటా తగ్గుతోంది. తుంగభద్ర ఎగువన కర్ణాటక ఎడాపెడా ప్రాజెక్టులు నిర్మిస్తూ పోతుంటే డ్యాం చేరే వరద మరింతా తగ్గిపోతుంది. అదే జరిగితే రాయలసీమ ప్రాజెక్టుకు జల గండం తప్పదు.

ఫ ఓ వైపు ఆర్డీఎస్‌ను అడ్డుకుంటూ.. మరో వైపు నిర్మాణాలు:

కరువు, వలసలతో నిత్యం సమరం చేసే కందెనవోలు పల్లెసీమల్లో కన్నీటి కష్టాలు తీర్చాలనే లక్ష్యంగా గత చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రూ.2 వేల కోట్లతో ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-2) ఈ ప్రాజెక్టుకు నాలుగు టీఎంసీలు కేటాయించారు. అయితే.. ఆర్డీఎస్‌ కుడి కాలువపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు నిబంధనలు తుంగలో కలిపేస్తూ ఎగువ రాష్ట్రం కర్ణాటక మాత్రం ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అయినా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నోరుమెదపడం లేదు. కరువు, వలసల నివారణపై వైసీపీ పాల చిత్తశుద్ధి ఇదేనా అని కరువు పీడిత రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఫ తుంగభద్ర జలాశయం పరిధిలోని కాల్వలకు కేడబ్ల్యూడీటీ-1 నీటి కేటాయింపులు (టీఎంసీల్లో):

--------------------------------------------------------------------------

కాలువలు కర్ణాటక ఆంధ్ర మొత్తం

---------------------------------------------------------------------------

రైట్‌ బ్యాంక్‌ ఎల్లెల్సీ 19.00 24.00 43.00

ఆర్‌బీ హెచ్చెల్సీ 17.50 32.50 50.00

ఎల్‌బీ ఎల్‌ఎల్‌ఎంసీ 93.00 -- 93.00

రాయబసవ 7.00 -- 7.00

విజయనగర ఛానల్‌ 2.00 -- 2.00

కేసీ కాలువ -- 10.00 10.00

ఆర్‌డీఎస్‌ (తెలంగాణ) 0.49 6.51 7.00

------------------------------------------------------------------

మొత్తం 138.99 73.01 212.00

-------------------------------------------------------------------

Updated Date - 2023-02-06T23:59:04+05:30 IST