ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ABN , First Publish Date - 2023-02-01T23:27:47+05:30 IST

కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామ పంచాయతీ కార్యదర్శి మొలగవల్లి మల్లయ్యను బుధవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

   ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
ఏసీబీ దాడుల్లో మొలగవల్లి మల్లయ్య

ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోసం లంచం డిమాండ్‌

మధ్యవర్తి ద్వారా డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

ఆదోని రూరల్‌, ఫిబ్రవరి 1: కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామ పంచాయతీ కార్యదర్శి మొలగవల్లి మల్లయ్యను బుధవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి, బాధితుడు చిన్నపెండేకల్లు గురురాజారెడ్డి వివరాల మేరకు.. మదిరె పంచాయతీ కార్యదర్శిగా ఉన్న మొలగవల్లి మల్లయ్య చిన్నపెండేకల్లు, పెద్దతుంబళం గ్రామాలకు ఇనచార్జిగా వ్యవహరిస్తున్నాడు. చిన్నపెండేకల్లుకు చెందిన మాజీ సర్పంచు గురురాజారెడ్డి గ్రామంలో తనకున ్న మూడు సెంట్ల స్థలాన్ని ఏడాది క్రితం సోమేశ్వరమ్మకు విక్రయించి ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే సోమేశ్వరమ్మకు అమ్మిన మూడు సెంట్ల స్థలాన్ని రిజిష్టర్‌ చేయించే క్రమంలో సబ్‌ రిజిస్ర్టార్‌ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ తీసుకు రావాలని చెప్పాడు. దీంతో ఆ సర్టిఫికెట్‌ కోసం గురురాజారెడ్డి పంచాయతీ కార్యదర్శి మల్లయ్యను గత నెల 28న కలిశారు. దీంతో సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే రూ.7వేలు లంచం కావాలని మల్లయ్య డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేని గురురాజారెడ్డి చెప్పగా చివరకు రూ.4 వేలకు ఒప్పందం జరిగింది. ఆ డబ్బులు కూడా ఇచ్చుకోలేని గురురాజారెడ్డి మరుసటి రోజు కర్నూలుకు వెళ్లి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇందులో భాగంగానే బుధవారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఆదోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏసీబీ అధికారులు మాటు వేసి వారి వద్ద ఉన్న డబ్బును గురురాజారెడ్డికి ఇచ్చి పంపించారు. మధ్య వర్తి షఫీ ఆ డబ్బును గురురాజారెడ్డి వద్ద తీసుకొని మల్లయ్య వద్దకు వెళ్లాడు. వెను వెంటనే ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి మల్లయ్యను, షఫీని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అధికారులు ఇతర బాధితులతో మాట్లాడడంతోపాటు ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలను ఫైళ్లను పరిశీలించారు. మల్లయ్యది సొంత ఊరు ఆలూరు మండలం మొలగవల్లి గ్రామం కాగా అనంతపురం జిల్లా గుంతకల్లులో ఉంటున్నాడు. దీంతో అధికారులు గుంతకల్లుకు వెళ్లి సోదాలు చేపట్టారు.

ఎవరీ షఫీ ... పెద్దతుంబళం గ్రామానికి చెందిన షఫీ కొన్నేళ్లుగా ఆ గ్రామ పంచాయతీలో అన్ని పనులు తానై చూస్తూ వస్తున్నాడు. అందరికీ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటారని, అందులో భాగంగానే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మల్లయ్య పెట్టుకున్న ప్రైవేట్‌ వ్యక్తి షఫీ అని, ఇతనికి నెలకు రూ.10వేల వరకు జీతం మల్లయ్య చెల్లిస్తున్నాడని తెలిపారు.

Updated Date - 2023-02-01T23:27:48+05:30 IST