పైరు లేదు.. పనుల్లేవు..!

ABN , First Publish Date - 2023-01-25T00:23:42+05:30 IST

పశ్చిమ పల్లెసీమలు వలసబాట పట్టాయి.

పైరు లేదు.. పనుల్లేవు..!

వలసలు ఆపే ప్రాజెక్టుల ఊసే లేదు

వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువను పట్టించుకోని ప్రభుత్వం

గురురాఘవేంద్ర లిఫ్టుల నిర్వహణకు నిధులు ఇవ్వని దైన్యం

తుంగభద్రలో పుష్కలంగా వరద ఉన్నా.. వృథా అవుతున్న వైనం

ఆ నీటిని ఎత్తిపోస్తే కొంతైనా వలసలు ఆపే అవకాశం

(ఆంధ్రజ్యోతి - కర్నూలు)

పశ్చిమ పల్లెసీమలు వలసబాట పట్టాయి. చేలో పైరు లేదు.. ఊళ్లో పనుల్లేవు.. పస్తులతో ఉండలేక ఉపాధి వెతుక్కుంటూ కన్నతల్లిలాంటి పల్లెను వీడి వలస బాటన సాగిపోతున్నారు. అతివృష్టి లేదా అనావృష్టితో మట్టి మనుషులు చితికిపోతున్నారు. కరువును పారదోలి వలసలను నివారించాలన్న ఆశయంతో చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రూ.4 వేల కోట్లతో ఆర్డీఎస్‌ కుడి కాలువ, వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. జగన్‌ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆ ప్రాజెక్టులు పడకేశాయి. నిర్వహణ నిధులు ఇవ్వకపోవడం కారణంగా గురురాఘవేంద్ర ఎత్తిపోల పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. నిర్వహణకు నిధులు ఇచ్చి ఉంటే కొన్ని గ్రామాల్లోనైనా వలసలు తగ్గేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో పశ్చిమ గ్రామాల రైతులు, వ్యవసాయ కూలీలను ఏటా కరువు, వలస కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాధార పంటలే ఆధారం కావడంతో సంక్రాంతి అయిపోగానే పిల్లాజెల్లతో రైతులు పని వెతుక్కుంటూ వలస బాటన తరలిపోతున్నారు. పశ్చిమ పల్లెల్లో ఏటా వలసలు సర్వసాధారణమే. రెండు మూడేళ్ల కిందటి వరకు వ్యవసాయ కూలీలు, ఎకరా, రెండెకరాలు ఉన్న సన్న చిన్నకారు రైతులే వలస వెళ్లేవారు. మళ్లీ ఖరీఫ్‌ సీజన్‌ రాగానే తిరిగి ఊళ్లకు వచ్చేవారు. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. తెల్లబంగారం అని పత్తిని నమ్ముకున్న రైతులు నాసిరకం విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు క్వింటం కూడా రాలేదని గుంటూరుకు చెందిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ లాంఫాం శాస్త్రవేత్తలే నిగ్గుతేల్చారు. ఎర్ర బంగారమైన మిరప కూడా నిలువునా ముంచింది. ఫలితంగా అప్పులు తీర్చాలని, రాబోయే ఖరీఫ్‌ పెట్టుబడి అవసరాల కోసం ఐదెకరాల పైబడిన రైతులు కూడా వలస బాట పట్టారు. ఈ వలసలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్‌ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టు నిర్మాణాలు అటకెక్కాయి. వీటిని పూర్తి చేస్తే వలస కష్టాలు కొంతైనా తీరుతాయని సాగునీటి నిపుణులు అంటున్నారు.

వేద‘వ్యథ’

ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగు నీరు, 196 గ్రామాలకు తాగు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం వేదవతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణానికి 2019 జవనరిలో రూ.1,942.38 కోట్లు మంజూరు చేస్తూ జీవో నెం.77 జారీ చేసింది. ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ సంస్థ పనులు చేపట్టింది. ప్రెజర్‌ మెయిన్‌ పైపులైన్‌-1, ప్రెజర్‌ మెయిన్‌ పైపులైన్‌-3 పనులు, హంద్రీనీవా కాలువ ఒడ్డున ప్రధాన లిఫ్టు పనులు చేపట్టి రూ.90 కోట్లు ఖర్చు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఎక్కడి పనులు అక్కడే అసంపూర్తిగా ఆగిపోయాయి. ఇటీవల బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్‌వో) ఇచ్చినా ఆర్థిక శాఖ నుంచి ఫండ్‌ క్లియరెన్స్‌ లేకపోవడంతో నిధులు మంజూరు కాలేదని ఇంజనీర్లు అంటున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే రెండు నియోజకవర్గాల్లో వలసలు కొంతైనా ఆపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓట్ల వేటలో తాత్కాలిక పథకాల పేరుతో శాశ్వత ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. అంతేకాదు.. తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా ఆలూరు ప్రాంతానికి రావాల్సిన పూర్తి వాటా జలాలు కూడా అందడం లేదు.

అసంపూర్తిగా ఆర్డీఎస్‌ కుడి కాలువ

మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోనే అత్యధికంగా వలసలు ఉన్నాయి. శాశ్వత పరిష్కారం కోసం గత టీడీపీ ప్రభుత్వం ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. 2019 జనవరిలో జీవో ఆర్టీ నం.76 జారీ చేసి రూ.1,985.42 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాదుకు చెందిన ఎస్‌సీసీ లిమిటెడ్‌ సంస్థ పనులు దక్కించుకుంది. ఆర్డీఎస్‌ అనకట్ట వద్ద హెడ్‌ వర్క్‌ పనులు, కాలువ నిర్మాణం పనులను మొదలు పెట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. ఫలితంగా వలస నివారణ లక్ష్యం తుంగపాలు అవుతోంది. నిర్మాణాలు మొదలు పెట్టి ఉంటే స్థానికంగా కొంతమందికైనా ఉపాధి దొరికేది. అలాగే వచ్చే రెండేళ్లలో కాలువ, జలాశయాలు నిర్మాణం పూర్తి చేస్తే ఊళ్లోనే రెండు పంటలకు పుష్కలంగా సాగు నీరు అందుతుంది. తద్వారా వలసలు నివారించవచ్చని రైతులు పేర్కొంటున్నారు.

గుండె చెరువు..

మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) చివరి ఆయకట్టు 45,790 ఎకరాలకు తుంగభద్ర జలాలు అందించే లక్ష్యంతో 2003లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం గురురాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టింది. 3.786 టీఎంసీలు ఎత్తిపోసుకోవాలి. నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. 2003 ఆగస్టు 22న జీవో ఎంఎస్‌ నెం.132 జారీ చేసి రూ.177 కోట్లు మంజూరు చేశారు. 2005 మార్చి 23న ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్యాకేజీ-97 కింద దుద్ది, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. జీవో ఎంఎస్‌ నెం.52 జారీ చేసి రూ.65.21 కోట్లు మంజూరు మంజూరు చేశారు. పనులు పూర్తయినా జగన్‌ ప్రభుత్వం మూడున్నరేళ్లుగా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) నిధులు ఇవ్వడం లేదు. రూ.15 కోట్లు ఇవ్వండని గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దైన్య పరిస్థితి. దీంతో ఈ ఏడాది 990 టీఎంసీల తుంగభధ్ర జలాలు వృథాగా సముద్రం పాలైనా కరువు నేల తడిపేందుకు ఒక్క టీఎంసీ కూడా లిఫ్టు చేయలేదు. నిధులు లేక లిఫ్టుల మరమ్మతులు, నిర్వహణ లేకపోవడమే ప్రధాన కారణం. తుంగభద్ర జలాలు ఎత్తిపోసి మెట్ట పొలాలకు సాగు నీరిచ్చి ఉంటే పచ్చని పంటలతో కళకళలాడేవి. రైతులు, కూలీలకు చేతినిండా పనులు ఉండేవి. తద్వారా వలసలు కొంతైనా తగ్గేవి. వలసల తీవ్రత అధికంగా ఉన్న మంత్రాలయం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డిలు సీఎం జగన్‌పై ఒత్తిడి తెచ్చి జీఆర్‌పీ లిఫ్టులు మరమ్మతులు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారనే ఆరోపణలు ఉన్నాయి.

వలస బాట

మద్దికెర: ఉపాధి పనులు లేక... ఉన్నా సకాలంలో కూలి అందక గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. మంగళవారం మద్దికెర బెస్త వీధిలో 20 కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ ఉపాధి పనులు కల్పించడం లేదని, పనులు ఉన్నా వేతనాలు ఇవ్వడం లేదని, అందుకే వలస వెళ్లక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పిల్లాపాపలతో ఇళ్లకు తాళాలు వేసి బయల్దేరగా.. మరి కొంత మంది వృద్ధులను ఇళ్ల దగ్గర వదిలేసి బయల్దేరారు. ఉపాధి పనులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉపాధి పనులను కల్పించకపోతే మరో 10 రోజుల్లో జాతరను ముగించుకుని పెద్దఎత్తున వలసలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై ఏపీవో రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ అడిగిన వారందరికీ ఉపాధి పనులను కల్పిస్తామని... ఎవరూ వలస వెళ్లనవసరం లేదని అన్నారు.

Updated Date - 2023-01-25T00:23:44+05:30 IST