మనోడే.. వదిలెయ్‌

ABN , First Publish Date - 2023-01-25T00:18:06+05:30 IST

మనోడే.. వదిలెయ్‌

మనోడే.. వదిలెయ్‌

బెల్టు షాపు నిర్వాహకులకు వైసీపీ నాయకుల వత్తాసు

ఊరూరా భారీ వ్యాపారం

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

పట్టించుకోని అధికారులు

నంద్యాల, ఆంధ్రజ్యోతి

బెల్టు షాపుల వ్యాపారం జోరుగా సాగుతోంది. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ పాలనలో బెల్టు షాపులు ఊరూరా వెలిశాయి. విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా అధికారులు బెల్టు షాపుల వ్యాపారులను అదుపులోకి తీసుకుంటే అధికార పార్టీ నాయకుల నుంచి హుకుం వస్తోంది. మనోడే.. వదిలెయ్‌.. అని. మెజారిటీగా బెల్టు షాపుల వ్యాపారంలో వైసీపీ నాయకుల అనుచరులే ఉన్నారని సమాచారం. నాయకులే వదిలెయ్యమని చెబితే అధికారులు ఇంక ఏమంటారు? పైగా సిబ్బంది కూడా నిర్వాహకులతో కుమ్మక్కయ్యారనే విమర్శలు ఉన్నాయి.

‘అధికారంలోనికి వస్తే మద్య నిషేధం అమలు చేస్తాం’ అని ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మాటను సీఎం అయ్యాక జగన్‌ మర్చిపోయారు. మద్య నిషేధం స్ఫూర్తికి భిన్నంగా బెల్టు షాపులు, పర్మిట్‌ రూములు తొలగించడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని నిన్న కాక మొన్న సీఎం అన్నారు. మద్యాన్ని నిషేధించపోగా బెల్టు షాపులు తొలగించడంతో మద్యం అమ్మకాలు తగ్గాయని ప్రభుత్వం నిస్సిగ్గుగా బాధపడుతోంది. వాస్తవానికి జిల్లాలోని ఏ గ్రామాన్ని పరిశీలించినా అధికార పార్టీ నాయకుల అండదండలతో బెల్టు షాపులు విచ్చలవిడిగా కొనసాగు తున్నాయి. బెల్టు షాపుల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఈ షాపుల వైపు కన్నెత్తె చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడైనా అఽధికారులు బెల్టు షాపు నిర్వాహకులను అదుపులోకి తీసుకుంటే వైసీపీ నాయకుల నుంచి ఫోన్‌ వస్తుంది. విచ్చలవిడిగా అక్రమంగా మద్యం వ్యాపారం జరుగుతోంది. ఇది చాలు.. మద్య నిషేధంపై ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుసుకోడానికి.

అధికార పార్టీ కార్యకర్తలకు బెల్టు షాపులు ఆదాయ వనరు. ప్రతి మండలంలో సుమారు 10కి పైగానే బెల్టు షాపులున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లోని కూడళ్లలో కూల్‌డ్రింక్‌ షాపు, కిరాణా షాపులను బెల్టు షాపుగా మారుస్తున్నారు. ఒక క్వార్టర్‌ బాటిల్‌ను ఎమ్మార్పీ ధర మీద రూ.10 నుంచి రూ.20 అదనంగా తీసుకుంటూ మద్యాన్ని అమ్ముతున్నారు. వైన్‌ షాపులు తెరిచి ఉన్నపుడు మాత్రమే ఈ రేటు. షాపులు మూసిన తర్వాత ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌ పైన రూ. 40 అదనంగా బెల్టు షాపు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఇక్కడ మద్యం విక్రయాలు జరుపుతుంటారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా ఎనీ టైమ్‌ మందు అనే పరిస్థితి బెల్టు షాపులు వద్ద కనిపిస్తోందన్న విమర్శలున్నాయి.

వారిదే కీలక పాత్ర..

సాధారణంగా మద్యం ప్రియులు ఆల్కహాల్‌ సేవించాలంటే ఒక బాటిల్‌ లేదా స్నేహితులతో కూర్చుని తాగే వారు అయితే ఒక ఫుల్‌ బాటిల్‌ మద్యాన్ని తీసుకుపోతుంటారు. ఇలా తీసుకుపోయేవారిని పెద్దగా అనుమానించాల్సిన పనిలేదు. అయితే బెల్టు షాపులు నిర్వహించాలంటే ప్రతి బ్రాండ్‌ కనీసం పది క్వార్టర్‌ బాటిళ్లు తీసుకోవాలి. నాలుగు బ్రాండ్ల చొప్పున 40 క్వార్టర్‌ బాటిళ్లు.. తక్కువలో తక్కువగా ఓ ఇరవై బాటిళ్లు అయినా తీసుకోవాలి. ఈ స్థాయిలో బెల్టు షాపులకు మందు ఎక్కడి నుంచి వస్తోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణను చూసుకునే సూపర్‌వైజర్ల చొరవతోనే బెల్టు షాపులకు మద్యం అందుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపర్‌వైజర్లు తమ పరిధిలోని బెల్టు షాపుల వారితో కుమ్మక్కై ప్రభుత్వ మద్యం దుకాణాలకు మందు బాటిళ్లు రాగానే ఫలానా బెల్టు షాపుకు ఇంత అని మద్యం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలానా రోజు ఎంత అమ్ముడు పోయిందన్న లెక్కలు తప్పితే, ఎవరికి అమ్మారన్న వివరాలు ఉండవు. కాబట్టి మద్యం షాపుల సూపర్‌ వైజర్ల ఆటలు కొనసాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

మనవాడే..

బెల్టు షాపుల నిర్వహణ అంతా బహిరంగ రహస్యమే! ఏ గ్రామంలో ఎక్కడ బెల్టు షాపు ఉన్నదీ, ఎవరు అమ్ముతున్నదీ అధికారులకు తెలుసు. బెల్టు షాపుల నిర్వాహకులు అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువ ఉండటంతో సంబంధిత అధికారులు మిన్నకుండిపోతున్నారు. కొన్నిసారు అధికారులు బెల్టు షాపుల నిర్వాహకులను పట్టుకునేందుకు ప్రయత్నించినా ‘ఏయ్‌ మనోడే.. వదిలెయ్‌!’ అంటూ అధికార పార్టీ నాయకుల నుంచి ఫోన్లు వస్తుండటంతో ఏమీ చేయలేక వదిలేస్తున్నారు. ఇక క్షేత్రస్థాయి సిబ్బందికి మామూళ్లు కూడా అందుతుండటంతో బెల్టు షాపుల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎక్సైజ్‌ అధికారులన్నా, సెబ్‌ అధికారులన్నా బెల్టు షాపుల నిర్వాహకులకు భయం లేకుండా పోతోంది. మద్యాన్ని సహించలేని వారు ఎవరైనా ఇదేంటని? బెల్టు షాపుల వారిని ప్రశ్నిస్తే తమకు ‘ఫలానా’ వారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఏం చేసుకుంటారో చేసుకోండని ధీమాగా సమాధానమిస్తున్నారు. అధికారులు అధికార పార్టీ నాయకులకు మాటలకు తలొగ్గి అధికారులు పట్టించుకోకపోవడమేమిటన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పక్క రాష్ట్రం మద్యం కూడా..

మొదట్లో మద్య నిషేధం అంటూ వైసీపీ ప్రభుత్వ ఆరాటం చేసింది. అ సమయంలో పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక నుంచి మద్యం ఎక్కువగా అక్రమ మార్గాల్లో వచ్చేది. ఆ తర్వాత ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచింది. ఫలానా బ్రాండ్లు దొరుకుతాయని మద్యం దుకాణాల బయట బోర్డులు కూడా పెట్టింది. అయితే లోకల్‌ బ్రాండ్లు తాగడం ఇష్టం లేని మద్యం ప్రియులు చాలామంది పక్క రాష్ట్రాల మద్యం వైపే చూస్తున్నారు. ఇదే అదనుగా నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లి వంటి మండలాల్లోని బెల్టు షాపుల నిర్వాహకులు తెలంగాణ నుంచి ఇక్కడ దొరకని వివిధ రకాల బ్రాండ్లను తెప్పించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఇదేం తీరు..

నిర్ణీత సమయాల్లో అమ్మడం ద్వారా మద్యం విక్రయాలను తగ్గించవచ్చన్నది ప్రభుత్వ అభిప్రాయం. అందుకు అనుగుణంగా మద్యం దుకాణాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. అయితే ఈ మధ్య దుకాణం సమయాలను అనధికారికంగా పెంచినట్లు తెలుస్తోంది. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. దీంతో మద్యం ప్రియులు తెల్లారగానే మద్యం దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. ఇక కొన్ని మద్యం షాపుల ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని వాటర్‌ ప్యాకెట్లు, తినుబండారాలు అమ్మేవారు టేబుళ్లు ఏర్పాటు చేసి పర్మిట్‌ రూముల్లాగా మార్చేస్తున్నారు. దీంతో మందు బాబులు అక్కడే మద్యం తాగి వచ్చిపోయేవారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విజిలెన్స్‌ అధికారులు తమకు తెలియజేస్తే కేసు పెడతాం తప్పితే, తమకు సొంతంగా ప్రభుత్వ మద్యం దుకాణాల వద్దకు వెళ్లి దాడులు చేసి కేసులు పెట్టే అధికారం లేదని సమాధానమిస్తున్నారు.

Updated Date - 2023-01-25T00:18:19+05:30 IST