ప్రత్యేక హోదా ఊసే ఎత్తని సీఎం జగన్‌

ABN , First Publish Date - 2023-01-26T00:26:01+05:30 IST

ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ అనంతరం వాటి ఊసే ఎత్తడం లేదని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజినేయులు ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా ఊసే ఎత్తని సీఎం జగన్‌

ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌

డోన్‌, కర్నూలులో కొనసాగిన సమరయాత్ర

డోన్‌(రూరల్‌), జనవరి 25: ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ అనంతరం వాటి ఊసే ఎత్తడం లేదని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజినేయులు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ చేపట్టిన బస్సు సమర యాత్ర బుధవారం మధ్యాహ్నం డోన్‌కు చేరుకుంది. డోన్‌లో విద్యార్థి యువజన సంఘాల నాయకులు బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని పాతబస్టాండులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హాజరైన ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తీవ్రమైన మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు మేనల్లుడు సత్యనారాయణరాజు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నాయకులు లెనిన్‌బాబు, పరిచూరి శివారెడ్డి, రాజేంద్ర భాస్కర్‌, నంద్యాల జిల్లా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు ధనుంజయ, సూర్యప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు

కర్నూలు(న్యూసిటీ): ప్రత్యేక హోదా పేరుతో మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. విద్యార్థి యువజన సంఘాల-ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం అనంతపురంలో ప్రారంభమైన సమరయాత్ర సాయంత్రం నగరంలోని కలెక్టరేట్‌కు చేరింది. ఈ సంద ర్భంగా చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బీజేపీ చేసిన మోసంపై ఉద్యమబాట పట్టాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఈ పార్టీలకు గోరికడతామని హెచ్చ రించారు. అనంతరం డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌, సీపీఐ నగర కార్యదర్శి పి.రామ క్రిష్ణారెడ్డి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కారుమంచి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:26:05+05:30 IST