Byreddy Rajashekar Reddy: సిద్దేశ్వరం వద్ద తీగల వంతెన కట్టడం ఈ శతాబ్దంలో పెద్ద జోక్

ABN , First Publish Date - 2023-01-23T14:22:58+05:30 IST

సిద్దేశ్వరం వద్ద క్రిష్ణానదిపై బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తేనే రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

Byreddy Rajashekar Reddy: సిద్దేశ్వరం వద్ద తీగల వంతెన కట్టడం ఈ శతాబ్దంలో పెద్ద జోక్

కర్నూలు: సిద్దేశ్వరం వద్ద క్రిష్ణానదిపై బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తేనే రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (BJP Leader Byreddy Rajashekar Reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... క్రిష్ణా, పెన్నా నదులను పోగొట్టుకున్నామన్నారు. తమ భూముల త్యాగాల ఫలితం వల్లే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు. విద్యుత్ ఉత్పాదనకు ప్రత్యామ్నాయం ఉందని.... కానీ సముద్రంలో కలిసిన నీళ్లకు ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు కట్టాల్సిన సిద్దేశ్వరం వద్ద ఇప్పుడు తీగల వంతెన కట్టడం ఈ శతాబ్దంలో పెద్ద జోక్ అని యెద్దేవా చేశారు. సిద్దేశ్వరం వద్ద తీగల వంతెన కడితే ఎలాంటి నష్టం జరుగుతుందో సీఎం జగన్‌ (AP CM YS Jaganmohan Reddy)తో చర్చించేందుకు సిద్ధమని... టైమ్ డేట్‌ను జగన్ ఫిక్స్ చేయాలని ఆయన సవాల్ విసిరారు.

తీగల వంతెనతో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు చీమ కుట్టినంతైనా లేదని మండిపడ్డారు. గతంలో రాజధానిని, క్రిష్ణా పెన్నా నదులను తమ ప్రాంతం నుంచి తీసుకెళ్లి మోసం చేశారన్నారు. ఇప్పుడు సిద్దేశ్వరం వద్ద తీగెల వంతెనతో మరోసారి తమ గొంతు కోయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నం.1 అనేది పనికిరాని జీవో అన్నారు. జగన్ జీవోలే ఆయన్ను ముంచబోతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తేగానీ జగన్‌కు నిద్రపట్టదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-01-23T14:35:13+05:30 IST