యువగళంతో.. దుష్టపాలన అంతం

ABN , First Publish Date - 2023-01-26T00:39:56+05:30 IST

రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక, దుష్ట పరిపాలనను ప్రజలే అంతమొందించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ చెప్పారు.

యువగళంతో.. దుష్టపాలన అంతం
లంకమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం కు పాదయాత్ర

మోపిదేవి/అవనిగడ్డ టౌన్‌, జనవరి 25 : రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక, దుష్ట పరిపాలనను ప్రజలే అంతమొందించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ.. అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లంకమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం వరకు పాదయాత్ర బుధవారం నిర్వహించారు. ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. లోకేశ్‌ పాదయాత్ర విజయవంతం కావాలని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. గడిచిన మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను భరించలేక దానిని అంతమొందించాలని స్వచ్ఛందంగా ‘అవనిగడ్డ టూ మోపిదేవి’కి పాదయాత్రలో వేలాదిగా తరలిరావటమే నిదర్శనమన్నారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనే సంకల్ప ధ్యేయంగా రాష్ట్రప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌, అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు నడకుదిటి జనార్దనరావు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, తెలుగు మహిళలు, తెలుగుయువత నాయకులు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు..

మచిలీపట్నం టౌన్‌ : నారా లోకేశ్‌ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ బుధవారం మాజీ మంత్రి, టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర నీలిమ దంపతులు ప్రత్యేక అర్చనలు, హోమాలు నిర్వహించారు. యువగళం యాత్రకు ఏవిధమైన ఆటంకాలు కలగకుండా ఉండాలని చేసిన పూజల్లో టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, తలారి సోమశేఖర్‌, కుంచే నాని పాలపర్తి పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఓటమి భయంతోనే ఆంక్షలు : దేవినేని ఉమా

రెడ్డిగూడెం: ఓటమి భయంతోనే నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు, ఆటంకాలు సృష్టిస్తోందని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రెడ్డిగూడెంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, జగన్‌రెడ్డి పాదయాత్రలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కి పరిపాలన చేస్తుంటే మోస పోయిన ప్రజల తరపున ప్రజాగళమై పోరాడకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో కుప్పంలో యువగళం పాదయాత్రను జయప్రదం చేస్తామన్నారు. సమావేశంలో ముప్పిడి నాగేశ్వర రెడ్డి, పైడిమర్ల కిరణ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మలపల్లి కృష్ణారావు, ఉయ్యూరు రమేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యువగళం యాత్ర ఒక చరిత్ర : బొండా ఉమా

సత్యనారాయణపురం: జగన్మోహన్‌రెడ్డి పాలనకు నారా లోకేశ్‌ పాదయాత్ర సమాధానమని, ఈ పాదయాత్రతో వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్‌ నియోజకవర్గం టీఎన్‌టీయూసీ కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలంపాడు శివాలయం వద్ద బుధవారం యువగళం పాదయాత్ర జయప్రదం కావాలని కార్మిక సంఘాలు, టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఒక చరిత్ర అన్నారు. జగన్మోహన్‌రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రకార్యదర్శి నవనీతం సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, టీఎన్‌టీయూసీ సెంట్రల్‌ అధ్యక్షుడు చిన్న, కార్పొరేటర్‌ నెలిబండ్ల బాలస్వామి, మాజీ కార్పొరేటర్‌ పిన్నంరాజు త్రిమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:40:00+05:30 IST