వైభవంగా జలబిందెల మహోత్సవం

ABN , First Publish Date - 2023-02-07T01:24:46+05:30 IST

తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల మహోత్సవంలో రెండో ఘట్ట మైన అమ్మవారి జల బిందెల మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా జలబిందెల మహోత్సవం
తిరుపతమ్మ జలబిందెల మహోత్సవంలో పాల్గొన్న ఈవో, చైర్మన్‌, తహసీల్దార్‌

పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 6: తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల మహోత్సవంలో రెండో ఘట్ట మైన అమ్మవారి జల బిందెల మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. కర్ల, సూరంపల్లి, వడ్లమూడి, నల్లపునేని, గజ్జి వంశీయులు సతీష్‌, చైతన్య, మధుసూదనరావు, రామారావు, శివకృష్ణలు ఆలయం వద్ద నుంచి 5 కొత్త మట్టి కుండలను నింపుకొని మునేటిలోకి వెళ్లి ఆలయ ప్రధాన అర్చకుడు మర్రిబోయిన వెంకటరమణ, పురోహితుడు శివరాంభొట్ల ఆంజ నేయశర్మ ఆధ్వర్యంలో క్రతువులను నిర్వహించారు. మునేటిలో పూజల అనంతరం పవిత్ర జలా లతో నింపిన ఐదు జలబిందెల కుండలను తలపై పెట్టుకొని మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కొమ్ము, డప్పు వాయిద్యాలతో భారీ ఊరేగింపుగా పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. ఆచారం ప్రకారం జల బిందెలు పోలీస్‌స్టేషన్‌కు చేరగానే ఎస్సై ఎస్‌.హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఘన స్వాగతం పలికి స్టేషన్‌లో పూజలు చేశారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి జలబిందెలు చేరుకున్నాయి. ఈవో జీవీడీఎల్‌ లీలాకుమార్‌, చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు, ధర్మకర్తలు, సర్పంచ్‌ వేల్పుల పద్మకుమారి, తహసీల్దార్‌ కె.లక్ష్మీ కల్యాణి, వేల్పుల రవికుమార్‌ పాల్గొన్నారు. జగ్గయ్యపేట సీఐ అడపా నాగమురళి ఆధ్వర్యంలో ఎస్సై హరిప్రసాద్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2023-02-07T01:24:47+05:30 IST