జిల్లా ప్రగతికి పరిశ్రమలు దోహదం

ABN , First Publish Date - 2023-02-02T01:00:39+05:30 IST

పరిశ్రమలను స్థాపించడం ద్వారా జిల్లాలో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని, పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారులను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు ఆదేశించారు.

జిల్లా ప్రగతికి పరిశ్రమలు దోహదం
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ దిల్లీరావు

పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి.. పరిశ్రమల శాఖ అధికారులతో కలెక్టర్‌ దిల్లీరావు

కృష్ణలంక, ఫిబ్రవరి 1: పరిశ్రమలను స్థాపించడం ద్వారా జిల్లాలో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని, పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారులను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్సు హాలులో బుధవారం ఇండస్ర్టియల్‌ అండ్‌ ఎక్స్‌పోర్టు ప్రమోషన్‌ కమిటీ(డీఐఈపీసీ) జిల్లా సమావేశం కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ దిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థిక ప్రగతి మెరుగుపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం పథకంలో జనరల్‌, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.2,39,86,865 పెట్టుబడి, పావలా వడ్డీ, పవర్‌ టారిఫ్‌ సబ్సిడీ ప్రోత్సాహకాలను మంజూరు చేసేందుకు కమిటీ ఆమోదించిందన్నారు. పెట్టుబడి రాయితీ, స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, క్వాలిటీ సర్టిఫికేషన్‌, పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు లభిస్తున్నాయని చెప్పారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌లోని దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా పరిష్కరించాలన్నారు. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా పరిష్కరించాలన్నారు. పరిశ్రమల శాఖ జిల్లా అధికారి వై.వీరశేఖర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ కె.ఎస్‌.ఎస్‌.సీతారాం, ఎల్డీఎం కోటేశ్వరరావు, కాలుష్య నియం త్రణ మండలి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ టి.ప్రసాదరావు, డిప్యూటీ కమర్షియల్‌ టాక్స్‌ అధికారు లు నాగప్రసాద్‌, శ్రీనివాసబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T01:00:40+05:30 IST