వీసీ నియామకం ఎప్పడో..?

ABN , First Publish Date - 2023-01-26T00:40:52+05:30 IST

కృష్ణా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ పోస్టు కోసం అశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పోస్టు ఈసారి ఎవరిని వరిస్తుంది? ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారు? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవల కృష్ణా వర్సిటీ వీసీ పోస్టు కోసం నోటిఫికేషన్‌ జారీ చేయడం, 24 మంది దరఖాస్తులు చేసుకోవడం, నిబంధనల మేరకు ఈ నోటిఫికేషన్‌ జారీ కాలేదనే కారణం చూపి రద్దు చేయడం లాంటి పరిణామాలు జరిగాయి. మళ్లీ ఎప్పటికి కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు? ఎప్పటికి వీసీ పోస్టును భర్తీ చేస్తారు? అనే చర్చ నడుస్తోంది.

వీసీ నియామకం ఎప్పడో..?

కృష్ణా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం ఇటీవల 24 మంది దరఖాస్తులు

పాత నోటిఫికేషన్‌ రద్దు కారణంగా దరఖాస్తుల తిరస్కరణ

మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేస్తారని ప్రచారం

కృష్ణా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ పోస్టు కోసం అశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పోస్టు ఈసారి ఎవరిని వరిస్తుంది? ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారు? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవల కృష్ణా వర్సిటీ వీసీ పోస్టు కోసం నోటిఫికేషన్‌ జారీ చేయడం, 24 మంది దరఖాస్తులు చేసుకోవడం, నిబంధనల మేరకు ఈ నోటిఫికేషన్‌ జారీ కాలేదనే కారణం చూపి రద్దు చేయడం లాంటి పరిణామాలు జరిగాయి. మళ్లీ ఎప్పటికి కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు? ఎప్పటికి వీసీ పోస్టును భర్తీ చేస్తారు? అనే చర్చ నడుస్తోంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ వీసీ పోస్టు ఖాళీ ఏర్పడితే నెలల తరబడి ఈ పోస్టును భర్తీ చేయకుండా ఆలస్యం జరుగుతూనే ఉంది. గతంలోనూ ఇదే జరిగింది. ఈనెల 6వ తేదీన కృష్ణా వర్సిటీ వీసీ పోస్టు ఖాళీ అయ్యింది. దీనికి మూడు నెలల ముందే ఈ పోస్టు కోసం దరఖాస్తులు స్వీకరించి తదుపరి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ముందుగానే వీసీ పోస్టు భర్తీ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉన్నా గతంలో పనిచేసిన వీసీని ఆరునెలల పాటు కొనసాగిస్తారనే ప్రచారంతో ఆలస్యం చేశారు. పోస్టు భర్తీ కోసం తొలుత నోటిఫికేషన్‌ను జారీచేసి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు. గవర్నర్‌ ద్వారా నియమించబడిన ప్రతినిధి ఒకరు, ఇతరరాష్ర్టాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీల్లో పనిచేసే మరో ఇద్దరు సీనియర్‌ ప్రొఫెసర్లు సెర్చ్‌ కమిటీలో ప్రతినిధులుగా ఉంటారు. ఈ కమిటీ సభ్యులు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ముగ్గురిని ఎంపికచేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఈ నివేదికను ప్రభుత్వం గవర్నరుకు పంపితే ఆయన ఆమోదంతో వీసీ నియమామకం జరుగుతుంది.

ఈసారి బీసీ సామాజిక వర్గానికి పోస్టు

2008లో కృష్ణా యూనివ ర్సిటీ ఏర్పాటు చేశారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వీసీలు ఇక్కడ పనిచేశారు. తాజాగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన కేబీ చంద్రశేఖర్‌ వీసీగా పనిచేశారు. నాగార్జున యూనివర్సిటీ వీసీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సామాజిక సమీకరణలు, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కృష్ణా యూనివర్సిటీ వీసీ పోస్టును బీసీ సామాజిక వర్గానికి చెందినవారికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా రామమోహనరావు కొనసాగుతున్నారు.

అధికశాతం ఫ్రొఫెసర్లు విజయవాడలోనే నివాసం

కృష్ణా యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లలో అధికశాతం మంది స్థానికంగా నివాసం ఉండటం లేదు. పలువురు ఫ్రొఫసర్లు విజయవాడలోనే ఉంటూ ఇక్కడ విధులకు హాజరువుతున్నారు. రిజిస్ర్టార్‌ స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన ఉంది. ఆయన గుంటూరు జిల్లా నుంచి వస్తున్నారు. రిజిస్ర్టార్‌ గుంటూరు నుంచి వస్తుండటంతో, తోటి ప్రొఫెసర్లు విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి నిమ్మళంగా వచ్చి వెళుతున్నారు. ఇన్‌చార్జి వీసీ ప్రస్తుతం కొనసాగుతున్న సమయంలో ఆయన వారంలో రెండు రోజులపాటు కృష్ణావర్సిటీకి వచ్చి వెళుతున్నారు. రిజిస్ర్టార్‌ కూడా స్థానికంగా నివాసం ఉండకపోవడంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యూనివర్సిటీ రెక్టార్‌గా ఉన్న సూర్యచచంద్రరావుకు ఉన్నతవిద్యాశాఖ కీలకపోస్టులో అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన వారంలో అధికరోజులపాటు విజయవాడకే పరిమితమవుతున్నారు. వీసీ నియామకంతోపాటు, రిజిస్ర్టార్‌ స్థానికంగా నివాసం ఉంటేనే యూనివర్సిటీలో పరిపాలన సజావుగా కొనసాగే అవకాశం ఉంది.

Updated Date - 2023-01-26T00:40:53+05:30 IST