విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలి

ABN , First Publish Date - 2023-01-25T23:53:22+05:30 IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్‌ చేశారు. సీసీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్‌ ఎదుట బుధవారం సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలి

సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహారదీక్ష

కడప (సెవెన్‌రోడ్స్‌), జనవరి 25 : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్‌ చేశారు. సీసీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్‌ ఎదుట బుధవారం సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది బలిదానాలతో ఏర్పడిన ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న 40వేల మంది కార్మికులను రోడ్డుకీడ్చడం తగదన్నారు. ఈ పరిశ్రమను అంబానీ, ఆదానీలకు కట్టబెట్టాలని చూస్తున్న మోదీ, జగన్‌ల జోడీ ప్రభుత్వాలకు శంకరగిరిమాన్యాలు తప్పవని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తగదని కోరుతూ 710 రోజుల తరబడి కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. మోదీ అనుసరించే విధానాలకు సీఎం జగన్‌ డూడూ బసవన్నలా తల ఊపుతున్నారన్నారు. 25కు 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన జగన్‌ మెడలు వంచే సంగతి దేవుడెరుగు.. మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నార న్నారు. ఉక్కుపరిశ్రమపై ప్రధానితో మాట్లాడలేదని సీఎం ఈ రాషా్ట్రనికి పట్టిన దరిద్రమన్నారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణ ఆపాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని తన ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్‌.వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.క్రిష్ణమూర్తి, సుబ్బారెడ్డి, చంద్రశేకర్‌, వీరశేఖర్‌, వేణుగోపాల్‌, బషీరున్నీసా, పి.సుబ్బరాయుడు, శ్రీరాములు, సీపీఐ నగర సహాయ కార్యదర్శులుకేసీ బాదుల్లా, మద్దిలేటి, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు జకరయ్య, బాలు, రమణ, ఇమ్మానుయేల్‌, నాగే ష్‌, మల్లిఖార్జున, భాగ్యలక్ష్మి, లింగన్న, భీమరాజు, బ్రహ్మం, వలరాజు, నాగేశ్వర్‌రావు, మైనుద్దీన్‌, నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:53:26+05:30 IST