నలవీరగంగాభవానీ జాతర ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-06T23:02:19+05:30 IST

మదనపల్లె మండలం సీటీఎంలో వెలసిన నలవీరగంగాభవానీ అమ్మవారి జాతర ప్రారంభమైంది. సోమవారం ఉదయం నుంచే ఆలయంలో గంగమ్మను ప్రత్యేకంగా అలంకరణలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.

నలవీరగంగాభవానీ జాతర ప్రారంభం
విద్యుత్‌ దీపాలంకారంలో ఆలయం

అమ్మవారికి దీలు, బోనాలు సమర్పణ

మదనపల్లె అర్బన్‌, ఫిబ్రవరి 6: మదనపల్లె మండలం సీటీఎంలో వెలసిన నలవీరగంగాభవానీ అమ్మవారి జాతర ప్రారంభమైంది. సోమవారం ఉదయం నుంచే ఆలయంలో గంగమ్మను ప్రత్యేకంగా అలంకరణలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. గ్రామస్థులు అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారికి దీలు, బోనాలు ఊరేగింపుగా తీసుకొచ్చి నలవీరగంగాభవానికి సమర్పించారు. మదనపల్లె మండలం, సీటీఎం క్రాస్‌ పంచాయతీలోని మిట్టపల్లె నుంచి ప్రతి ఏడాది నిర్వహించే సీటీఎం గంగమ్మ జాతరకు రెడ్డెప్ప ఇంటి వద్ద నుంచి అమ్మవారికి చీరతో కూడిన బోనం, సారె ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ జాతర సోమవారం నుంచి గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయకమిటీ సభ్యులు సీటీఎం సర్పంచ్‌ సగినాల ఆనందపార్థసారథి, వెలుగు చంద్ర, ప్రతాప్‌ పారపట్ల సురేంద్రరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి మరుసటి రోజు సీటీఎం జాతరను నిర్వహిస్తారు. ఇందులో సీటీఎం, సీటీఎం క్రాస్‌, కొత్తవారిపల్లె, దుబ్బిగానిపల్లె పంచాయతీల్లోని 120 గ్రామాల ప్రజలు వైభవంగా జాతర చేస్తారు. ఈ జాతరకు ఈ గ్రామాలే కాకుండా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, హైదరాబాదు నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇటీవల అమ్మవారి ఆలయాన్ని కోటి ఇరవై లక్షలతో మరమ్మతు పనులు చేసి ఆలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని ఈ ఏడాది జాతరకు సుందరీకరణ చేశారు. అనంతరమే ఆలయంలో అమ్మవారి జాతర ప్రారంభమైంది. 6న సోమవారం సిద్ధుల భక్తి అమ్మవారిని సీటీఎం గ్రామ వీధుల్లో ఊరేగింపు, 7వ తేదీ రాత్రి తిరుణాల అమ్మవారి ఊరేగింపు, 8న పగలు తిరుణాల, 9న గురువారం దోపు తిరుణాలతో జాతర ముగుస్తుంది. కాగా దీంతో పాటు 9 నుంచి 13 వరకు సీటీఎంలో గొప్పగా ఎద్దుల పరుష నిర్వహిస్తారు.

జాతరలో ప్రత్యేక ఆకర్షణ చాందినీబండ్లు

జాతరలో ప్రత్యేక ఆకర్షణ చాందినీ బండ్లు. తమ మొక్కలు తీరిన భక్తులు చాందినీ బండ్లు కట్టి తమ మొక్కులను తీర్చుకుంటారు. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చాందినీ బండ్లు మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. దీంతో పాటు అన్నం బండ్లు, టెంకాయపట ్ల బండ్లు కూడా వందల సంఖ్యలో వస్తాయి. చాందినీ బండ్లు తిలకించడానికి సీటీఎంకు అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు జాతరలో పాల్గొంటారు. ఎక్కడ చూసినా జనంతో ఆలయ ఆవరణమే కాకుండా సీటీఎం మొత్తం జనసందోహంగా ఉంటుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నట్లు మదనపల్లె-2 డిపో డీఎం నిరంజన్‌ తెలిపారు. 7, 8, తేదీల్లో ఆర్టీసీ సర్వీసులు పది నిమిషాలకు ఒక్కటి సీటీఎం, మదనపల్లెకు నడుస్తాయని ఆయన చెప్పారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తాలుకా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-02-06T23:02:20+05:30 IST