కడప గడ్డపై నారా లోకేశ్‌కు నీరాజనం

ABN , First Publish Date - 2023-01-26T02:53:36+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు కడప గడ్డపై టీడీపీ శ్రేణులు నీరాజనం పలికారు. లోకేశ్‌ ఈనెల 27వ తేదీ కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువగళం పేరుతో మహాపాదయాత్ర

కడప గడ్డపై నారా లోకేశ్‌కు నీరాజనం

భారీ కాన్వాయ్‌తో ర్యాలీ

ఆరు చోట్ల క్రేన్లతో గజమాలలతో సత్కారం

దేవునికడప, పెద్దదర్గా, మరియాపురం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

నాలుగు గంటల పాటు కడపలో లోకేశ్‌ పర్యటన

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన మహాపాదయాత్రకు తొలిఅడుగులు కడప గడపలో ఘనంగా పడ్డాయి. 400 రోజులపాటు జరగనున్న 4000 కి.మీ పాదయాత్ర సందర్భంగా సర్వమత ప్రార్థనలకోసం కడపకు వచ్చిన ఆయనకు అడుగడుగునా జననీరాజనం పలికారు. వందలాది వాహనాలతో టీడీపీ శ్రేణులు ఆయన వెంట నడిచాయి.

కడప, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు కడప గడ్డపై టీడీపీ శ్రేణులు నీరాజనం పలికారు. లోకేశ్‌ ఈనెల 27వ తేదీ కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువగళం పేరుతో మహాపాదయాత్ర చేపట్టనున్నారు. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర విజయవంతం కోసం కడపలో సర్వమత ప్రార్థనలు చేశారు.

హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం 4.30 ప్రాంతంలో కడప విమానాశ్రయం చేరుకున్నారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు జిల్లాతో పాటు నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, కోస్తా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖ నేతలు తరలివచ్చారు. 5.10 గంటల ప్రాంతంలో కాన్వాయ్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. ఎయిర్‌పోర్టు బయటికి వచ్చేసరికి బయట పెద్ద సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలతో వాహనాల శ్రేణితో దేవునికడపకు బయల్దేరింది. దారి పొడవునా కాన్వాయ్‌లో కార్లు, ద్విచక్రవాహనాలు కలుస్తూ వచ్చాయి. ఎయిర్‌పోర్టు నుంచి దేవునికడప చేరుకునేందుకు సుమారు గంటా 15 నిమిషాలు పట్టింది. సాయంత్రం 6.50 గంటలకు దేవునికడపలోని శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని లోకేశ్‌ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లి ప్రసిద్ద్ధి చెందిన అమీన్‌పీర్‌ పెద్ద దర్గా చేరుకుని చాదర్‌ను సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతగురువుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మరియాపురంలోని కేథడ్రల్‌ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల ఆశీస్సులు అందుకున్నారు.

దారి పొడవునా..

సర్వమత ప్రార్థనల కోసంకడపకు వచ్చిన నారాలోకేశ్‌కు టీడీపీ శ్రేణులు దారి పొడవునా నీరాజనం పలికారు. లోకేశ్‌ పర్యటన ఎయిర్‌పోర్టు నుంచి ఇర్కాన్‌ సర్కిల్‌ రాజంపేట బైపాస్‌ మీదుగా దేవునికడప, అల్మా్‌సపేట మీదుగా మరియాపురం, ఐటీఐ సర్కిల్‌ వరకు సాగింది. దారి పొడవునా భారీ వాహన కాన్వాయ్‌ లోకేశ్‌ వెంట ఉంది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టు గేటు బయట క్రేన్‌ ద్వారా భారీ గజమాలతో స్వాగతం పలికారు. తరువాత ప్రముఖ వైద్యుడు క్రిష్ణకిశోర్‌రెడ్డి క్రేన్‌తో భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఇర్కాన్‌ సర్కిల్‌లో టీడీపీ సీనియర్‌ నేత లక్ష్మిరెడ్డి, మన్మోహన్‌రెడ్డి, కార్పొరేటరు ఉమాదేవి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం దేవునికడప వెళ్లే మార్గంలో టీడీపీ నేత సుబ్బారెడ్డి, అల్మా్‌సపేటలో జబీర్‌, ఐటీఐ సర్కిల్‌లో వికాస్‌ హరిక్రిష్ణతో పాటు పలువురు క్రేన్ల ద్వారా గజమాలతో సత్కరించారు.

ఘన స్వాగతం

యువగళం పేరుతో మహాపాదయాత్రకు పూనుకున్న లోకేశ్‌కు కడపలో ఘన స్వాగతం పలికారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, శివనాథరెడ్డి, రాజంపేట పార్లీమెంటరీ నేత గంటా నరహరి, కోవెలముడి రవీంద్ర, బండారు అప్పలనాయుడు, ఆదిరెడ్డివాసు, ఎంఎస్‌ రాజు, శ్రీరామ్‌ చినబాబు, బండారు శ్రావణి, భూమా విఖ్యాతరెడ్డి, బొజ్జల సుధీర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, జయనాగేశ్వర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ ్యక్షుడు లింగారెడ్డి, ఇన్‌చార్జిలు అమీర్‌బాబు, భూపేశ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రితీ్‌షకుమార్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబు, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌, లక్ష్మిరెడ్డి, మన్మోహన్‌రెడ్డి, కార్పొరేటరు ఉమాదేవి, వికాస్‌ హరిక్రిష్ణ, రాంప్రసాద్‌, మునిరెడ్డి, పీరయ్య, శివారెడ్డి, శివకొండారెడ్డి, భరత్‌రెడ్డి, జోగిరెడ్డి, పుత్తా చైతన్య, లక్ష్మిరెడ్డి, సుబ్బరాయుడు తదితర నేతలు పాల్గొన్నారు. కడప నగరంలో నాలుగు గంటల పాటు లోకేశ్‌ పర్యటన సాగింది. జై లోకేశ్‌ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. పర్యటన అనంతరం లోకేశ్‌ రాయచోటి మీదుగా తిరుమలకు బయల్దేరి వెళ్లారు. డీఎస్పీ శివారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీడీపీ శ్రేణుల ఆందోళన

లోకేశ్‌ కోసం టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. అయితే కొంతమంది నేతలను మాత్రమే ఎయిర్‌పోర్టులోకి అనుమతించారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి రెండు వాహనాల్లో ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గేటు నెట్టుకుంటూ ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. చివరికి బీటెక్‌ రవి వాహనాలను ఎయిర్‌పోర్టులోకి అనుమతించారు. దీంతో కార్యకర్తలు శాంతించారు.

దారి మారడంతో..

నారా లోకేశ్‌ షెడ్యూల్‌ ప్రకారం కడప పర్యటన ముగియగానే రాజంపేట మీదుగా తిరుమల వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు భాకరాపేట, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన రాకకోసం భారీ గజమాలలతో ఎదురుచూశారు. అయితే కడపలో భారీగా టీడీపీ శ్రేణులు రావడంతో ఇక్కడే సుమారు నాలుగు గంటల సమయం ఆయన ఉన్నారు. ఇక రాజంపేట మీదుగా తిరుమల వెళ్లడానికి సమయం సరిపోదనుకున్నారో ఏమో.. రాయచోటి మీదుగా వెళ్లిపోయారు. దీంతో దారిలో ఆయన కోసం ఎదుచూసిన రాజంపేట, కోడూరు నేతలు నిరాశకు లోనయ్యారు.

Updated Date - 2023-01-26T02:53:42+05:30 IST