మా భూమిని కాజేయాలని చూస్తే.. ఆత్మహత్యలే శరణ్యం

ABN , First Publish Date - 2023-02-07T00:00:24+05:30 IST

గడిచిన 70 సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూమిని కొంత మంది బడాబాబులు కుట్రపన్ని అక్రమంగా కాజేయాలని చూస్తున్నారంటూ రాయచోటి మండల పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామం నక్కావాండ్లపల్లెకు చెందిన నాయిబ్రాహ్మణ కుటుంబాలు తమ గోడును వెల్లబుచ్చారు.

మా భూమిని కాజేయాలని చూస్తే.. ఆత్మహత్యలే శరణ్యం
తమ గోడును తెలుపుతున్న నక్కావాండ్లపల్లె నాయీబ్రాహ్మణులు

70 ఏళ్లుగా మా పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్నాం

మాకు న్యాయం చేయండి

నక్కావాండ్లపల్లె వాసుల గోడు

రాయచోటిటౌన్‌, ఫిబ్రవరి 6: గడిచిన 70 సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూమిని కొంత మంది బడాబాబులు కుట్రపన్ని అక్రమంగా కాజేయాలని చూస్తున్నారంటూ రాయచోటి మండల పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామం నక్కావాండ్లపల్లెకు చెందిన నాయిబ్రాహ్మణ కుటుంబాలు తమ గోడును వెల్లబుచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన మిలటరీ వ్యక్తికి రెవెన్యూ అధికారులు తమ భూమిలో పట్టా ఇచ్చారని తెలుస్తోందని, అదే నిజమైతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు సాగు చేసుకుంటున్న పొలం వద్ద సోమవారం మీడియాతో తమ గోడును విన్నవించుకున్నారు. వివరాలిలా.. రాయచోటి మండల పరిధిలోని ఏపీ మోడల్‌స్కూల్‌కు సమీపంలో పట్టా నెంబరు 1650కి సంబంధించి సర్వే నెంబరు 2051/2లో 4.93 ఎకరాల భూమిని తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామంటూ దిగువ అబ్బవరం గ్రామం నక్కావాండ్లపల్లెలో నివాసం ఉంటున్న నాయిబ్రాహ్మణ కుటుంబానికి చెందిన కూటాలు వారసులుగా ఉన్న దేవపట్ల మనోహర్‌, దేవపట్ల సిద్దమ్మ, దేవపట్ల భయమ్మ, శ్రీనివాసులు, మోతాది వెంట్రమణ, దేవపట్ల కుమార్‌, దేవపట్ల సుమలత, దేవపట్ల భువనేశ్వరిలు తమ గోడును విన్నవించారు. అయితే ఇప్పుడు కొంత మంది రెవెన్యూ సిబ్బంది అక్రమంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మిలటరీ వ్యక్తి మహేశ్వర్‌రెడ్డికి పట్టా ఇచ్చినట్లు తెలిసిందని ఆరోపించారు. తమకు ఆ భూమి తప్ప వేరే ఆధారం లేదని, తాము కుల వృత్తిని నమ్ముకుని పొట్ట పోసుకునే వాళ్లమన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డితో పాటు ప్రస్తుత రాయచోటి తహసీల్దార్‌గా పనిచేస్తున్న రవిశంకర్‌రెడ్డిలతో పాటు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు భూమి వద్దకు వచ్చి చుట్టుపక్కల వారిని విచారించి ఆ భూమి తమదేనంటూ తేల్చి చెప్పార న్నారు. అయినప్పటికీ స్థానికంగా కొంత మంది సహాయంతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అలా జరిగితే పొలం వద్ద తాము పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. అంతేగాక గతంలో కూడా అప్పటి శిబ్యాల వీఆర్‌వో వద్దకు వెళ్లి తమకు పట్టాలు ఇవ్వాలంటూ దరఖాస్తు కూడా చేసుకున్నట్లు వారు తెలియజేశారు. ఈ సమస్యను ఇప్పటికే నాయిబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు, రాయచోటి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఇప్పటి కైనా రెవెన్యూ అధికారులు విచారించి తమకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేడుకొంటున్నారు. వీరివెంట చాకిబండ శంకర్‌, వన్నప్పగారి సంజీవ్‌లు ఉన్నారు.

Updated Date - 2023-02-07T00:00:25+05:30 IST