ఈ పరికరాలతో పని ఎలా చేయాలి

ABN , First Publish Date - 2023-02-01T23:06:03+05:30 IST

మున్సిపల్‌ శానిటరీ విభాగంలో పనిచేయడానికి అధికారులు తీసుకొచ్చిన నాసిరకం పరికరాలతో పనులు చేయలేమని పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని ఏఐటీయూసీ నాయకులతో కలసి వారు ఽధర్నా చేశారు.

ఈ పరికరాలతో పని ఎలా చేయాలి
మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న శానిటరీ సిబ్బంది, యూనియన్‌ నాయకులు

నాసిరకం పరికరాలతో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల ధర్నా

మదనపల్లె, ఫిబ్రవరి 1: మున్సిపల్‌ శానిటరీ విభాగంలో పనిచేయడానికి అధికారులు తీసుకొచ్చిన నాసిరకం పరికరాలతో పనులు చేయలేమని పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని ఏఐటీయూసీ నాయకులతో కలసి వారు ఽధర్నా చేశారు. పట్టణంలో చెత్త ఊడ్చడం నుంచి ఎత్తడం వరకూ కావాల్సిన దంతె, పలుగు, పార, పుస్సింగ్‌గార్డు, గోళం, చీపురు, బేసిన్‌, తదితర పరికరాలు ఏమాత్రం పనికిరావని వాపోయారు. వీటి కొనుగోలులో మున్సిపల్‌ అధికారులు అవినీతికి పాల్పడటంతో ఎన్నడూ లేని విధంగా నాసిరకం, కనీసం పట్టుకోవడానికి కూడా వీలుకాని వాటిని సరఫరా చేయడంపై మండిపడ్డారు. పట్టణ విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో తగినంత మంది కార్మికులు లేకపోగా, ఉన్నవారితోనే విధులు నిర్వహిస్తుండగా, సరైన పరికరాలు కూడా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన, ప్రస్తుతం తెప్పించిన పరికరాలను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న కార్మికులు, ఆ పనులు చేయిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు ఏమాత్రం సంబంధం లేకుండా తెప్పించారని వారు వాపోయారు. వీటితో పనులు చేయలేమని, వీటిని మార్చేసి గతంలో తెప్పించిన స్థాయి, సామర్థ్యం గల పరికరాలను తెప్పిస్తేనే పనులు చేస్తామని లేకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. శానిటరీ విభాగంలోని ఎఫ్‌-1 క్లర్క్‌ గిరిధర్‌ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై, కాసుల కక్కుర్తితో తెప్పించారని ధ్వజమెత్తారు. శానిటరీ విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ఏఈ, డీఈలను సైతం లెక్క చేయకుండా కమిషనర్‌ తరహాలో ఎఫ్‌-1 క్లర్క్‌ ప్రవర్తిస్తున్నారని, సామాగ్రి కొనగోలులో అవినీతికి పాల్పడిన గిరిధర్‌ను సప్పెండ్‌ చేయాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న డీఈ శిరీషకు వినతిపత్రం అందజేశారు. ఈ పరికరాలను వెనక్కి పంపించి నాణ్యమైన పరికరాలు తెప్పిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఎస్‌.మస్తాన్‌, సాంబ, దేవా, పోతులప్ప, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:06:04+05:30 IST