జౌళిశాఖలో ఆ ఉద్యోగిదే హవా..!

ABN , First Publish Date - 2023-02-07T02:43:53+05:30 IST

అది చేనేత జౌళిశాఖ కార్యాలయం. కడప కలెక్టరేట్‌ సముదాయ భవనంలో ఓ విభాగంగా సేవలందిస్తోంది. జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని అందిపుచ్చుకుని

జౌళిశాఖలో ఆ ఉద్యోగిదే హవా..!

ఆమ్యామ్యా ఇస్తేనే ప్రభుత్వ పథకాలకు ఎంపిక

లేదంటే బుట్టదాఖలవుతున్న దరఖాస్తులు

చోద్యం చూస్తున్న అధికారులు

లబోదిబో మంటున్న దరఖాస్తుదారులు

చేనేత జౌళి శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడంలో చేతివాటం చూపుతున్నారు. ఈయనకు ఆమ్యామ్యాలు సమర్పించకుంటే.. ఎన్ని అర్హతులున్నా ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయకుండా కొర్రీలు వేస్తున్నారు. దీంతో నిజమైన నేతన్నలు నష్టపోతున్నారు. ఈ విషయం తెలిసీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని నేతన్నలు వాపోతున్నారు.

కడప (మారుతీనగర్‌), ఫిబ్రవరి 6: అది చేనేత జౌళిశాఖ కార్యాలయం. కడప కలెక్టరేట్‌ సముదాయ భవనంలో ఓ విభాగంగా సేవలందిస్తోంది. జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని అందిపుచ్చుకుని తద్వారా ఆర్థిక పురోగతిని సాధించేందుకు మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నేతన్నలు ఆరాట పడుతుంటారు. కొంతమంది చేనేత కార్మికులు చేసిన అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటీకీ వృత్తినే నమ్ముకొని నేటికీ జిల్లాలో కడప తప్ప మిగతా కమలాపురం, వల్లూరు, ఖాజీపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, వేంపల్లి, సింహాద్రిపురం, ఒంటిమిట్ట, మాధవరం తదితర ప్రాంతాలలో చేనేత కార్మికులు సుమారు 20వేలకు పైగా ఉన్నారు. వీరిలో కేవలం 9 వేల మందికే నేతన్న నేస్తం పథకం వర్తిస్తుంది. మిగతా వారికి ఆ పథకం అందని ద్రాక్షలా మారిందనే ఆరోపణలున్నాయి.

అర్హతలున్నా.. ఆమ్యామ్యా ఇస్తేనే..

జిల్లా వ్యాప్తంగా చేనేత సొసైటీలు సుమారు 210 దాకా ఉన్నాయి. వీరిలో మరింత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందింప చేసి తద్వారా ఉపాధి అవకాశాలు మెరగుపరిచేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో కూడిన రుణాలను బ్యాంకులద్వారా, చేనేత జౌళి శాఖ ద్వారా అందిస్తున్నాయి. అంతేకాకుండా జీర్ణావస్థలో ఉన్న సొసైటీల పునరుద్ధరణకు, క్లస్టర్లకోసం, నూలు పట్టు, రాయితీలు, నూలు కేంద్రాలు (డిపోలు)తదితర వాటి కోసం నేతన్నలు జిల్లా కేంద్రంలో ఉన్న చేనేత జౌళిశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇస్తుంటారు. అయితే.. అన్ని అర్హతలున్నప్పటికీ అక ్కడ పనిచేసే ఓ ఉద్యోగికి ఆమ్యామ్యా ఇవ్వందే అర్హులుగా ఎంపిక కావడం అసాధ్యంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనకు చేయితడిపే వారికి మాత్రమే ఆయా పథకాలు అందుతాయి. మిగతా వారి దరఖాస్తులు బుట్టదాఖలే అన్నట్లుగా ఆ ఉద్యోగి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గత పది సంవత్సరాలుగా ఆ కార్యాలయంలోనే తిష్టవేసి మరీ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు పలువురు చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు.

వేరే జిల్లాకు బదిలీ అయినా..

ఆ ఉద్యోగికి మరో జిల్లాకు (అనంతపురం) బదిలీ అయినప్పటికీ వర్క్‌ ఆర్డర్‌ తెచ్చుకుని ఇక్కడే తిష్టవేసినట్లు సమాచారం. ఆ ఉద్యోగి సీటు, ఫైల్స్‌ కూడా అతని ఆధీనంలోనే ఉంచుకున్నారని పలువురు చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంగా కొంతమంది చేనేత కార్మికులు ఇక్కడి అధికారిని ప్రశ్నించడంతో అతను సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలాడని అంటున్నారు. దీంతో సదరు ఉద్యోగి చేసేదిలేక కొద్ది రోజులు కడప నుంచి అనంతపురం జిల్లాకు డ్యూటీ నిమిత్తం వెళ్లి.. తిరిగి కడప కార్యాలయంలోనే విధులు నిర్వహించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు తెలిసింది. అతను కడపలో లేని సమయంలో కార్యాలయంలోని అతని సెక్షన్‌ బాధ్యతలను ఇతరులకు ఇవ్వకుండా అలాగే అట్టిపెట్టి తిరిగి రాగానే అతగినకే కట్టబెట్టారనే ఆరోపణులున్నాయి.

ప్రధానంగా ఆ శాఖకు వచ్చే ప్రతీ పైస్థాయి అధికారిని ఆ ఉద్యోగి బుట్టలో వేసుకొని తన పబ్బం గడుపుకోవడమే పనిగా సేవలందిస్తున్నట్లు సమాచారం. డబ్బులిచ్చిన వారికే ఆయా ప్రభుత్వ స్కీమ్‌లు అందించడం, ఇవ్వని వారికి వివిధ కొర్రీలు వేసి ఆశాఖ అధికారిపై తోసి మొత్తంగా ఆ కార్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంగా సంబంధిత అధికారి సైతం చోద్యం చూస్తున్నారని నేతన్నలు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా ఆ ఉద్యోగి తీరును ప్రధాన కార్యాలయం అధికారులు కూడా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉద్యోగి కారణంగా పలువురు అర్హులైన చేనేత కార్మికులకు సరైన న్యాయం జరగడం లేదని, విచారణ జరిపి అతని వద్దనున్న ఫైల్స్‌ నిలుపుదల చేసి, ఇంతవరకూ అతను ప్రతిపాదించిన లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని పలువురు నేతన్నలు కోరుతున్నారు. ఈ విషయంగా సంబంధిత శాఖ ఏడీ భీమయ్యను వివరణ కోరగా తమ శాఖ కార్యాలయంలో పనిచేసే ఆ ఉద్యోగి గతంలో అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారని అన్నారు.

Updated Date - 2023-02-07T02:43:57+05:30 IST