రూ.5లక్షలు ఇవ్వండి

ABN , First Publish Date - 2023-02-07T02:47:58+05:30 IST

జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80లక్షలు ఏ మూలకు చాలదని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. యూనిట్‌ కాస్ట్‌ పెంచడంతో పాటు జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ సీపీఐ

రూ.5లక్షలు ఇవ్వండి

రూ.1.8లక్షలతో ఇల్లెలా కడతారు.?

జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించండి

కలెక్టరేట్‌లోకి ర్యాలీగా వెళ్లేందుకు సీపీఐ నేతల యత్నం

అడ్డుకున్న పోలీసులు... కింద పడ్డ నేతలు

ఉద్రిక్తత.. పడ్డచోటే కూర్చుని నిరసన

కడప, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80లక్షలు ఏ మూలకు చాలదని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. యూనిట్‌ కాస్ట్‌ పెంచడంతో పాటు జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ సీపీఐ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివతో పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జగనన్న లబ్ధిదారులతో కలిసి సీపీఐ నేతలు ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తూ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ నేరుగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారుల కష్టాలను ప్రభుత్వానికి వివరించేందుకు నిరసన చేస్తున్నామని కలెక్టరేట్‌లోకి ర్యాలీ అనుమతించాలని సీపీఐ నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే ససేమిరా అంటూ పోలీసులు గేటు ముందే నిలిపివేశారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు, లబ్ధిదారులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు గట్టిగా ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు సీపీఐ నాయకులను గేటు దాటనివ్వకూడదనే ఉద్దేశ్యంతో నేతలనే బలవంతంగా అడ్డుకున్నారు. లోపలికి వెళుతున్న కార్యకర్తలను అడ్డుకుని నెట్టేశారు. దీంతో గాలిచంద్ర, వెంకటశివ తదితరులు పోలీసుల ధాటికి కిందపడ్డారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్‌లోకి పోనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్‌ ఎదుట కిందపడ్డచోటే కూర్చుని ధర్నాకు దిగారు.

ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా జగన్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున జగనన్న ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని, అయితే సెంటు జాగాలో ఇంటి నిర్మాణానికి రూ.1.50లక్షలు మాత్రమే కేటాయించిందని అన్నారు. ఆ నిధులతో బేస్‌మట్టం కూడా పూర్తి కాదన్నారు. ఇళ్లు కట్టుకుందామంటే జగనన్న కాలనీలో కనీస వసతులు లేవన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన రోడ్లు, నీళ్లు, కరెంటు సౌకర్యం లేదన్నారు. ఇల్లు కట్టుకోకపోతే స్థలాలు తీసుకుంటామని అధికారులు బెదిరిస్తున్నారని, కనీస వసతులు లేకుండానే బెదిరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రస్తుతం స్టీలు, ఇనుము, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రి వ్యయం భారీగా పెరిగిందని ప్రభుత్వమిచ్చే రూ.1.80లక్షలు ఏ మూలకు సరిపోదని అన్నారు. జగనన్న కాలనీలో అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉచితంగానే ఇసుక, సిమెంటు, ఇనుము సప్లై చేసి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలన్నారు. ఇళ్లు కట్టుకోకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటామంటూ వలంటీర్లు, సచివాలయ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీంతో కొందరు అప్పులు తెచ్చి నిర్మాణం చేపడుతున్నా పూర్తి కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కడప నగర శివారులో, జమ్మలమడుగు వద్ద టిడ్కో ఇళ్లు పూర్తయినా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల టిడ్కో ఇళ్లు నిర్వీర్యంగా మారాయన్నారు. అక్కడంతా ముళ్లచెట్లు పెరుగుతున్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా టిడ్కో ఇళ్లు పూర్తయినా వాటిని లబ్ధిదారులకు అందించకపోవడంతో పేదలు అద్దెభవనాల్లో జీవిస్తున్నారన్నారు. ఇక జగనన్న ఇళ్లకు ఇచ్చే సాయం సరిపోక అప్పులు చేస్తున్నారని అన్నారు. నిజంగా పేదలపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఇచ్చే మొత్తం రూ.5లక్షలు పెంచాలన్నారు. ఈ సందర్భంగా సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు క్రిష్ణమూర్తి, నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్‌, సుబ్బారెడ్డి, వీరశేఖర్‌, సుబ్రమణ్యం, బాదుల్లా, గంగాసురేశ్‌, జక్కరయ్య, రాముడు, ఈశ్వరయ్య, మద్దిలేటి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T02:48:02+05:30 IST