జగనన్న ఇళ్లకు రూ.5 లక్షల ఇవ్వండి

ABN , First Publish Date - 2023-02-06T23:00:20+05:30 IST

జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు ఏమాత్రం సరిపోదని దానిని రూ.5 లక్షలకు పెంచి సిమెంటు, ఇసుక ఐరన్‌ ఉచితంగా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు.

జగనన్న ఇళ్లకు రూ.5 లక్షల ఇవ్వండి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

టిడ్కో గృహాలను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి

ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య

రాయచోటి (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6: జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు ఏమాత్రం సరిపోదని దానిని రూ.5 లక్షలకు పెంచి సిమెంటు, ఇసుక ఐరన్‌ ఉచితంగా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతున్న జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నాయకులు బినామీ పేర్లతో కొనుగోలు చేసి వాటిని తిరిగి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సిమెంటు, ఇసుక, స్టీల్‌తో పాటు ఇళ్ల నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రభుత్వం ఇచ్చే అరకొర డబ్బుతో పేదవారు ఇల్లు ఎలా నిర్మించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమిళనాడు ప్రభుత్వం రూ.4.50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి అదనంగా మూడు లక్షల రూపాయలు ఇస్తుంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అతి తక్కువ డబ్బులు ఇచ్చి త్వరగా ఇళ్లు పూర్తి చేయాలని లబ్ధిదారులను బెదిరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా టిడ్కో గృహాలను పూర్తిగా లబ్ధిదారులకు స్వాధీనం చేయడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. ఈనెల 22వ తేదీ జగనన్న కాలనీ ఇళ్ల లబ్ధిదారులు వేలాదిమంది చలో విజయవాడకు తరలిరావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్‌, రాష్ట్ర సమితి సభ్యుడు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యుడు సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సాంబశివ, విశ్వనాధ్‌నాయక్‌, జ్యోతి చిన్నయ్య, టీఎల్‌ వెంకటేష్‌, మనోహర్‌రెడ్డి, మురళి, సుధీర్‌కుమార్‌, కోటేశ్వరరావు, సుమిత్రమ్మ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రమణారెడ్డి, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:00:21+05:30 IST