గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

ABN , First Publish Date - 2023-02-01T23:14:57+05:30 IST

మండలంలోని కేశాపురం చెక్‌పోస్టు వద్ద కడప-బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఇండియన్‌ గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తాపడింది.

గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా
బోల్తా పడ్డ గ్యాస్‌ ట్యాంకర్‌

తప్పిన పెను ముప్పు

గ్యాస్‌ లీక్‌ అవుతుందంటూ పుకార్లు

భయాందోళనలో ప్రజలు

చిన్నమండెం, ఫిబ్రవరి 1: మండలంలోని కేశాపురం చెక్‌పోస్టు వద్ద కడప-బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఇండియన్‌ గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తాపడింది. ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిసిన వివరాల ప్రకారం... కేఏ01 ఏహెచ్‌ 4345 నెంబరు గల వాహనం గ్యాస్‌ నింపుకుని మడియార్‌ నుంచి కడపకు వస్తుండగా డ్రైవర్‌ మురుగేష్‌ కేశాపురం చెక్‌పోస్టు వద్దకు వచ్చేసరికి నిద్రమత్తులో పక్కనే ఉన్న టీఎన్‌88 8410 గల సిమెంటు ట్యాంకర్‌ను, మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. పక్కనే ఉన్న దుకాణాన్ని సైతం తగులుకుని జాతీయ రహదారి పక్కనే బోల్తా పడింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ, రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప, అగ్నిమాపక శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రామిరెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతుందన్న పుకార్లు రావడంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేశారు. ఐవోసీ కడప డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ధర్మారావు అక్కడకు చేరుకుని ట్యాంకర్‌ను పరిశీలించి ట్యాంకర్‌ నుంచి ఎలాంటి లీక్‌ కాలేదని ధ్రువీకరించడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కడప నుంచి ఐదు ఖాళీ ట్యాంకర్లను తెప్పించి బోల్తాపడిన ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ను ఖాళీ ట్యాంకర్లలో నింపారు. అయితే రాత్రి వరకు మూడు ట్యాంకర్లకు గ్యాస్‌ నింపారు. ఇంకా రెండు ట్యాంకర్ల గ్యాస్‌ ఉంటుందని అధికారుల అంచనాతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో సిమెంటు లారీతో పాటు రెండు ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనదారుడైన పసలవాండ్లపల్లెకు చెందిన మల్లికార్జున, గ్యాస్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ మురుగేషన్‌లు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-02-01T23:14:59+05:30 IST