సారా జోలికెళితే క్రిమినల్‌ కేసులు

ABN , First Publish Date - 2023-02-01T23:10:43+05:30 IST

నాటుసారా జోలికెళితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని మదనపల్లె ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో తాలూకా, ఎస్‌ఈబీ పోలీసులు బుధవారం తెల్లవారుజామున మదనపల్లె మండలంలోని నారమాకులతాండాలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు.

సారా జోలికెళితే క్రిమినల్‌ కేసులు
తాండా వాసులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

తాండాల్లో తయారీ, విక్రయాలపై నిఘా

నాటుసారా నివారణకు ప్రత్యేక చర్యలు

ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు

మదనపల్లె క్రైం, ఫిబ్రవరి 1: నాటుసారా జోలికెళితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని మదనపల్లె ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో తాలూకా, ఎస్‌ఈబీ పోలీసులు బుధవారం తెల్లవారుజామున మదనపల్లె మండలంలోని నారమాకులతాండాలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు పెద్దసంఖ్యలో గ్రామానికి చేరుకుని తాండాను చుట్టుముట్టి ఇళ్లల్లో తనిఖీలు చేశారు. అలాగే తాండా చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించి సారా తయారీ స్థావరాలపై దాడులు చేసి 2800 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. అలాగే 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అనంతరం తాండావాసులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నారమాకులతాండాలో భారీగా నాటుసారా తయారీ, విక్రయాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై నిఘా ఉంచామన్నారు.

ముఖ్యంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నివారణకు చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఎస్‌ఈబీ పోలీసులతో కలసి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ సారా నియంత్రణకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా తాండాల్లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు వివరించారు. గతంలో సారా కేసుల్లో పట్టుబడిన నిందితులను బైండోవర్‌ చేసి తహసీల్దార్‌ ఎదుట హాజరు పరుస్తున్నామన్నారు. అలాగే పదేపదే పట్టుబడుతున్న వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. పద్ధతి మార్చుకోకపోవడంతో పలువురు పాత నేరస్థులను ఇటీవల నగర బహిష్కరణ చేశామన్నారు. ముఖ్యంగా నారమాకులతాండా నుంచి భారీగా సారా సరఫరా అవుతోందన్నారు. చుట్టుపక్కల తాండాల్లో సారా తయారీ, విక్రయాలు అదుపులోకి వచ్చాయన్నారు. కానీ నారమాకులతాండాలో మాత్రం సారా ఏరులై పారుతోందన్నారు. సారా వ్యాపారానికి స్వస్తి చెప్పి వ్యవసాయ పనులు చేసుకోవాలన్నారు. అలాకాకుండా సారా తయారీ, విక్రయాలపై దృష్టి సారిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ఎలాంటి రికార్డుల్లేని ఏడు ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశామన్నారు. కార్యక్రమంలో సీఐలు సత్యనారాయణ, మురళీకృష్ణ, శివాంజనేయులు, ఎస్‌ఈబీ సీఐ మురళీకిశోర్‌, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:10:44+05:30 IST