ధాన్యం రైతులకు ఆన్‌లైన్‌ కష్టాలు

ABN , First Publish Date - 2023-02-02T01:20:40+05:30 IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అధికారులు అట్టహాసంగా ప్రకటిం చారు. ఇందుకోసం సంబంధిత రైతు ముందుగానే పంట నమోదు, ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపారు. ప్రభుత్వాధికారుల అన్ని ఆదేశా లను పాటించి, నిబంధనలను దాటుకొని చివరికి ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరిన రైతుకు కష్టాలు తప్పటం లేదు.

ధాన్యం రైతులకు ఆన్‌లైన్‌ కష్టాలు
కర్లపాలెం బైపాస్‌ పక్కనే నిలిపివున్న ధాన్యం లోడ్‌ చేసిన ట్రాక్టర్లు

వేబ్రిడ్జి వద్దే పడిగాపులు.. పనిచేయని వెబ్‌ పోర్టల్‌

బాపట్ల, ఫిబ్రవరి 1 : రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అధికారులు అట్టహాసంగా ప్రకటిం చారు. ఇందుకోసం సంబంధిత రైతు ముందుగానే పంట నమోదు, ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపారు. ప్రభుత్వాధికారుల అన్ని ఆదేశా లను పాటించి, నిబంధనలను దాటుకొని చివరికి ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరిన రైతుకు కష్టాలు తప్పటం లేదు. ధాన్యం శాంపిల్స్‌ చూయించటానికి, ధాన్యం తీసుకెళ్ళేందుకు అవసరమైన గోతాల కోసం రోజులతరబడి ఆర్బీకేల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ధాన్యం విక్రయించాలంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయించాల్సి ఉంది. ఈ క్రమంలో సర్వర్‌ పనిచేయక కార్యాలయాల వద్ద రైతులు పాట్లు పడాల్సి వస్తుంది. ముందుగా ట్రాక్టరును వేబ్రిడ్జిలో కాటా వేయించాలి, ఆ తర్వాత ధాన్యం లోడ్‌తో వచ్చి మళ్లీ కాటా వేయించాలి. అలాగే ఽధాన్యం లోడ్‌తో ఉన్న ట్రాక్టరు ఎదుట నిలబడి ఫోటో కూడా దిగాలి. ఇవన్ని సక్రమంగా జరిగి ధాన్యం మిల్లుకి తీసుకెళ్ళితే తేమశాతం అధికంగా ఉందని, ఇతర అనేక సాకులు చెప్పి బస్తాకు 4 నుంచి 8 కిలోల వరకు తగ్గింస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించే మద్దతుధర కోసం వెళితే కష్టాలు తప్పటంలేదంటూ వాపోతున్నారు. ఈ అవస్థలను పడలేక అనేకమంది తమ ధాన్యాన్ని దళారులకు, వ్యాపారులకు బస్తా రూ.1300 నుంచి రూ.1400 విక్రయించుకుంటున్నారు. వారు కూడా ప్రభుత్వం ఖాతాలో డబ్బులు వేసినప్పుడు ఇస్తా మని చెప్పటం రైతును మరింత ఇబ్బంది పెడుతుంది. ప్రతి ఆర్బీకేలో ఒక వలంటీలు నియమించి అతని ద్వారా కార్యకలాపాలు జరిపిస్తామని చెప్పినప్పటికి అక్కడ వలంటీరు ఆచూకే కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. అధికారులు చేసే ప్రకటనలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా ఉందని అంటున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.

జేసీ ఆదేశాలతో అధకారుల పరుగులు...

ధాన్యం తీసుకొచ్చి వేబ్రిడ్జి వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు ఆదేశాల మేరకు పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ శ్రీలక్ష్మీ సిబ్బంది గోపాలరెడ్డి తదితరులతో కలిసి కర్లపాలెం వేబ్రిడ్జి వద్దకెళ్ళారు. బుధవారం ఉదయం నుంచి రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి ఆన్‌లైన్‌లో మిల్లు కేటా యించకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. వెబ్‌ పోర్టల్‌ పనిచేయకపోవటంతో కొత్త ఫోర్టల్‌ ఓపెన్‌ చేయించి మిల్లులు కేటాయించే విధంగా చేశారు. రాత్రి వరకు మిల్లు ఆన్‌లైన్‌లో కేటాయించే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. రైతులు అధిక వ్యయ ప్రయాసాలతో ఒక్కరోజులో అమ్ముకోవాల్సిన ధాన్యాన్ని మూడు రోజులపాటు అధికారుల చుట్టూ తిరిగి అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ధాన్యం కొనుగోలు చేపడుతున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-02-02T01:20:45+05:30 IST