తెనాలి మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2023-01-26T01:07:41+05:30 IST

తెనాలి మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ బృందం సోదాలు చేపట్టింది.

తెనాలి మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

తెనాలి, జనవరి 25: తెనాలి మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ బృందం సోదాలు చేపట్టింది. పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతిపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది కార్యాలయానికి చేరుకున్నారు. 20 మంది సిబ్బంది టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, సర్వే విభాగాలను పరిశీలించేందుకు రావడం మున్సిపల్‌ సిబ్బందిని ముచ్చెమటలు పట్టించింది. అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ వద్ద నిబంధనల ప్రకారం రూ.వెయ్యికి మించి నగదు ఉండకూడదు, అంతకన్న ఎక్కువ ఉంటే రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉండగా ఏసీబీ తనిఖీల్లో ఆయన వద్ద రూ.4 వేలు ఉన్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా భవనాల నిర్మాణం, అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం, రెసిడెన్షియల్‌ అనుమతులతో కమర్షియల్‌ వినియోగం వంటి పలు ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని డీఎస్పీ విలేకరులకు తెలిపారు. సర్వే విభాగంలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామన్నారు. రెవెన్యూ విభాగంలో కూడా సిబ్బంది పరిశీలన చేస్తున్నారని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే 14400కు ఫిర్యాదు చేయాలని కోరారు. తనిఖీలు పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

Updated Date - 2023-01-26T01:07:41+05:30 IST